కట్టించిందెవరు..

కట్టించిందెవరు.. - Sakshi


నల్లగొండ: నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు కొత్త లొల్లి మొదలైంది. ఈ గొడవ ఏదో పదవి కోసమో.. ఎమ్మెల్యే, ఎంపీ సీటు కోసమో లేక త్వరలోనే ఎంపిక చేయాల్సిన ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం కోసం కాదండోయ్... పార్టీ జిల్లా కార్యాలయ భవన నిర్మాణ పేటెంట్ కోసం. ఈ భవన నిర్మాణ బాధ్యతలను తామంటే తామే మోశామని పోటీలు పడుతున్నారు జిల్లా కాంగ్రెస్ నాయకులు.



నల్లగొండ జిల్లా కేంద్రంలోని ప్రకాశం బజార్‌లో నిర్మించిన కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయం కోసం శ్రమించింది తానేనని, పునాదుల నుంచి అన్నీ తానై సమకూర్చుకున్నానని ప్రస్తుత సీఎల్పీ నేత కె.జానారెడ్డి అంటుండగా, తాను అధ్యక్షుడిగా ఉన్న కాలంలోనే ఈ భవన నిర్మాణం ప్రారంభమైందని, తాను మాత్రం ఎవరి నుంచీ వస్తు లేదా నగదు రూపంలో ఎలాంటి విరాళాలు సేకరించలేదని అంటున్నారు డీసీసీ మాజీ అధ్యక్షుడు తూడి దేవేందర్‌రెడ్డి. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన గాంధీజీ వర్ధంతి కార్యక్రమంలో మాజీ మంత్రి జానారెడ్డి చేసిన వ్యాఖ్యలు, దీనికి తూడి స్పందించిన తీరు ఇప్పుడు జిల్లా కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.



అసలేం జరిగిందంటే..

జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో జిల్లా పార్టీ కార్యాలయంలో శుక్రవారం గాంధీజీ వర్ధంతి కార్యక్రమం జరిగింది. దీనికి సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు బూడిద భిక్షమయ్యగౌడ్‌లతో పాటు జిల్లా కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు. సమావేశంలో భాగంగా భిక్షమయ్యగౌడ్ మాట్లాడుతూ జిల్లా కాంగ్రెస్ పార్టీ భవన నిర్మాణానికి జిల్లా పార్టీ మాజీ అధ్యక్షుడు తూడి దేవేందర్‌రెడ్డి ఎంతగానో శ్రమించారని, తన సొంత డబ్బులు ఖర్చుపెట్టుకుని దీనిని నిర్మించిన ఆయనకు ప్రత్యేకంగా సన్మానం ఏర్పాటు చేయాలని వ్యాఖ్యానించారు.



అక్కడే అసలు లొల్లి మొదలైంది. బూడిద వ్యాఖ్యల పట్ల జానా స్పందించారు. తను ప్రసంగిస్తున్న సమయంలో ఈ విషయమై జానా మాట్లాడుతూ జిల్లా కాంగ్రెస్ భవన నిర్మాణానికి పునాదుల నుంచీ అన్నీ తానే చూసుకున్నానని, ఇందుకు అవసరమైన సిమెంటుతోపాటు ఇతర నిర్మాణ సామగ్రిని తానే సమకూర్చి పెట్టానని వ్యాఖ్యానించారు. మిగిలిపోయిన భవన నిర్మాణ బాధ్యతలను కూడా తానే తీసుకుంటానని భరోసా ఇచ్చారు.



నా సొంత డబ్బులు పెట్టుకున్నా..

జానా వ్యాఖ్యలపై డీసీసీ మాజీ అధ్యక్షుడు తూడి దేవేందర్‌రెడ్డి కూడా ఘాటుగానే స్పందించారు. జానా వ్యాఖ్యలను ఎక్కడా ప్రస్తావించకుండానే తాను పార్టీ కార్యాలయం భవన నిర్మాణం కోసం ఏం చేశాననే విషయాన్ని వివరిస్తూ శుక్రవారం సాయంత్రం ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. తాను అధ్యక్షుడిగా కొనసాగిన కాలంలో కార్యాలయ నిర్మాణం కోసం తన సొంత డబ్బులు వెచ్చించానని, పార్టీ వ్యవహారాలకు గానీ, భవన నిర్మాణానికి గానీ ఎవరి నుంచీ వస్తు లేదా నగదు రూపంలో ఎలాంటి విరాళాలు తీసుకోలేదని అందులో పేర్కొన్నారు.



కాంగ్రెస్ నాయకుల నుంచి తాను డబ్బులు తీసుకోలేదని పేర్కొన్నారు. తాను డీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టే సమయానికి ఆ స్థలంలో ఎలాంటి నిర్మాణం లేదని, తానే పునాదు తీయించి భవనాన్ని నిర్మించానని వెల్లడించారు. గతంలో ఉన్న డిజైన్ మార్చి తానే వాస్తు ప్రకారం నిర్మాణం చేపట్టానని తెలిపారు. దీనిపై తూడి 'సాక్షి'తో మాట్లాడుతూ ఎవరేం మాట్లాడారో తనకు తెలియదని, తాను చెప్పదల్చుకున్నది పత్రికలకు చెప్పానని పేర్కొన్నారు.



ఒక్క పార్టీ కార్యాలయం నిర్మాణానికే కాకుండా, పార్టీ సభలకు కూడా తానే డబ్బులు వెచ్చించానన్నారు. తెలంగాణలో పార్టీ తరఫున ఎవరూ తిరగలేని పరిస్థితుల్లో అప్పటి పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో మిర్యాలగూడలో సమావేశం ఏర్పాటు చేయించి, లక్షల రూపాయలు ఖర్చు పెట్టానన్నారు. వేదిక ఏర్పాటుకు గానీ, జనసమీకరణకు గానీ ఏ పార్టీ నాయకుడూ తనకు రూపాయి ఇవ్వలేదని, ఇప్పుడు ఇలా మాట్లాడుతుంటే బాధ కలుగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేయడం గమనార్హం. ఈ నేపథ్యంలో డీసీసీ భవన నిర్మాణంపై పేటెంట్ కోసం జరుగుతున్న లొల్లి ఏ మలుపులు తిరుగుతుందో.. కాంగ్రెస్ నేతలు ఎవరేం మాట్లాడుతారో... తూడి, జానాల్లో ఎవరికి పేటెంట్ ఇస్తారో వేచిచూడాల్సిందే.



నేను డీసీసీ అధ్యక్షుడిగా

బాధ్యతలు చేపట్టే సమయానికి ఆ స్థలంలో ఎలాంటి నిర్మాణమూ లేదు. బునాది తీయించి భవనాన్ని నిర్మించా. నిర్మాణానికి నా సొంత డబ్బులు వెచ్చించా. ఎవరి నుంచీ వస్తు లేదా నగదు రూపంలో విరాళాలు తీసుకోలేదు. - తూడి దేవేందర్‌రెడ్డి, డీసీసీ మాజీ అధ్యక్షుడు.


పునాదుల నుంచీ నేనే..

జిల్లా కాంగ్రెస్ భవన నిర్మాణానికి పునాదుల నుంచీ అన్నీ నేనే చూసుకున్నా. సిమెంటుతోపాటు ఇతర నిర్మాణ సామగ్రిని సమకూర్చిపెట్టా. మిగిలిపోయిన భవన నిర్మాణ బాధ్యతలను కూడా నేనే తీసుకుంటా.

- కుందూరు జానారెడ్డి, సీఎల్పీ నేత.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top