వృథా నీటితో విద్యుత్ ఉత్పత్తి


  • చిన్నరావిరాలలోని మూసీ వంతెన వద్ద ప్రయోగం సక్సెస్

  • రూ.2.50 లక్షలు వెచ్చించిన సుమన్‌రెడ్డి

  • పెద్దఅంబర్‌పేట: మూసీలోని వృథా నీటితో విద్యుత్ ఉత్పత్తి చేసి ఓ బీటెక్ విద్యార్థి అందరిని అబ్బురపరిచాడు. హయత్‌నగర్ మండలం చిన్నరావిరాలలోని మూసీ వంతెన వద్ద అదే గ్రామానికి చెందిన కొలను మోహన్‌రెడ్డి కుమారుడు కొలను సుమన్‌రెడ్డి ఇటీవలే బీటెక్ పూర్తి చేశాడు. మినీ హైడల్ పవర్ జనరేషన్ ప్రాజెక్ట్‌ను రూపొందించాడు. మూసీ వంతెన వద్ద నీటి నుంచి విద్యుత్‌ను తయారు చేసి 3హెచ్‌పీ, 5హెచ్‌పీ మోటార్ పంప్‌సెట్‌లను నడిపించి అందరి దృష్టిని ఆకర్షించాడు.



    ప్రాజెక్టు రూపకల్పన విద్యార్థి సుమన్‌రెడ్డి మాటల్లోనే.. ‘మూసీ వంతెన వద్ద వృథా అవుతున్న నీటిని సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతోనే హైడల్ పవర్ జనరేషన్ ప్రాజెక్టును తయారు చేశా. ఈ ప్రాజెక్టును తయారు చేయడానికి రూ.2.50 లక్షల వరకు ఖర్చు చేశా. ఇలాంటి ప్రయోగం ద్వారా వృథాగా పోతున్న నీటి నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసి మూసీ పరిసర గ్రామాలకు సరఫరా చేయవచ్చు. దీని  తయారీ కోసం బ్యాలెన్సింగ్ వీల్స్ రెండింటిని వినియోగించా.



    ఒక్కోటి 350 కిలోల చొప్పున ఉంటుంది. ఎనిమిది బ్లేడ్లు, 10 కేవీ డైనమో, 3 హెచ్‌పీ మోటార్ సహాయంతో ఈ యంత్రాన్ని రూపొందించగలిగాను. ఇందుకోసం రెండు నెలల పాటు శ్రమించాను. ప్రస్తుతం దీని ద్వారా 7 కేఈ విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. వంతెన కట్ట ఎత్తు తక్కువగా ఉండడం వల్ల విద్యుత్ ఉత్పత్తి కూడా తక్కువగానే ఉంది. ఎత్తుగా ఉన్న ప్రాంతంలో అమర్చితే ఉత్పిత్తిని మరింత పెంచుకోవచ్చు. నా ప్రయోగం సక్సెస్ అయినందుకు ఆనందంగా ఉంది. ఈ విషయంలో ప్రభుత్వం మరింత ముందుకు వెళ్తుందని ఆశిస్తున్నా’నని సుమన్‌రెడ్డి తెలిపారు.

     

    ప్రశంసించిన భువనగిరి ఎంపీ



    బీటెక్ విద్యార్థి సుమన్ ప్రయోగం గురించి తెలుసుకున్న భువనగిరి ఎంపీ బూరనర్సయ్య గౌడ్ ఆదివారం చిన్నరావిరాలలోని మూసీ వంతెనను సందర్శించారు. వృథా నీటి నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసి మోటార్లు నడిపిస్తున్న తీరును చూసి ఆశ్చర్యపోయారు. సుమన్ కృషిని అభినందించారు. విద్యార్థులు ఇలాంటి పరిశోధనలపై దృష్టిసారించి దేశాభివృద్ధిలో భాగస్వావుులు కావాలని ఆయన ఆకాంక్షించారు. పరిశోధనలపై దృష్టి పెట్టే విద్యార్థులను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని తెలిపారు.

     

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top