ఆక్రమిత భూములన్నీ ఇక స్వాధీనమే!


సాక్షి, హైదరాబాద్: ఆక్రమణలకు గురైన అన్ని రకాల భూములను స్వాధీనం చేసుకునే దిశగా తెలంగాణ ప్రభుత్వం కసరత్తును ముమ్మరం చేసింది. ఈ మేరకు సీసీఎల్‌ఏ కార్యాలయంలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది. భూదాన్, అసైన్డ్, పట్టణ భూ గరిష్ట పరిమితి పరిధిలోని భూములపై నిర్దిష్టం గా వివరాలను అధ్యయనం చేయడానికి కట్టుదిట్టంగా రహస్య ఏర్పాట్లు చేసింది. ఈ విభాగానికి వస్తు న్న ఫిర్యాదులను, సమాచారాన్ని ఏ రోజుకారోజు తెలంగాణ సీఎం కార్యాలయ ముఖ్య అధికారి ఒకరు సమీక్షిస్తున్నారు. భూ ఆక్రమణలు, అక్రమాలపై వచ్చిపడుతున్న ఫిర్యాదులు, సమాచారంతో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేసినట్టుగా సమాచారం. ఆక్రమణలకు గురైన భూములు ఏకంగా 3 లక్షల నుంచి 4 లక్షల ఎకరాలు ఉన్నాయని సర్కారు భావిస్తోంది.

 

 కుప్పలు తెప్పలుగా ఫిర్యాదులు...

 

 హైదరాబాద్ పరిసరాల్లోని భూ ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలపై కఠినంగా వ్యవహరిస్తామనే సంకేతాలు కింది స్థాయిలోకి వెళ్లిన తర్వాత.. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా పరిధుల్లోనే కాకుండా జిల్లా, డివిజన్, మండల కేంద్రాల్లో జరిగిన భూ ఆక్రమణలపై సీఎం కార్యాలయానికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చి పడుతున్నాయి. వీటిని అధ్యయనం చేయడానికి సీసీఎల్‌ఏ కార్యాలయంలో సహాయ కార్యదర్శి స్థాయి అధికారితో ప్రత్యేకంగా ఒక విభాగాన్ని నెలకొల్పారు. ఆక్రమణలకు సంబంధిం చిన వివరాలను అత్యంత రహస్యంగా సేకరించడానికి, అధ్యయనం చేయడానికి వీలుగా కొందరు అధికారులను, సిబ్బం దిని ప్రత్యేకంగా వినియోగించుకుంటున్నారు. వారంతా సహా య కార్యదర్శికి మాత్రమే జవాబుదారీగా ఉండేలా ఏర్పాట్లు చేశారు. ఆ కార్యాలయంలోని మిగిలిన సిబ్బందికి కూడా ఈ విషయాలు ఏవీ తెలియకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. ఆ విభాగంలోకి వారికి ప్రవేశం కూడా లేకుండా చేశా రు.  గతంలోని కమిటీలోని ముఖ్యుల ఆధ్వర్యంలోనే భూదాన్ భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం జరిగిందని ప్రాథమికంగా పలు నివేదికలు అందినట్టుగా తెలుస్తోంది. అంతేకాకుండా భూదాన్ ట్రస్టులో కీలకంగా వ్యవహరించినవారిని ముందుగానే అదుపులోకి తీసుకోవాలని, లేకుంటే శిక్ష నుంచి తప్పించుకునేందుకు వారు విదేశాలకు పారిపోయే ప్రమాదం కూడా ఉందని సీఎం కార్యాలయానికి ఫిర్యాదులు అందినట్టుగా విశ్వసనీయ సమాచారం. వీటన్నింటిపైనా సీసీఎల్‌ఏలో ఏర్పాటైన విభాగం సమాచారాన్ని సేకరిస్తోంది. వీటితోపాటు అసైన్డు భూములపైనా చాలా ఆరోపణలు, ఆధారాలు వస్తున్నాయి.

 

 సమాచార హక్కు చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత  కుంభకోణాలు నిర్దిష్ట ఆధారాలతో బయటకు వచ్చాయని సీఎం కార్యాలయం నిర్ధారణకు వచ్చింది. అసైన్డుసహా సర్కారు భూముల్ని కొన్ని ప్రాంతాల్లో అమ్ముకున్నారు. మరి కొన్ని చోట్ల బినామీ అసైనీల పేరుతో అధికారులు, నాయకులు పెద్ద ఎత్తున కుంభకోణాలకు పాల్పడ్డారు. అసైన్డ్ చేసిన ఉద్దేశానికి, కేటాయించిన లక్ష్యానికి భిన్నంగా ఇతరత్రా అవసరాలకు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు వినియోగించుకున్నారు. ఇలాం టి ఫిర్యాదులు వేలాదిగా సీఎం కార్యాలయానికి వచ్చిపడుతున్నాయి. పట్టణ భూ గరిష్ట పరిమితి చట్టం కింద మినహాయిం పు పొందిన భూములు కూడా చాలాచోట్ల నిరుపయోగంగా పడి ఉన్నట్టు సీఎం కార్యాలయానికి సమాచారం అందుతోంది.   కబ్జాకు గురైన భూములు సుమారు 3 లక్షల నుంచి 4 లక్షల ఎకరాలు ఉండే అవకాశం ఉందని సీఎం కార్యాలయం  నిర్ధారణకు వచ్చింది. ఇందులో భూదాన్ భూములే లక్ష ఎకరాలకు పైగా ఉన్నట్లు అంచనా. సీసీఎల్‌ఏలో ఏర్పాటైన ప్రత్యేక విభాగం వీటన్నింటిపైనా లోతుగా, నిర్దిష్టమైన ఆధారాలతో అధ్యయనం చేసి, ఏ రోజుకారోజు నివేదికలను, సమాచారాన్ని సీఎం కేసీఆర్‌కు అందజేస్తున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top