పింఛిన్ ఇయ్యిండ్రి.. బాంచెన్

పింఛిన్ ఇయ్యిండ్రి.. బాంచెన్ - Sakshi


* 30 ఏళ్ల కిందటి సర్టిఫికెట్లు ఎట్లా దేవాలి

* వితంతు, ఒంటరి మహిళల ఆవేదన

* అభాగ్యులను ఆదుకోవాలని ఆందోళన


వెల్దుర్తి: ‘ఏండ్ల కిందట సచ్చిపోయినోళ్ల కాయిదాలు దెమ్మంటె యాడదెచ్చేది..? అవి లేకుంటె పింఛన్ కట్ జేస్తమని రాస్కపోనొచ్చిన సారు గట్టిగ బెదిరియ్యవట్టె. ఇగ మాకు పింఛిని రాకుంటె మా గతేమైతదో.. దండం బెడతాం బాంచెన్ పింఛిన్ ఇయ్యుండ్రి’’ అంటూ మండల పరిధిలోని మాసాయిపేటని పలువురు వితంతువులు, ఒంటరి మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. విధి వక్రీకరించి భర్తలను కోల్పోయిన తమను ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సమంజసమని వారు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు మాట్లాడుతూ, భర్తలను కోల్పోయిన తాము వితంతు పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్నామని తెలిపారు.



ఈ సందర్భంగా పలువురు మహిళలు మాట్లాడుతూ, తమకు పెన్షన్ రావాలంటే తప్పకుండా మరణ ధ్రువీకరణ పత్రాలు తీసుకురాల్సిందేనని ఈఓపీఆర్‌డీ జైపాల్‌రెడ్డి హెచ్చరించారన్నారు. 30 ఏళ్ల క్రితం చనిపోయిన వారి సర్టిఫికెట్లు ఎలా తెచ్చేదని ప్రశ్నించారు. మరికొంత మంది మహిళలు మాట్లాడుతూ.. తమ భర్తలు 20 ఏళ్ల క్రితమే తమను వదిలిపెట్టి వెళ్లిపోయారని, వారి వివరాలు ఎలా తేవాలంటూ వాపోయారు. విషయం తెలుసుకున్న తహశీల్దార్ రమాదేవి గ్రామానికి చేరుకుని వారితో మాట్లాడారు. పలువురు మహిళలు కంటతడి పెడుతూ తమ గోడును తహశీల్దార్‌కు విన్నవించారు.



దీనిపై స్పందించిన తహశీల్దార్ ఈఓపీఆర్‌డీకి ఫోన్  చేయగా ఆయన అందుబాటులోకి రాలేదు. దీంతో ఆగ్రహించిన తహసీల్దార్ ఈఓపీఆర్డీపై మెదక్ ఆర్డీఓకు ఫిర్యాదు చేశారు. ఎంపీడీఓ దామోదర్‌రెడ్డి ఫోన్‌లో మాట్లాడుతూ.. వితంతు మహిళలకు స్థానిక పంచాయతీ కార్యదర్శి నుంచి సర్టిఫికెట్ అవసరమని, మహిళలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామని తెలిపారు. ఈఓపీఆర్‌డీ విధులకు గైర్హాజరు కావడంతో తహశీల్దార్ రమాదేవి ఇంటింటి  సర్వే చేపట్టారు. స్థానిక ఎంపీటీసీ  సిద్దిరాములుగౌడ్, ఉప సర్పంచ్ శ్రీకాంత్‌రెడ్డి తదితరులు ఈఓపీఆర్డీపై అసహనం వ్యక్తం చేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top