కరువు కోరలు


 సాక్షి, ఖమ్మం: ‘బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి.. ఆకాశమంతా మేఘావృతం.. జిల్లా అంతటా కారు మబ్బులు.. అక్కడక్కడ జల్లులు, మరికొన్ని చోట్ల వేసవిని తలపిస్తున్న ఎండలు’ ఇదీ జిల్లాలో గత వారం రోజులుగా నెలకొన్న వాతావరణ పరిస్థితి. నైరుతి రుతు పవనాల రాకకోసం అన్నదాతలు వేయి కళ్లతో  ఎదురుచూస్తున్నా.. కారు మబ్బుల్లోంచి వరుణుడు కిందకు రావడం లేదు. ఇప్పటికే సీజన్ ప్రారంభమై రెండు నెలలు కావస్తున్నా పంటల  సాగుకు అనువైన వర్షాలు పడకపోవడంతో రైతులు ఈ ఖరీఫ్‌పై ఆశలు వదులుకున్నారు. అంతేకాకుండా వర్షాభావ పరిస్థితులతో జిల్లాలో కరువు ఛాయలు అలుముకున్నాయి.

 

జిల్లాలో ఈ ఖరీఫ్‌లో సాధారణ విస్తీర్ణం 3.51 లక్షల హెక్టార్లు. రుతు పవనాలు మొహం చాటేయడంతో ఇప్పటివరకు కేవలం 1.34 లక్షల హెక్టార్లలో మాత్రమే పలు రకాల పంటలు సాగయ్యాయి. ఇంకా 2,16,894 హెక్టార్లు బీడు భూములుగానే ఉన్నాయి. జిల్లాలో ఎక్కువగా పత్తి సాగవుతుంది. ఈ పంట సాధారణ సాగు విస్తీర్ణం 1.62 లక్షల హెక్టార్లు కాగా ఇప్పటికి 1.16 లక్షల హెక్టార్లు మాత్రమే సాగయింది. ఆ పంటలకు కూడా తగినంత వర్షం పడకపోవడంతో రైతులు బిందెలతో నీరు తెచ్చి మొక్కలను తడుపుతూ కాపాడుకుంటున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే పంట చేతికి రాదని ఆందోళన చెందుతున్నారు.

 

మిగతా పంటలు సాగు చేసిన రైతులదీ ఇదే పరిస్థితి. సీజన్ ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు అనువైన వర్షం పడకపోవడంతో వారు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు చెపుతున్నా.. వాటి  సాగుకు కూడా తగినంత వర్షం లేకపోవడంతో ఏం చేయాలో పాలుపోవడం లేదని ఆందోళన చెందుతున్నారు. సాగర్‌లో విడుదల చేసేం దుకు నీరు లేకపోవడంతో ఆయకట్టు రైతులు రూ.లక్షలు అప్పు చేసి బోర్లు, బావులు తవ్విస్తున్నారు. ఈ నీటి వనరులతోనైనా కొద్ది ఎకరాల్లో వరి సాగు చేద్దామనుకుంటే..  అసలు వర్షాలు లేకపోతే బోర్లు, బావులు కూడా ఎండిపోయే పరిస్థితి నెలకొంది.

 

22 మండలాల్లో వర్షాభావం..


రుత పవనాల జాడ లేకపోవడంతో జిల్లాలో 22 మండలాల్లో వర్షాభావ పరిస్థితి నెలకొంది. కుక్కునూరు, బూర్గంపాడు, పాల్వంచ, కొత్తగూడెం, ఇల్లెందు, బయ్యారం, గార్ల, అశ్వారావుపేట, దమ్మపేట, సత్తుపల్లి, వేంసూరు, తల్లాడ, కొణిజర్ల, ఖమ్మం అర్బన్, ఖమ్మం రూరల్, తిరుమలాయపాలెం, కూసుమంచి, చింతకాని, వైరా, బోనకల్, మధిర, ఎర్రుపాలెం మండలాల్లో కనీస వర్షపాతం కూడా నమోదు కాలేదు.



గత ఏడాది ఇదే నెలలో సగటున ఒక్కో మండలంలో 33.9 సెం.మీ వర్షం పడితే ప్రస్తుతం ఈ నెలలో 11.7 సెం.మీ వర్షం మాత్రమే కురిసింది. గత నెలలో కేవలం ఐదు రోజులే వర్షాలు పడడం, ఈ నెలలో ఇప్పటి వరకు 10 రోజులు పొడి జల్లులే కురవడంతో ఇక సాగుపై అన్నదాతల ఆశలు వదులుకున్నారు. గత ఏడాది జూలైలో సాధారణ వర్షపాతం 31.4 సెం.మీ కాగా 33.9 సెం.మీ వర్షం పడింది. ప్రతి ఖరీఫ్‌లో సాధారణ వర్షపాతం కన్నా అదనంగా పడుతున్నా ఈసారి కనీసం సాధారణ వర్షపాతం కూడా నమోదు కాకపోవడం రైతులను ఆవేదనకు గురి చేస్తోంది. ఈ వారం రోజుల్లో నైరుతి రుతు పవనాలు అనుకూలించి వర్షం పడితేనే ఈ నెల సాధారణ వర్షపాత స్థితికి చేరే అవకాశం ఉంది.

 

వర్షాభావంపై శాస్త్రవేత్తల అధ్యయనం..

వాతావరణ పరిస్థితులపై అధ్యయనానికి ప్రభుత్వం జిల్లాకు ఎనిమిది మందితో కూడిన శాస్త్రవేత్తల బృందాన్ని పంపింది. కూసుమంచి మండలం జీళ్లచెరువు, వైరా మండలం రెబ్బవరం, అష్ణగుర్తి గ్రామాల్లో సోమవారం ఈ బృందం పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడింది. విత్తిన పత్తి గింజలు, మొలకెత్తిన పత్తిని సభ్యులు పరిశీలించారు. ఈ వారం రోజులలో వర్షం పడకపోతే కంది, జొన్న, పొద్దు తిరుగుడు సాగు చేసుకోవాలని సూచించారు.

 

ఈనెలలో వర్షం పడకపోతే వేసిన పంటలు ఎండిపోయే పరిస్థితి ఉందన్నారు. జిల్లాలో ఉన్న వర్షాభావ పరిస్థితులు, ఎండిపోతున్న పంటల విషయమై వ్యవసాయ శాఖ అధికారులతో శాస్త్రవేత్తలు చర్చించారు. గతంలో వర్షపాత నమోదు, పంటల సాగు వివరాలు తీసుకున్నారు. మొత్తంగా జిల్లాలో వర్షాభావ పరిస్థితి, పంటల సాగుపై నివేదిక తయారు చేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అందజేస్తామని తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top