'సింగరేణి కార్మికుల సమ్మెకు మద్దతు'


కోల్‌బెల్ట్ (వరంగల్ జిల్లా): బొగ్గుగని కార్మికుల జీవితాల్లో వెలుగులను నింపేందుకు సింగరేణి కార్మిక సంఘం ఏర్పాటు చేసినట్లు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, మహాజన సోషలిస్టు పార్టీ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. వరంగల్ జిల్లా భూపాలపల్లిలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సింగరేణి పరిశ్రమలో పనిచేస్తున్న 60 వేల మంది కార్మికుల పక్షాన నిలబడి ఉద్యమించడం కోసం మహాజన సోషలిస్టు పార్టీకి అనుబంధంగా సింగరేణి కార్మిక సంఘం తెలంగాణలోని నాలుగు జిల్లాల్లోని సింగరేణి ఏరియాల్లో కార్యకలాపాలు కొనసాగిస్తోందని అన్నారు. సంస్థలో పనిచేస్తున్న వారిలో 97 శాతం మంది కార్మికులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు ఉన్నప్పటికీ రాజ్యాధికారం మాత్రం ఐఎన్‌టీయూసీ, ఏఐటీయూసీ, టీబీజీకేఎస్‌లోని రెడ్డి, వెల్మలేనన్నారు.



సింగరేణిలోనూ సామాజిక వివక్ష కొనసాగుతోందన్నారు. వారసత్వ ఉద్యోగాలు పోగొట్టిన ఏఐటీయూసీ, 10 ఏళ్ల పాటు కేంద్రంలో, రాష్ట్రంలో అధికారం కొనసాగిన కాంగ్రెస్ అనుబంధ ఐఎన్‌టీయూసీ కార్మిక సమస్యలు పరిష్కరించలేదని ఆరోపించారు. ఎన్నికల సమయంలో కార్మికులకు ఇచ్చిన హామీలు గుర్తింపు సంఘం టీబీజీకేఎస్ విస్మరించిందన్నారు. సెప్టెంబరు 2నజరిగే దేశవ్యాప్త సమ్మెకు మద్దతు తెలుపుతున్నట్లు మంద కృష్ణ ఈ సందర్భంగా ప్రకటించారు. ఆనెల 4న రామగుండం, 5న బెల్లంపల్లి, 7న భూపాలపల్లి, 8న ఇల్లందు, 9న మణుగూరు, 10న కొత్తగూడెం ప్రధాన కార్యాలయం ఎదుట ఆందోళనలు ఉంటాయన్నారు. సమావేశంలో నాయకులు తిప్పారపు లక్ష్మణ్ మాదిగ, తీగల ప్రదీప్‌గౌడ్, జనగాం పోషం, మొలుగూరి మొగిలయ్య, అంబాల చంద్రమౌళి, మొలుగూరి రవీందర్, బత్తుల స్వామి, రేణుకుంట్ల కోంరయ్య తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top