ఎన్టీఆర్‌ తర్వాత తెలుగోడికి మళ్లీ అంతటి గౌరవం

ఎన్టీఆర్‌ తర్వాత తెలుగోడికి మళ్లీ అంతటి గౌరవం - Sakshi

  • వెంకయ్యనాయుడు మనందరికీ గర్వకారణం: సీఎం కేసీఆర్‌

  • దేశంలోనే అద్భుతమైన వక్త..

  • దేశంలోనే అద్భుతమైన వక్త.. ఎమర్జెన్సీ టైంలో ఆయన ప్రసంగం విన్నా

  • ఉప రాష్ట్రపతిగా దేశానికి మేలు చేస్తారు: గవర్నర్‌

  • సాక్షి, హైదరాబాద్‌: ‘‘ఎన్టీఆర్‌ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాతే దేశంలో తెలుగువారంటూ ఉన్నా రని ప్రపంచానికి తెలిసింది. తెలుగు భాష ఉందన్న గౌరవం లభించింది. మళ్లీ అలాంటి గౌరవం తెలుగు బిడ్డ వెంకయ్య నాయుడు ఉప రాష్ట్రపతిగా ఎన్నిక కావడంతో లభించింది’’ అని సీఎం కె.చంద్రశేఖర్‌రావు కొనియాడారు. ఉప రాష్ట్రపతిగా ఎన్నికైన తర్వాత తొలి సన్మానం జరిపే అవకాశాన్ని రాష్ట్రానికి ఇచ్చినందుకు వెంకయ్య నాయుడికి కృతజ్ఞతలు తెలుపుతున్నా నన్నారు.



    తెలుగు వ్యక్తి అత్యున్నత శిఖరాన్ని అధిరోహించడం మనందరికి సంతోషం, గర్వ కారణమన్నారు. సోమవారం వెంకయ్యకు నిర్వహించిన పౌరసన్మానం కార్యక్రమంలో సీఎం మాట్లాడారు. ఆయన అద్భుతమైన వక్త అని కొనియాడారు. ‘‘వక్తృత్వం, ఉపన్యాసాన్ని పండించడానికి అద్భుతమైన పదాల కూర్పు, భావం అవసరం. ‘చదువది ఎంత గలిగిన.. రస జ్ఞత ఇంచుక చాలకున్నా.. ఆ చదువది నిరర్థ కంబు’ అన్నట్టు ప్రసంగంలో రసజ్ఞత కొరవడితే ఆకట్టుకోదు. కొంచెం హాస్యం, చతురత అన్నీ కలగలసి ఉండాలి. వీటన్నింటిని జోడించి ఉప న్యాసాన్ని పండించడంలో దేశంలోనే అద్భు తమైన వక్త వెంకయ్య. తెలుగు, హిందీ, ఆంగ్లంలో అద్భుతంగా ప్రసంగిస్తారు. బీజేపీ నేత సుబ్రమణ్యస్వామితో కలసి 1980వ దశకంలో సిద్దిపేటలో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా వెంకయ్య నాయుడు అద్భుతంగా ఉపన్యాసం చేశారు. అప్పుడే పీజీ పూర్తి చేసిన నాకు ఆ ఉపన్యాసం వినే అవకాశం లభించింది’’ అని సీఎం అన్నారు.



    నాలుగు పర్యాయాలు ఎంపీగా, రెండు పర్యాయాలు కేంద్రమంత్రిగా ప్రజలకు వెంకయ్య సేవలు చేశారన్నారు. ఓ జాతీయ పార్టీకి అధ్యక్షుడిగా వ్యవహరించి తెలుగువారి గౌరవాన్ని పెంపొందించారన్నారు. వెంకయ్య నాయుడు ఆత్మీయంగా మాట్లాడుతారని, తమవారు అన్న భావన కలిగిస్తారని ప్రశంసిం చారు. కార్యక్రమంలో కేంద్రమంత్రి దత్తాత్రేయ, అసెంబ్లీ స్పీకర్‌ మధుసూధనాచారి, శాసన మండలి చైర్మన్‌ స్వామిగౌడ్, ఉప ముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, మహమూద్‌ అలీ, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సినీ ప్రము ఖులు, వివిధ రంగాల ప్రముఖులు పాల్గొన్నారు.



    సభను సజావుగా నడుపుతారు: గవర్నర్‌

    వెంకయ్య నాయుడు గొప్ప వక్త అని, రాజ్యసభను సజావుగా నిర్వహించడంలో సఫ లమవుతారని గవర్నర్‌ నరసింహన్‌ అన్నారు. పార్టీ నాయకుడిగా, ఎంపీగా, కేంద్రమంత్రిగా దేశానికి ఎంతో సేవ చేసిన వెంకయ్య.. ఉప రాష్ట్రపతిగా కూడా ఎంతో మేలు చేస్తారనడంలో ఎలాంటి అనుమానాలు లేవన్నారు.


    ‘‘ఉషాపతి (వెంకయ్య సతీమణి పేరు ఉష)గా ఉంటాను.. ఉప రాష్ట్రపతిగా వద్దు అని వెంకయ్య అన్నారు.. కానీ ఉషాపతిగా ఉంటే ఉపరాష్ట్రపతిగా ఉన్నట్లే..’’ అని గవర్నర్‌ చమత్కరించారు. శ్లోకాలు, పద్యాలతో గవర్నర్‌ నరసింహన్, సీఎం కేసీఆర్‌ తమ ప్రసంగాల్లో వెంకయ్యపై ప్రశం సల వర్షం కురిపించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య సీఎం కేసీఆర్‌.. వెం కయ్యకు పట్టు వస్త్రాలు, మెమెంటోను బహూ కరించి సత్కరించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top