‘వాటర్ గ్రిడ్’కు ప్రత్యేక విభాగం

‘వాటర్ గ్రిడ్’కు ప్రత్యేక విభాగం - Sakshi


⇒ కొత్తగా డివిజన్లు, సబ్ డివిజన్ల ఏర్పాటు

⇒52 మంది వివిధ కేడర్ల ఇంజనీర్ల కేటాయింపు

⇒ఉత్తర్వులు విడుదల చేసిన రేమండ్ పీటర్

⇒ఇక వేగంగా కొనసాగనున్న పనులు


సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ‘వాటర్ గ్రిడ్’ పర్యవేక్షణకు ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రిన్సిపల్ కార్యదర్శి జె.రేమండ్ పీటర్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. గ్రామీణ నీటి సరఫరా పథకం పునర్విభజనలో భాగంగా ఆర్‌డబ్ల్యూఎస్‌కు తోడు వాటర్‌గ్రిడ్ పనులను వేగవంతం చేయడంతో పాటు నిర్మాణ, నిర్వహణ బాధ్యతలను ఇకనుంచి ‘తెలంగాణ డ్రింకింగ్ వాటర్ సప్లయ్ ప్రాజెక్టు (టీడీడబ్ల్యూఎస్‌పీ)’ చేపట్టనుంది.



ఇంతకు ముందు రాష్ట్ర వ్యాప్తంగా ఏడు సర్కిళ్లు, 25 డివిజన్లు, 67 సబ్‌డివిజన్లు ఉండగా, వాటర్‌గ్రిడ్ కోసం 9 సర్కిళ్లు, 20 డివిజన్లు, 92 సబ్‌డివిజన్లను ఏర్పాటు చేసిన ప్రభుత్వం జిల్లాలో మూడు డివిజన్లు, 15 సబ్ డివిజన్లకు శ్రీకారం చుట్టనున్నట్లు తెలిసింది. ఆర్‌డబ్ల్యూఎస్ కింద నిజామాబాద్, బాన్సువాడ డివిజన్లు ఉండగా,టీఎస్‌డబ్ల్యూఎస్‌పీ కింద నిజామాబాద్,బాన్సు వాడ, ఆర్మూరు డివిజన్లు వాటర్‌గ్రిడ్ కోసం పనిచేస్తాయి. వాటర్‌గ్రిడ్ కోసం రాష్ట్రవ్యాప్తంగా ఒక చీఫ్ ఇంజినీర్, 10 ఎస్‌ఈలు, 31 మంది ఈఈలు, 104 మందిడిప్యూటీ ఈఈలు, 346 ఏఈఈ/ఏఈలను నియమించనుండగా, జిల్లాకు ఒక ఎస్‌ఈ, ముగ్గురు ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్లతో పాటు డిప్యూటీ ఈఈలు,  ఏఈఈలను కేటాయించారు.



నిజామాబాద్ కేంద్రంగా వాటర్‌గ్రిడ్ కోసం ఒక క్వాలిటీ కంట్రోల్ డివిజన్, నిజామాబాద్, బాన్సువాడలలో రెండు సబ్‌డివిజన్లు ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం 35 రెగ్యులర్ వర్క్‌ఇన్స్‌పెక్టర్లకు తోడు 17 మందిని ఔట్‌సోర్సింగ్ ద్వారా కొత్తగా నియమిస్తే ఆ సంఖ్య మొత్తం 52కు చేరుతుంది.



అలాగే టీడీడబ్ల్యూఎస్‌పీ కింద వివిధ కేడర్‌లకు చెందిన ఇంజినీర్లుగా పదవీ విరమణ చేసిన వారిని సైతం నియమించుకోవచ్చని ఇదివరకే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. నాలుగేళ్లలో వాటర్‌గ్రిడ్ పథకాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం సర్వేల ప్రక్రియ పూర్తి చేయగా.. త్వరలోనే ఆ పథకం పనులు చేపట్టే క్రమంలో పెద్ద ఎత్తున మార్పులు, విభజనలకు శ్రీకారం చుట్టడం చర్చనీయాంశం అవుతోంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top