వాటర్ గ్రిడ్ @ రూ.3,500 కోట్లు

వాటర్ గ్రిడ్ @ రూ.3,500 కోట్లు - Sakshi


సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : ‘ప్రతి ఇంటికి నల్లా.. ప్రతి పౌరుడికీ రక్షిత నీరు’ లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘వాటర్‌గ్రిడ్’ ప్రాజెక్టు డిజైన్‌ను జిల్లా యంత్రాంగం ఖరారు చేసింది. గోదావరి, కృష్ణా జలాలను తాగునీరు, పారిశ్రామిక అవసరాలను దృష్టిలో పెట్టుకుని కార్యాచరణ ప్రణాళిక రూపొందించిన గ్రామీణ నీటి సరఫరా విభాగం (ఆర్‌డబ్ల్యూఎస్).. పథకం ఆచరణకు రూ.3,500 కోట్లు అవసరమని అంచనా వేసింది.



2011 లెక్కల ప్రకారం వాటర్‌గ్రిడ్ ప్రతిపాదిత ప్రాంత జనాభా 16,78,414. దీనికి అనుగుణంగా గోదావరి, శ్రీశైలం బ్యాక్‌వాటర్ నుంచి 6.824 టీఎంసీలను వాడుకునేలా ప్రణాళిక తయారు చేసింది. ఇదిలావుండగా మరోవైపు వాటర్‌గ్రిడ్ ఏర్పాటుపై శనివారం వికారాబాద్‌లో పంచాయతీ రాజ్‌శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు జిల్లా అధికారులతో సుదీర్ఘంగా సమీక్షించారు.

 

కృష్ణా, గోదావరి జలాలు

మారుమూల పల్లెలకు సైతం రక్షిత నీరు అందించాలని భావిస్తున్న ప్రభుత్వం.. వాటర్‌గ్రిడ్ ద్వారా రెండు నదుల జలాలు వినియోగించుకునేలా ప్రాజెక్టును రూపొందించింది. గోదావరి జలాలను సెగ్మెంట్-1, శ్రీశైలం బ్యాక్‌వాటర్‌ను సెగ్మెంట్-2 నిర్వచించింది. మహబూబ్‌నగర్ జిల్లా కొల్లాపూర్ మండలం ఎల్లూరు శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి జిల్లా మీదుగా జంట నగరాలకు మంచినీటిని సరఫరా చేయాలని హైదరాబాద్ జలమండలి నిర్ణయించింది. ఈ నీటిలో 4.791 టీఎంసీలను జిల్లా అవసరాలకు కేటాయించారు. తద్వారా 28 మండలాలు, మూడు నగర పంచాయతీలు, రెండు మున్సిపాలిటీల దాహార్తి తీరనుంది.



కర్కల్‌పహాడ్, ఫరూఖ్‌నగర్, కొందుర్గు, బొంరాస్‌పేట సమీపంలో ఏర్పాటు చేసే పంపింగ్ స్టేషన్ల నుంచి జిల్లాలోని నిర్ధేశిత ప్రాంతాలకు నీటి సరఫరా జరుగనుంది. ఇక సెగ్మెంట్-1లో ప్రతిపాదించిన గోదారి జలాలు కుత్బుల్లాపూర్, మేడ్చ ల్ నియోజకవర్గాలకు కేటాయించారు. ఈ నీటి ని ఘన్‌ఫూర్ నుంచి ఈ రెండు నియోజకవర్గాలకు 2.033 టీఎంసీల పంపిణీ చేయనున్నారు.

 మూడేళ్లలో కార్యరూపం

 

వాటర్‌గ్రిడ్ అంచనా వ్యయం రూ.3,500 కోట్లు కాగా, దీంట్లో ప్రాథమిక సరఫరా వ్యవస్థకు రూ.450 కోట్లు, ద్వితీయ స్థాయి సరఫరా వ్యవస్థకు రూ.2,300 కోట్లు, గ్రామాల్లో అంతర్గత సరఫరాకు రూ.750 కోట్లు అవసరమని అంచనా వేసింది. 2018 నాటికీ వాటర్‌గ్రిడ్ ద్వారా అన్ని గ్రామాలకు జలాలు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్న  ఈ పథకానికి 3.64 మెగావాట్ల విద్యుత్ అవసరమని లెక్క తేల్చింది. కొందుర్గు వరకు గ్రావిటీ ద్వారా శ్రీశైలం బ్యాక్ వాటర్ వస్తున్నప్పటికీ అక్కడి నుంచి జిల్లాలోని మారుమూల ప్రాంతాలకు పంపింగ్‌కు చేసేందుకు మాత్రం విద్యుత్ తప్పనిసరి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top