ఆదర్శ రైతుల భవితవ్యమేమిటి?


వ్యవసాయ రంగం దండగ కాదు.. పండగ అని నిరూపించేందుకు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖరరెడ్డి 2007లో ఆదర్శ రైతు వ్యవస్థను ప్రవేశపెట్టారు. 10వ తరగతి ఉత్తీర్ణులైన, స్థానికులై వ్యవసాయంపై అనుభవం ఉన్న వారిని ఆదర్శ రైతులుగా నియమించారు. వీరు పొలాల వెంట తిరుగుతూ సూచనలు, సలహాలు ఇచ్చేవారు. ప్రభుత్వం చేపట్టే ప్రతీ కార్యక్రమంలోనూ భాగస్వాములను చేసేవారు. వీరికి గౌరవ వేతనం రూ.1000, అవి కూడ 10 నెలలకో మారు వచ్చేవి.



మండలాల్లో  వ్యవసాయ విస్తరణ అధికారుల కొరత ఉండటంతో ఆదర్శ రైతు వ్యవస్థ గ్రామీణ ప్రాంతంలో ఉన్న రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుందని అప్పటి ప్రభుత్వం వీరిని నియమించింది. వీరికి ప్రభుత్వం 20 రకాల బాధ్యతలను అప్పగించింది. 200-250 మంది రైతులకు ఒక ఆదర్శ రైతు చొప్పున నియమించారు. ఇలా జిల్లా వ్యాప్తంగా 1,280 మందిని నియమించారు. ఆదర్శ రైతులను నియమించి ఏడేళ్లు గడిచినా ప్రభుత్వం ఆశించిన స్థాయిలో వారు పని చేయలేకపోయారన్న భావనలో ప్రభుత్వం ఉంది.



 పక్కదారి పట్టిన వ్యవస్థ..

 రైతులకు ఎంతగానో తోడ్పాటు నిచ్చే ఈ ఆదర్శ రైతు వ్యవస్థ పక్కదారి పట్టిందనే ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ పథకాలు రైతుల దరి చేరటం లేదనే విమర్శలు ఉన్నాయి. ఆదర్శ రైతులు అధికారులను వలలో వేసుకుని ప్రభుత్వ పథకాలను నీరుగారుస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో పథకాలు రైతులకు సక్రమంగా అందకపోగా అనేక అవినీతి అక్రమాలు చోటు చేసుకుంటున్నానే ఆరోపణలు ఉన్నాయి. పక్కదారి పట్టిన ఈ వ్యవస్థనను గత కాంగ్రెస్ ప్రభుత్వం గాడిలో పెట్టలేక పోయింది.



పంటనష్ట పరిహారం సమయంలో ఆదర్శ రైతులు అనర్హుల పేర్లను జాబితాలో చేర్చారనే ఆరోపణలు ఉన్నాయి. ఇందులో చేతివాటం ప్రదర్శిం చిన కొంతమంది ఆదర్శ రైతులను అప్పట్లో విధుల నుంచి తొలగించారు. అంతేకాకుండా అనర్హులకు అంది న పరిహారాన్ని వాటాల వారిగా జేబులో వేసుకున్నట్లు గతంలో జిల్లాలో రైతులు ఆందోళన చేశారు. ఇవన్నీ సమీక్షించిన తెలంగాణ ప్రభుత్వం ఈ వ్యవస్థను రద్దు చేయాలని నిర్ణయించింది. రెండురోజుల్లో దీనికి సంబంధించిన ఉత్తర్వులు వెలువడనున్నాయి. అంతేకాకుండా వారికి చెల్లిస్తున్న వేతనం కూడా ప్రభుత్వానికి భారంగా మారింది. నెలకు జిల్లాలో రూ.12.80 లక్షలు ఆదర్శ రైతులకు వేతనంగా చెల్లిస్తున్నారు. అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆదర్శరైతులు ఆందోళనకు సిద్ధమవుతున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top