ఏపీ ప్రభుత్వం నిధుల వివరాలివ్వడం లేదు


కేంద్రానికి ఫిర్యాదు చేయనున్న తెలంగాణ సీఎస్ రాజీవ్‌శర్మ




 సాక్షి, హైదరాబాద్: విభజన చట్టానికి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సహకరించడం లేదని ఈనెల 28వ తేదీన కేంద్ర హోం శాఖ కార్యదర్శి వద్ద జరిగే సమావేశంలో  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ రాజీవ్‌శర్మ ఫిర్యాదు చేయనున్నట్లు తెలిసింది. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు వివిధ ప్రభుత రంగ, ప్రభుత్వ సంస్థల్లో ఉన్న స్థిర డిపాజిట్ల వివరాలేవీ ఏపీ ప్రభుత్వం తమతో పంచుకోవడం లేదని, ఈ నిధులను ఇక్కడ నుంచి ఏపీ రాష్ట్రంలోని బ్యాంకు అకౌంట్లకు తరలిస్తున్నారని ఆరోపించనున్నారు. కార్మికశాఖలో కార్మికుల సంక్షేమ నిధి, ఖనిజాభివృద్ధి సంస్థలోని ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఎక్కువ మొత్తంలో ఉన్నట్లు, ఇతర శాఖల్లోనూ ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఉన్నా.. ఆ నిధుల్లో తెలంగాణకు 42 శాతం వాటా నిధులు పంపిణీ చేయకుండా ఏకపక్షంగా వినియోగించుకుంటున్నారన్నది ప్రధాన ఆరోపణ. తొమ్మిది, పదో షెడ్యూల్‌లోని పలు సంస్థల విభజనపై ఆంధ్రప్రదేశ్ మడతపేచీ పెడుతోందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేంద్రం దృష్టికి తీసుకెళ్లనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన కార్యాలయాలు ఉన్నచోట భౌగోళిక పరిస్థితుల ఆధారంగా ఆ రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉంటుందని చట్టంలో స్పష్టంగా ఉన్నా.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారం చెలాయిస్తోందని ఫిర్యాదు చేయనున్నారు. లేబర్‌సెస్, ఖనిజాభివృద్ధి సంస్థల నుంచి నిధులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణకు తెలియకుండానే బదిలీ చేసిందని ప్రధాన కార్యదర్శి వివరించనున్నారు. ఈ సంస్థల నిధులపై ఆడిటింగ్ నిర్వహించాలని డిమాండ్ చేయనున్నారు. కొన్ని శాఖల నుంచి రావాల్సిన కేంద్ర నిధులు ఇంకా ఏపీ ప్రభుత్వ ఖాతాలోకే జమ అవుతున్నాయని, వాటి వివరాలు కూడా తెలంగాణ ప్రభుత్వానికి తెలి యటం లేదని ఫిర్యాదు చేయనున్నారు. కేంద్ర హోం శాఖ కార్యదర్శితో జరిగే సమావేశంలో పాల్గొనడంతోపాటు, ఉద్యోగుల విభజనపై కమలనాథన్ కమిటీ సమావేశంలోనూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పాల్గొననున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top