నందు ఎవరు?

రాజీవ్, శ్రవణ్‌లను  కస్టడీకి తీసుకుంటున్న పోలీసులు


♦  శిరీష కేసులో రాజీవ్, శ్రవణ్‌ను ప్రశ్నిస్తున్న పోలీసులు

♦  నిందితులకు రెండు రోజుల పోలీసు కస్టడీ


     

హైదరాబాద్‌: మేకప్‌ ఆర్టిస్ట్‌ శిరీష అనుమానాస్పద మృతి కేసులో నిందితులుగా ఉన్న బోదాసు శ్రావణ్‌కుమార్‌ అలియాస్‌ శ్రవణ్, వల్లభనేని రాజీవ్‌త్రివిక్రమ్‌ అలియాస్‌ రాజీవ్‌లను విచారణ నిమిత్తం బంజారాహిల్స్‌ పోలీసులు సోమవారం తమ కస్టడీలోకి తీసుకున్నారు. చంచల్‌గూడ జైల్లో రిమాండ్‌ ఖైదీలుగా ఉన్న ఇరువురినీ బంజారాహిల్స్‌ పోలీసు స్టేషన్‌కు తరలించారు. వీరిద్దరినీ రెండు రోజుల పోలీసు కస్టడీకి అప్పగిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులిచ్చిన నేపథ్యంలో... అడ్వొకేట్‌ సమక్షంలో పోలీసులు విచారిస్తున్నారు.


పది కోణాల్లో ప్రశ్నావళి...

ఈ నెల 13 తెల్లవారుజామున షేక్‌పేట్‌లోని రాజీ వ్‌కు సంబంధించిన ఆర్‌జే ఫొటోగ్రఫీ కార్యాలయం గదిలో శిరీష ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి రాజీవ్, శ్రవణ్‌ల నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు పోలీసులు విచారణ ప్రారంభించారు. వీరి అరెస్టు తర్వాత శిరీష–నందు–నవీన్‌ మధ్య జరిగిన సంభాషణలంటూ కొన్ని ఆడియోలు బయటకు వచ్చాయి. వీటిపైనా పోలీసులు రాజీవ్, శ్రవణ్‌లను ప్రశ్నిస్తున్నారు. నందు ఎవరనే దానిపై రాజీవ్, శ్రవణ్‌ నుంచి వివరాలు రాబడుతున్నారు. అయితే తమకు నందు, అతడి స్నేహితుడైన నవీన్‌ ఎవరో తెలియదని, బహుశా శిరీష స్నేహితులై ఉండవచ్చని చెప్పినట్లు తెలిసింది. మొత్తమ్మీద పది కోణాల్లో వివిధ ప్రశ్నలతో కూడిన ప్రశ్నావళి తయారు చేసుకున్న పోలీసులు దాని ఆధారంగా ప్రశ్నిస్తున్నారు.



రాజీవ్‌–శిరీష గొడవలపై ఆరా

శిరీషపై అత్యాచారం జరిగిందని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో మరింత లోతుగా నిందితుల్ని విచారిస్తున్నారు. తాము కాస్త తెరిచి ఉన్న తలుపు సందులోంచి చూసినప్పుడు ఎస్సై.. శిరీషపై అత్యాచారయత్నం చేస్తున్నట్లు కనిపించిందని, వెంటనే తాము లోపలకు వెళ్లగా కోపంతో అతను తమను బయటకు పంపించాడని నిందితులు వెల్లడించారు. ఎస్సై ప్రభాకర్‌రెడ్డి అనుచిత ప్రవర్తన శిరీషను బాగా కుంగదీసిందని... కారులో తను పలుమార్లు లెంపలేసుకుందని చెప్పుకొచ్చారు.


ఆమె అవమాన భారంతోనే ఆత్మహత్య చేసుకుని ఉంటుందని రాజీవ్, శ్రవణ్‌ వివరించారు. ప్రయాణ సమయంలో రెండు, మూడు సార్లు తాను ఆమెను కొట్టిన విషయం నిజమేనని రాజీవ్‌ చెప్పాడు. మంగళవారం కూడా పోలీసులు వీరిని విచారించనున్నారు. రాజీవ్‌కు తెలియకుండా తాను, శిరీష తరచుగా కలుస్తుండేవారమని శ్రవణ్‌ తెలిపాడు. శిరీష కేసుకు, ఎస్సై ప్రభాకర్‌రెడ్డి కేసుకు లింకులున్న నేపథ్యంలో ఆ కేసు విచారణాధికారిగా ఉన్న సంగారెడ్డి డీఎస్పీ తిరుపతన్న సైతం బంజారాహిల్స్‌ పోలీసుస్టేషన్‌కు వచ్చి నిందితుల్ని విచారిస్తున్నారు.


ఎస్సై క్వార్టర్స్‌లో ఏం జరిగింది..!

ఈ నెల 12 ఉదయం 8 గంటల సమయంలో శిరీష ఆర్‌జే ఫొటోగ్రఫీ కార్యాలయానికి రాగా, గంట తర్వాత రాజీవ్‌.. మరో గంటకు శ్రవణ్‌ వచ్చినట్లు విచారణలో వెల్లడైంది. గత నెల 30న రాజీవ్‌ ప్రియురాలు తేజస్విని వచ్చి గొడవ చేయడమే కాకుండా, పోలీసులకు ఫిర్యాదు చేస్తానని, శిరీష అంతుచూస్తానని హెచ్చరించిందని నిందితులు చెప్పారు. ఈ నేపథ్యంలో ఆమెను అడ్డు తొలగించుకోవడానికి ఏం చేయాలన్న దానిపై చర్చించేందుకు ముగ్గురం కలసి బంజారాహిల్స్‌ రోడ్‌ నం.10లోని కప్పా కాఫీ షాప్‌నకు వెళ్లి, అక్కడ మూడు గంటల పాటు సమాలోచనలు జరిపామన్నారు.


శ్రవణ్‌ సూచించిన మేరకే ముగ్గురం కలసి కుకునూర్‌పల్లి ఎస్సై ప్రభాకర్‌రెడ్డి వద్దకు వెళ్లామని రాజీవ్‌ అంగీకరించాడు. బంజారాహిల్స్‌ రోడ్‌ నెం. 3లోని మండల కార్యాలయం ఎదురుగా ఉన్న వైన్‌షాప్‌లో మద్యం కొనుగోలు చేసి రాయదుర్గం ప్రాంతంలో కబాబ్‌లు తీసుకొని కుకునూర్‌పల్లికి బయల్దేరామని నిందితులు పోలీసులకు చెప్పారు. ఆ రోజు రాత్రి ఎస్సై ప్రభాకర్‌రెడ్డి క్వార్టర్స్‌లో ఏం జరిగిందనే దానిపై అధికారులు కూపీ లాగుతున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top