మా కొద్దు ప్లీజ్...!


నల్లగొండ : జిల్లా విద్యుత్ శాఖ బదిలీల్లో వింతపోకడలు చోటుచేసుకున్నాయి. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏఈలు, ఏడీఈలు తమ రూటు మార్చారు. వీరితో పాటు రాజకీయ ఒత్తిళ్లు భరించలేని కొందరు ఉద్యోగులు కూడా ఆపరేషన్ వింగ్ వదిలేసి లూప్‌లైన్ బాట పట్టారు. జిల్లాలో ఏఈలు, ఏడీఈలు భారీ స్థాయిలో ఖాళీలు ఏర్పడడంతో ఉద్యోగుల ఆప్షన్ మేరకు వారు కోరుకున్న స్థానాలకే బదిలీ అయినప్పటికీ ప్రత్యేకంగా కొందరు ఉద్యోగులు మాత్రం తమ సేవలను కార్యాలయాలకే పరిమితం చేయాలని నిర్ణయించుకున్నారు. ఏఈ, ఏడీఈ పోస్టులతో పాటు లూప్‌లైన్‌లో కూడా ఖాళీలు భారీగానే ఉండటంతో ఎక్కువ మంది సీనియర్లు అదే బాట పట్టారు.



ప్రధానంగా నకిరేకల్, నల్లగొండ సర్కిల్ పరిధిలో పనిచేసేందుకు వెనుకాడుతున్న ఉద్యోగులు ఈసారి లూప్‌లైన్ వైపే మొగ్గుచూపారు. విద్యుత్ శాఖ ఎస్‌ఈ భిక్షపతి కూడా ఉద్యోగుల ఆప్షన్లకే ప్రాధాన్యత ఇచ్చారు. రాజకీయ పైరవీలు, ఉద్యోగ సంఘాల అభీష్టం మేరకు ఒకరిద్దరు అధికారులకు తాము కోరుకున్న స్థానాలకు బదిలీ చేశారు. మంగళవారం రాత్రి పొద్దు పోయే వరకు బదిలీ ఉత్తర్వులు జారీ చేయడంలో విద్యుత్‌శాఖ తీవ్ర కసరత్తు చేసింది. ఎస్‌ఈ తెలిపిన వివరాల మేరకు ఏడీఈలు 22, ఏఈలు 51, సబ్‌ఇంజినీర్లు 57 మందిని వేర్వేరు ప్రాంతాలకు బదిలీ చేసినట్లు తెలిపారు. వీరిలో హైదరాబాద్ నుంచి జిల్లాకు బదిలీపై వచ్చిన వారు కూడా ఉన్నారు.



ఇంత మందిని సర్దుబాటు చేసినప్పటికీ జిల్లాలో ఏఈ పోస్టులు 30 నుంచి 40 వరకు ఖాళీగానే ఉన్నాయి. అలాగే ఏడీఈలు 6 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీనిని బట్టి బదిలీ అయిన వారిలో ఎక్కువ మంది బయట పనిచేసేందుకు అయిష్టత వ్యక్తం చేయడంతోనే చాలా మంది ఉద్యోగులు కార్యాలయంలో పనిచేసేందుకు మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. అయితే ఈ మొత్తం బదిలీల్లో ఆపరేషన్ వింగ్‌లో పనిచేసేందుకు ఏఈలు, ఏఈడీలు బయపడుతున్నారు.



అధికార పార్టీ ఒత్తిళ్లు భరించలే ని కొందరు ఉద్యోగులను బలవంతంగా మండలాలకు పంపించేందుకు చేసిన ప్రయత్నాలు  ఫలించలేదని తెలిసింది. కరెంట్‌స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్ల కోసం అధికార పార్టీకి చెందిన వ్యక్తుల నుంచి బెదిరింపు ధోరణిలో హెచ్చరికలు వస్తున్న నేపథ్యంలో ప్రత్యక్ష సేవలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది.  రామన్నపేట, మునుగోడు ఏడీఈ లను హైదరాబాద్‌కు బదిలీ చేసినప్పటికీ వారు మళ్లీ నల్లగొండకు తిరిగి వచ్చారు. రామన్నపేట ఏడీఈని ప్రజలతో సంబంధం లేని ఎంఆర్‌టీ వింగ్‌కు బదిలీ చేస్తూ హుజూర్‌నగర్‌కు పంపించారు. అలాగే మునుగోడు ఏడీఈని నల్లగొండ రూరల్‌కు నియమించారు. నల్లగొండ ఏఈడీ నాగిరెడ్డిని రామన్నపేటకు బదిలీ చేయగా...ఆయన స్థానంలో హైదరాబాద్ నుంచి వచ్చిన సంగెం వెంకటేశ్వర్లును నియమించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top