ఎస్సీ వర్గీకరణపై మోదీని కలుస్తాం


టీఆర్‌ఎస్ ఎంపీల వెల్లడి

సాక్షి, న్యూఢిల్లీ: పత్తికి కనీస మద్దతు ధరగా రూ.5వేలు ఇవ్వాలని, ఎస్సీ వర్గీకరణ చేయాలని కోరుతూ గురువారం ప్రధాని నరేంద్ర మోదీని కలవనున్నామని టీఆర్‌ఎస్ ఎంపీలు చెప్పారు. వరంగల్ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి ప్రధాని మోదీ అపాయింట్‌మెంట్‌ను కోరడంతో తొలి అంకం ప్రారంభమైందన్నారు. పార్లమెంటులో కేంద్రానికి అంశాలవారీగా మద్దతు ఇస్తూనే, చర్చల ద్వారా తెలంగాణ సమస్యలను పరిష్కరించుకుంటామన్నారు.


జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. గురువారం ఇక్కడ విలేకరుల సమావేశంలో తొలుత టీఆర్‌ఎస్ లోక్‌సభ ఫ్లోర్‌లీడర్ జితేందర్‌రెడ్డి మాట్లాడుతూ, వరంగల్ ఉప ఎన్నికలో భారీ మెజార్టీతో గెలిచిన ఎంపీ పసునూరి దయాకర్‌ను ప్రధాని మోదీకి పరిచయం చేయించానన్నారు. మంచిపనులు చేస్తే ప్రజలు మెజార్టీ ఇస్తారని, పనిచేయకుంటే ఓడిస్తారనే సందేశం వరంగల్ ఉప ఎన్నిక ద్వారా వెళ్లిందన్నారు.



సీఎం కేసీఆర్‌పై ప్రజలు చూపిన విశ్వాసానికి నిదర్శనమే ఈ భారీ విజయం అని అభివర్ణించారు. ఎంపీ వినోద్ మాట్లాడుతూ, రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఎస్సీ వర్గానికి చెందిన దయాకర్ లోక్‌సభలో ఎంపీగా ప్రమాణ స్వీకారం చేయడం గర్వించదగిన విషయమన్నారు.  ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ, సాధారణంగా ఏడాదిన్నర పాలన తర్వాత ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తుందని, అయితే తెలంగాణలో టీఆర్‌ఎస్‌పై విశ్వాసం పెరగడం మార్గదర్శకంగా నిలుస్తుందన్నారు.


ఎంపీ సీతారాం నాయక్ మాట్లాడుతూ, టీఆర్‌ఎస్‌పై బురద జల్లేవారికి ప్రజలు వాతలు పెట్టారన్నారు. ఎంపీ పసునూరి దయాకర్ మాట్లాడుతూ, వరంగల్ సమగ్రాభివృద్ధికి ప్రాధాన్యమిస్తానని, కేంద్రం నుంచి నిధులు తెచ్చి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేస్తానని అన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవం రోజున ఎంపీగా పదవీ ప్రమాణం చేయడం ఆనందంగా ఉందన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top