ఇంతకీ మన జనం ఎంత..?!

ఇంతకీ మన జనం ఎంత..?! - Sakshi


‘గ్రేటర్’లో మరో సర్వే!



కోటి దాటామా.. లేదా

తొలి సమగ్ర సర్వేతో స్పష్టత రాని పరిస్థితి

కంప్యూటరీకరణ పూర్తయ్యాక వివరాల్లో వ్యత్యాసం

అప్పుడు నమోదు కానివారి సంఖ్యా అధికమే

హైదరాబాద్ జనాభా ఎంతన్నది శేషప్రశ్నే

ప్రభుత్వ నిర్ణయంతోనే గందరగోళానికి తెర


 

 హైదరాబాద్: జీహెచ్‌ఎంసీలో మిగిలిపోయిన కుటుంబాల కోసం మరోమారు సమగ్ర కుటుంబసర్వే జరుగనుందా? ఇప్పుడు ఇదే హాట్ టాపిక్‌గా మారింది. గ్రేటర్ జనాభా కోటి దాటిందని ఓవైపు భావిస్తుండగా, సమగ్రకుటుంబసర్వే వివరాలు  కంప్యూటరీకరణ పూర్తయ్యాక వెల్లడైన వివరాల ప్రకారం  కోటికి చేరువలో కూడా లేకపోవడమే సందేహాలకు తావిస్తోంది. మరోవైపు  ఇప్పటికీ సర్వేరోజు ఎన్యూమరేటర్లు తమ ఇళ్ల వద్దకు రాలేదని పలువురు ఫిర్యాదులు చేస్తున్నారు.



మరో లెక్కింపు అవసరమేమో...



గ్రేటర్‌లో కొత్త పథకాలు ప్రారంభించాలన్నా.. ఆశించిన వర్గాలకు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలన్నా సర్వే వివరాలే కీలకం . ఈ నేపథ్యంలో నగరంలోని కుటుంబాలు ఎన్ని, జనాభా సంఖ్య ఎంత అనేది కచ్చితంగా తెలుసుకునేందుకు మరోమారు సర్వే అవసరమనే అభిప్రాయం అంతటా వ్యక్తమవుతోంది. గతనెల 19న సర్వే ముగిశాక సైతం నగరంలో మిగిలిపోయిన కుటుంబాల వారి కోసం మరోమారు సర్వే చేపడతామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.ఆ ప్రకారమైనా మిగిలిపోయిన వారి కోసం మరోమారు సర్వే జరుపుతామని జీహెచ్‌ఎంసీ కమిషనర్ సైతం అంటున్నారు. దాంతో అంతా కొత్త సర్వే తేదీ కోసం ఎదురు చూస్తున్నారు.



లెక్క తేల్చాల్సిందే...



మిగిలిపోయిన వారిలో కొందరు మాత్రమే జీహెచ్‌ఎంసీ సర్కిల్‌కార్యాలయాలకు స్వయంగా వెళ్లి తమ వివరాలు అందజేశారు. ఈ కారణంగా మిగిలిపోయిన కుటుంబాలు అంతగా ఉండకపోవచ్చునని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రజలు మాత్రం తమ వివరాలు నమోదు కాలేదని చెబుతున్నారు. వీరి వివరాలు నమోదైతేనే గ్రేటర్ వాస్తవ జనాభా ఎంతో తెలిసే వీలుంది. సర్వే జరిగిన రోజున స్వగ్రామాలకు వెళ్లినందున , మళ్లీ  చేపడితే తిరిగి వారంతా ఇక్కడ కూడా తమ వివరాలు నమోదుచేసుకోగలరనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. వాస్తవానికి గ్రామాల్లో  నమోదు చేసుకున్న వారు కూడా హైదరాబాదులోనే నిత్యజీవనం సాగిస్తున్నారు. దీని వల్ల కూడా జనాభాలో వ్యత్యాసానికి అవకాశం ఏర్పడింది. రెండు చోట్ల పేర్లు నమోదు చేయించుకుంటే..  సంక్షేమ పథకాలు, రాయితీలు వంటి వాటి లబ్ధి విషయంలో తేడా వచ్చే అవకాశం ఉందని కొందరు అధికారులు అంటున్నారు.



ఈ కారణం చూపి వాస్తవ జనాభా లెక్కలు తేల్చక పోతే అసలుకే మోసం వచ్చే అవకాశమూ ఉందని మరి కొందరి వాదన. డబుల్ ఎంట్రీలకు ఏదో రకంగా చెక్ చెప్పొచ్చనీ  అసలు గ్రేటర్‌లో ఉండే వారెందరన్నది తేల్చడం ముఖ్యమని అధికులు అభిప్రాయ పడుతున్నారు.  వివరాలు నమోదు కాని వారికోసం మరో సర్వే నిర్వహించేందుకు ప్రభుత్వమూ సుముఖంగా ఉన్న కారణంగా  వెంటనే సర్వే చేపట్టి నిగ్గు తేల్చాలని  నగరవాసులు అభిప్రాయ పడుతున్నారు. ఈ సంక్లిష్టతకు ప్రభుత్వమే నిర్ణయం తీసుకొని స్పష్టీకరించాల్సిన అవసరం ఉంది.

 

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top