కల్యాణ వైభోగమే..


యాదగిరి నర్సింహస్వామి, లక్ష్మి అమ్మవారు ఒక్కటయ్యారు. ఫాల్గుణ బహుళ, నవమి, శుక్రవారం రాత్రి 11గంటల 25 నిమిషాల తులా లగ్న పుష్కరాంశ సుమూహూర్తమున స్వామివారు, అమ్మవారి మెడలో మాంగళ్యధారణ చేశారు. ముక్కోటి దేవతల సాక్షిగా కల్యాణం అంగరంగవైభవంగా జరిగింది. అంతకుముందు సంప్రదాయం ప్రకారం.. అర్చకులు, వేద పండితులు, ఋత్వికుల వేద పఠనం, మంత్రోచ్ఛరణల మధ్య స్వామి, అమ్మవార్లకు జీలకర్ర, బెల్లం పెట్టారు. కల్యాణ తంతును వేలాది మంది భక్తులు చూసి ధన్యులయ్యారు. కాగా, ఉదయం సీఎం కేసీఆర్ స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలు, పసుపుకుంకుమలు సమర్పించారు. కల్యాణంలో గవర్నర్ నరసింహన్ దంపతులు పాల్గొన్నారు.

 

యాదగిరికొండ : అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవం గురువారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా నాలుగవ రోజున వేలాది మంది భక్తజనం సాక్షిగా స్వామివారు అమ్మవారి మెడలో మాంగళ్యధారణ చేశారు. ఈ అపురూప ఘట్టాన్ని తిలకించిన భక్త జనులు పులకించి పునీతులయ్యారు. లోక కల్యాణార్థం నిర్వహించిన స్వామి వారి కల్యాణం ఆద్యంతం భక్తిశ్రద్ధలతో సాగింది. ఈ సందర్భంగా స్వామివారి కల్యాణ మండపాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలు, రకరకాల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు. ఆలయ అర్చకులు స్వామి వారిని పెళ్లి కుమారుడిగా ముస్తాబు చేసి గజవాహన సేవలో తిరువీధుల మీదుగా భక్తుల గోవిందనామస్మరల మధ్య కల్యాణ మండపానికి చేరుకున్నారు.



గుట్ట దేవస్థానం తరఫున దేవస్థానం చైర్మన్ బి.నరసింహమూర్తి, ప్రభుత్వం తరఫున గవర్నర్ నరసిం హన్ దంపతులు అమ్మవార్లకు ముత్యాల తలంబ్రాలను కల్యాణ మండపానికి తీసుకువచ్చారు. విశ్వక్సేన పూజతో కల్యాణ మహోత్సవాన్ని ఆలయ అర్చకులు ప్రారంభించారు. అనంతరం పుణ్యాహవాచనం చేసి క్షీర సముద్రుడైన స్వామి వారికి పాద ప్రక్షాళన చేశారు. తర్వాత స్వామి, అమ్మవార్లకు 10.29 నిమిషాలకు తులాలగ్న పుష్కరాంశమున జీలకర్ర బెల్లం పెట్టారు.  అనంతరం వేద పండితులు, రుత్విక్కులు, ఆలయ అర్చకులు  మహా సంకల్పం మంత్రాలతో, చూర్ణిక కన్యాదానం, మాంగల్య ధారణ, తలంబ్రాలు మొదలైన కల్యాణ ఘట్టాలను కొనసాగించారు.



ముక్కోటి దేవతలు ఆకాశం నుంచి వీక్షిస్తుండగా 11.25 నిమిషాలకు స్వామివారు.. అమ్మవారి మెడలో మాంగల్య ధారణ చేశారు. కార్యక్రమంలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి దంపతులు, కలెక్టర్ సత్యనారాయణరెడ్డి దంపతులు, ఎస్పీ ప్రభాకర్‌రావు, ఆర్డీఓ మధుసూదన్, ఎమ్మెల్యే గొంగిడి సునీత దంపతులు, సమాచార హక్కు చట్టం కమిషనర్ వర్రె వెంకటేశ్వర్లు, ఆలయ ప్రధానార్చకులు నల్లందీగళ్ లక్ష్మీ నరసింహాచార్యులు, కారంపూడి నరసింహాచార్యులు, అర్చకులు కాండూరి వెంకటాచార్యులు, మంగళగిరి నరసింహామూర్తి, మోహనాచార్యులు, సురేంద్రాచార్యులు, అధికారులు దోర్భల భాస్కర శర్మ,  చంద్రశేఖర్, అంజనేయులు, రమేశ్, కృష్ణయ్య, విజయ్‌కుమార్ పాల్గొన్నారు.

 

స్వామివారి సన్నిధిలో సీఎం కేసీఆర్ దంపతులు


యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో శుక్రవారం సీఎం కేసీఆర్ దంపతులు స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. సీఎంకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ముందుగా సీఎం ధ్వజస్తంభం వద్దకు చేరుకుని అక్కడ స్వామివారికి నమస్కరించుకుని గర్భాలయంలోకి  వెళ్లారు. స్వామి,అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితులు, ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వచనం చేశారు. అనంతరం స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలు, పసుపుకుంకుమ సమర్పించారు. 


సీఎం రాకతో భక్తులు చాలా ఇబ్బందులు  పడ్డారు. ఆలయ పరిసరాలన్నీ బోసిపోయి కనిపించాయి. భక్తులను, మీడియా సిబ్బందిని, ఎక్కడిక్కడ నిర్భం దించారు. కొండపైన దుకాణాలను మూసివేయిం చారు. అటోలను పంపించకుండా చేసి దేవస్థానం బస్సులకు, ఆర్టీసీ బస్సులకు మాత్రమే అనుమతించడంతో ఒక్కో బస్సులో కిక్కిరిసి పోవాల్సి వచ్చింది.  ఆలయంలోనూ  వేద పారాయణానికి వచ్చిన రుత్వికులను, కొంతమంది దేవస్థానం సిబ్బందిని సైతం కల్యాణ మండపంలో నిలిపివేశారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top