మండలిలో 'వాటర్ వార్'


హైదరాబాద్: ‘వాటర్ గ్రిడ్ పైపులైన్ భూ వినియోగ హక్కు’ బిల్లును వ్యతిరేకిస్తూ శుక్రవారం శాసనమండలి నుంచి విపక్షాలు వాకౌట్ చేశాయి. అంతకు ముందు కాంగ్రెస్ ఎమ్మెల్సీలు వెల్‌లోకి దూసుకెళ్లి బిల్లుకు వ్యతిరేకంగా తీవ్ర నిరసన తెలిపారు. మొదట ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ.. తెలంగాణ గృహ సంబంధ, పారిశ్రామిక  వాటర్ గ్రిడ్ పైపులైనుల ( భూ వినియోగ హక్కును ఆర్జించుట) బిల్లును శాసనమండలిలో ప్రతిపాదించగా సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ సందర్భంగా మండలిలో కాంగ్రెస్ విపక్ష నేత డి.శ్రీనివాస్ (డీఎస్) మాట్లాడుతూ.. బిల్లు అసమగ్రంగా ఉందని, ఎన్నో వ్యత్యాసాలు ఉన్నాయని అన్నారు.





బిల్లును సమగ్రంగా అధ్యయనం చేయాల్సి ఉందని, ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును దీనికి అనుసంధానించడం, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా వ్యవహరించడం సరికాదని అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై సమగ్రచర్చ అవసరమని, హడావుడిగా చేయడం తగదని ప్రభుత్వానికి సూచించారు. టీడీపీ ఎమ్మెల్సీలు పొట్ల నాగేశ్వరరావు, ఎ.నర్సారెడ్డి మాట్లాడుతూ.. రైతులు తమ భూమిలో మొక్కలు పెంచినా, ఇతరత్రా పనులు చేపట్టినా జైలుకు పంపించేలా రాజ్యాంగ విరుద్ధంగా ఈ బిల్లులో నిబంధనలు ఉన్నాయని విమర్శించారు. ఎమ్మెల్సీ ఎం.రంగారెడ్డి మాట్లాడుతూ పైపులైన్ కంపెనీలను బతికించడానికే ఈ ప్రాజెక్టును తెచ్చారని ఆరోపించారు. లక్ష కి.మీ పైప్‌లైన్‌కు రూ.40 వేల కోట్లు కావాలని, కేవలం ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును మాత్రమే అనుసంధానిస్తే వన్‌సైడ్ పైప్‌లైన్ తగ్గిపోతుందని సూచించారు.





దీనిపై మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి జోక్యం చేసుకొంటూ కొత్తగా పైప్‌లైన్ వేసేది నాలుగున్నర వేల కి.మీ ఉంటుందని తెలిపారు. ఎమ్మెల్సీ దిలీప్‌కుమార్ మాట్లాడుతూ గతంలో అనంతపురం జిల్లాలో మంచినీటి పథకానికి పంచాయతీరాజ్ శాఖ అంచనావేస్తే రూ.900 కోట్లు అవసరమని తేలిందని, అదే సత్యసాయిబాబా ట్రస్ట్ కేవలం రూ.300 కోట్లలోనే ఆ పథకాన్ని పూర్తిచేసిందని తెలిపారు.





ఓట్లు రావనే భయంతో అడ్డుకుంటున్నారు: హరీశ్

వాటర్ గ్రిడ్ పథకం అమలైతే తమకు పుట్టగతులుండవనే భయంతోనే ప్రతిపక్షాలు ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నాయని మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. నాలుగేళ్లలో ఈ ప్రాజెక్టును పూర్తి చేసి ప్రతీ ఇంటికి మంచి నీళ్లు ఇవ్వలేకపోతే ఓట్లు అడగమని సీఎం కేసీఆర్ చెప్పారని, దీంతో ఇప్పుడొచ్చిన కొన్ని సీట్లు కూడా తమకు రావని విపక్షాలకు భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. మరింత సమయం కోల్పోకుండా పనులు జరగాలనే ఉద్దేశంతోనే ఈ బిల్లును ప్రభుత్వం తెచ్చిందన్నారు. బిల్లు శాసనమండలి ఆమోదం పొందాకే విపక్షాలు వాకౌట్ చేశాయన్నారు. గుజరాత్‌లో ఈ పథకాన్ని విజయవంతంగా అమలుచేస్తున్నారని, చట్టపరంగా ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూస్తున్నామన్నారు. అత్యంత పారదర్శకంగా టెండర్లను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తామని తెలి పారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ సంబంధీకులు కూడా టెండర్లలో పాల్గొనవచ్చన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top