‘ఎస్కలేషన్’పై ఏం చేద్దాం..!

‘ఎస్కలేషన్’పై ఏం చేద్దాం..! - Sakshi


సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులకు పెరిగిన ధరలకు అనుగుణంగా ధరల పెంపు (ఎస్కలేషన్) జరపాలనే కాంట్రాక్టర్ల డిమాండ్‌పై ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది. ఎస్కలేషన్‌పై ఉమ్మడి రాష్ర్ట ప్రభుత్వం ఇచ్చిన జీవో 13ను కొద్దిపాటి మార్పులతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న మాదిరే రాష్ట్రం సైతం అమలు చేయాలని కాంట్రాక్టర్లు కోరుతున్నారు. లేనిపక్షంలో మిగిలిపోయిన ప్రాజెక్టు పనులను కొనసాగించడం కష్టమని వారు తెగేసి చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ విషయంపై త్వరితగతిన ఒక నిర్ణయానికి రావాలని ప్రభుత్వం ఆలోచనలు చేస్తోంది.


 


ఇందులో భాగంగానే గత అసెంబ్లీ సమావేశాల సమయంలో శ్రీశైలం లెఫ్ట్ బ్యాంకు కెనాల్(ఎస్‌ఎల్‌బీసీ) సొరంగ పనులకు అదనపు చార్జీలు చెల్లించే అంశమై అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకున్న మాదిరే, ప్రస్తుతం ఎస్కలేషన్‌పై కూడా అదే విధంగా వ్యవహరించాలని భావిస్తోంది. అయితే అధికారులు మాత్రం ఓ కమిటీని ఏర్పాటుచేసి దీనిపై తేల్చాలని ప్రభుత్వ పెద్దలకు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నిర్ణయం ఎలా ఉంటుందనే ఆసక్తికరంగా మారింది.




 రాష్ట్రంలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న 21 భారీ, 12 మధ్యతరహా ప్రాజెక్టు పనులకు ఎస్కలేషన్ వర్తింపజేయాలని కాంట్రాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు. స్టీల్, సిమెంట్, పెట్రోల్, డీజిల్, లేబర్, ఇతర మెటీరియల్‌కు పెరిగిన ధరలకు అనుగుణంగా ధరలు పెంచాలని వారు కోరుతున్నారు. ముఖ్యమంత్రిని కలసి ఎస్కలేషన్ అవసరాన్ని వివరించేందుకు కాంట్రాక్టర్లు సన్నిహిత మంత్రుల ద్వారా ఆయన అపాయింట్‌మెంట్‌ను సైతం కోరారు. ఉమ్మడి ఏపీలోనే అప్పటి  ప్రభుత్వం ఎస్కలేషన్‌పై 2014 ఫిబ్రవరి 2న జీవో నంబర్-13ను జారీచేసింది. దీని ప్రకారం 2013 ఏప్రిల్ నుంచి జరిగిన పనులన్నింటికీ కొత్త ధరల ప్రకారం బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది. అయితే జీవో విడుదల అయిన సందర్భంలో వివాదం రేగడం, తర్వాత రాష్ర్ట విభజన జరగడం, ఎన్నికలు రావడంతో అది అమల్లోకి రాలేదు. తరువాత అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం సైతం ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా పెండింగ్‌లో పెట్టింది. అయితే, జీవో 13ను స్వల్ప మార్పులతో అమలుచేయాలని ఇటీవల ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.

 

 ఇదిలాఉండగా, జీవో 13ను యధాతథంగా అమలుచేస్తే ఏడాదిన్నర కాలంగా జరిగిన పనులన్నింటికీ ప్రభుత్వం అదనపు చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. ఇప్పటి నుంచి జరిగే పనులకు కూడా కొత్త ధరలు అమలు చేయాలి. ఇలా కాకుండా ప్రాజెక్టు, ప్యాకేజీల వారీగా సమీక్షించి ఏ మేరకు అదనపు చెల్లింపులు చేయాలనే విషయంపై అధ్యయనం చేసి ఓ నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎలాంటి నిర్ణయం తీసుకున్నా సుమారు రూ.4 వేల కోట్ల నుంచి రూ.6 వేల కోట్ల వరకు భారం పడే అవకాశం ఉండడంతో దీనిపై ఏకపక్ష ధోరణితో కాకుండా అన్ని పార్టీలతోపాటు, సాంకేతిక నిఫుణుల అభిప్రాయాలు తీసుకొనే ముందుకు కదలాలని ప్రభుత్వం యోచిస్తోంది.




 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top