వార ఇబ్బందీ..


హాలియా : నాగార్జునసాగర్ ఆయకట్టు పరిధిలోని రైతులకు ఈసారి కూడా సాగునీటి కష్టాలు తప్పేలాలేవు. ఖరీఫ్ నష్టాల నుంచి బయటపడేందుకు ఎడమ కాల్వ కింద రబీలో రైతులు కోటి ఆశలతో వరిసాగు చేశారు. కానీ పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ బలవంతంగా పది రోజులుగా సాగర్ జలాశయం నుంచి అదనపు నీటిని తీసుకుపోతోంది. దీంతో రోజురోజుకూ సాగర్ జలాశయంలో నీటిమట్టం గణనీయంగా తగ్గుతూ వస్తోంది. దీని కారణంగా రాష్ట్ర ప్రభుత్వం ఎడమ కాల్వకు ఆన్‌అండ్‌ఆఫ్ (వారబందీ) పద్ధతిని అమలు చేస్తోంది. ఫలితంగా కాల్వ చివరి భూముల్లోని వరిచేలు ఎండిపోతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాగార్జునసాగర్ ఎడమ కాల్వ కింద జిల్లాలో లక్ష హెక్టార్లలో రైతులు వరిసాగు చేశారు.



ఈ పంట చేతికొచ్చేందుకు సుమారు 25 టీఎంసీల నీరు అవసరం అవుతుందని ఎన్‌ఎస్‌పీ అధికారులు గుర్తించారు. అదే విధంగా వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణ కోసం మరో 15 టీఎంసీల నీరు అవసరం. కాగా ప్రస్తుతం సాగర్ జలాశయంలో 527.10 అడుగుల నీరుంది. ఇది 162.5409 టీఎంసీలకు సమానం. నాగార్జున సాగర్‌జలాశయంలో డెడ్‌స్టోరేజీ 510 అడుగులు అంటే ఇది 131.6090 టీఎంసీలకు సమానం. సాగు, తాగునీటికి 40 టీఎంసీల నీరు అవసరం కాగా ప్రస్తుతం 31 టీఎంసీల నీరు అందుబాటులో ఉంది. అంటే ప్రస్తుతం నాగార్జున సాగర్ జలాశయంలో ఉన్న నీరు సాగు, తాగు నీటికి సరపోవడమే కష్టం. కానీ పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌కు కూడా నీటి సరఫరా జరుగుతుండడంతో ఎడమ కాల్వ కింద ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు.

 

కష్టసాధ్యమే..

ఆంధ్రప్రదేశ్‌లో సాగర్ కుడి కాల్వ కింద గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో వరి, ఇతర పంటలు సాగు చేశారు. ప్రస్తుతం వరి పొట్టదశలో ఉంది. ఈ పంట చేతికొచ్చేందుకు 40 టీఎంసీలు, అలాగే తాగునీటికి 10 టీఎంసీలు అవసరం. కానీ నాగార్జునసాగర్ జలాశయంలో అంతపెద్దమొత్తంలో నీరు నిల్వ లేదు. ప్రస్తుతం ఉన్న నీటితో ఇరు రాష్ట్రాల్లో పంటలు కాపాడేందుకు, తాగునీటి కోసం సరఫరా చేయడం కష్టసాధ్యమే అవుతుంది.

 

ఎండుతున్న పంటలు...

వారబందీతో సాగర్ ఎడమ కాల్వ కింద వరిచేలు ఎండిపోతున్నాయి. నాగార్జునసాగర్ జలాశయంలో నీరు తక్కువగా ఉందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నుంచి వారబందీ ప్రకారం నీటిని విడుదల చేస్తోంది. దీంతో ఎడమ కాల్వ తొలి మేజర్ రాజవరం మేజర్ తెట్టేకుంట, సూరేపల్లి మేజర్ కాల్వ చివరి భూముల్లో వరిచేలు ఎండిపోతున్నాయి.  వేసవి ప్రారంభం కావడం, రోజురోజుకూ ఎండ తీవ్రత పెరిగిపోతుండటంతో పది రోజులకు ఆరు రోజులపాటు నీటి విడుదలను నిలిపివేయడం వల్ల వరిచేలు ఎండిపోతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారబందీ ప్రకారం నీటిని విడుదల చేయడం వల్ల కాల్వ మొదటి తూము రైతులకు మాత్రమే నీరందుతుందని, చివరి భూములకు నీరందడం లేదని  రైతులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం 15రోజుల పాటు నీటిని విడుదల చేసి, ఐదు రోజులపాటు నిలిపివేస్తే పంట చేతికొస్తుందని రైతులంటున్నారు.

 

పొలం ఎండిపోయింది : ఊర జంగయ్య, రైతు, కొత్తపల్లి

ఖరీఫ్‌లో పంట దిగుబడి బాగాలేకపోవడంతో రబీలో నేను రూ. 15 వేలు అప్పు చేసి ఎకరంనరలో  వరిసాగు చేశా. నాటేసిన వారం పదిరోజులకే ప్రభుత్వం వారబందీని అమలు చేయడంతో నీరందక పొలం ఎండిపోతోంది. ఖరీఫ్ నష్టాన్ని అధిక మించేందుకు రబీలో అప్పు చేసి పంట సాగు చేస్తే వారబందీ కారణంగా వేసినపంట ఎండిపోతోంది. పంటలెండిపోయిన రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

సంబంధిత వార్తలు



 

Read also in:
Back to Top