వసతి గృహాలకు.. విద్యార్థులు కావలెను


 స్థానికంగా ఉండని వార్డెన్లు

ఉన్నతాధికారుల పర్యవేక్షణ కరువు

 

 ఒకప్పుడు సాంఘిక సంక్షేమ వసతిగృహా (హాస్టళ్లు) ల్లో చేరాలంటే విద్యార్థులకు సిఫార్సులు అవసరమయ్యేవి.. నేడు వాటిలో చేరడానికి విద్యార్థులెవరూ ముందుకు రావడంలేదు.. ఖాళీలున్నాయి చేర్పించండంటూ వార్డెన్లు వేడుకునే దుస్ధితి దాపురించింది..

 

 చేవెళ్ల : డివిజన్ పరిధిలోని అసిస్టెంట్ సాంఘిక సంక్షేమాధికారి (ఏఎస్‌డబ్ల్యూఓ) పరిధిలో 14 ఎస్సీ హాస్టళ్లున్నాయి. వీటిలో సుమారు 40శాతానికిపైగా ఖాళీలున్నాయి. 2015-16 విద్యాసంవత్సరం ప్రారంభమై నెలరోజులు దాటినా ఇంకా పూర్తిగా భర్తీ కాలేదు. మొత్తం 1,400 మంది విద్యార్థులకుగాను కేవలం 991 మంది మాత్రమే ఉన్నారు. 409 సీట్లు ఖాళీగా ఉన్నాయి. ప్రతి హాస్టల్‌లో కనీసం వంద మందిని చేర్చుకునే అవకాశముంది. ఇంతవరకు 35 నుంచి 40 శాతం వరకు ఖాళీలున్నాయి.



చేవెళ్ల బాలుర హాస్టల్‌లో 52 మంది విద్యార్థులు, బాలికల హాస్టల్‌లో 64, ఆలూరు బాలుర హాస్టల్‌లో 40, పెద్దమంగళారం హాస్టల్‌లో 29, శంకర్‌పల్లి బాలుర హాస్టల్‌లో 102, బాలికల హాస్టల్‌లో 63, షాబాద్ బాలుర హాస్టల్‌లో 92, హైతాబాద్ బాలికల హాస్టల్‌లో 82, దర్గా బాలుర హాస్టల్‌లో 68, నార్సింగి బాలికల హాస్టల్‌లో 60, రాజేంద్రనగర్ బాలుర హాస్టల్‌లో 95 మంది, బాలికల హాస్టల్‌లో 172, శం షాబాద్ బాలుర హాస్టల్‌లో 35, బాలికల హాస్టల్‌లో 37 మంది విద్యార్థులు మాత్రమే చేరారు.



 ఎందువల్ల?

 ఆయా హాస్టళ్లలో సన్నబియ్యంతో అన్నం వండుతున్నా నాసిరకమైన కూరగాయలు, నీళ్లచారు వండి వడ్డిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. పాఠశాలల నుంచి సాయంత్రం వచ్చినప్పటినుంచి వార్డెన్ దగ్గరుండి పిల్లలను చదివించాలి. చేరిన విద్యార్థుల్లో స్థానికులైతే చుట్టపుచూపుగా వచ్చిపోతున్నారు. చాలా మంది వార్డెన్లు స్థానికంగా అందుబాటులో ఉండటంలేదు. దీంతో కామాటీలు, వాచ్‌మెన్‌లు, పనిమనుషులు విద్యార్థుల పట్ల ఇష్టారాాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ట్యూషన్లు కూడా చెప్పేవారే కరువయ్యారు. వార్డెన్లు ముట్టజెప్పే అమ్యామ్యాలకు ఉన్నతాధికారులు ఆశపడి కనీసం వారం, పదిహేను రోజులకోసారైనా హాస్టళ్లను పర్యవేక్షించిన పాపానపోవడంలేదని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఉదాహరణకు చేవెళ్లలోని బీసీ హాస్టల్‌లో ఇటీవల తాగునీటి కొరతతో మధ్యాహ్నం వరకు కూడా విద్యార్థులు ముఖం కడుక్కోకుండా, స్నానం చేయకుండా ఉన్నారంటే నీటి సమస్య ఎంత తీవ్రంగా ఉందో అర్థంచేసుకోవచ్చు.

 

 విద్యార్థుల సంఖ్యపై కాకిలెక్కలు

  ఇప్పటికే హాస్టళ్లలో అతితక్కువ సంఖ్యలో విద్యార్థులున్నా ఉన్నవారి విషయంలోనూ కాకిలెక్కలు చెబుతున్నారు. మా హాస్టల్‌లో ఇంతమంది విద్యార్థులున్నారని రిజిస్టర్‌లో చూపిస్తున్న వార్డెన్లు ఎప్పుడైనా ఆకస్మికంగా ఎవరైనా అధికారులు వెళితే ఆ సంఖ్య కనిపించని సందర్భాలున్నాయి. ఎక్కడికి వెళ్లారని నిలదీస్తే ఇప్పుడే వెళ్లారనో, స్థానికులైందున ఇళ్లకు వెళ్లారనో అస్పష్ట సమాధానాలు చెబుతున్నారు. ఏ రోజుకారోజు విద్యార్థుల సంఖ్యను బట్టిమెనూ చార్జీలు క్లెయిమ్ చేయాల్సి ఉన్నా రిజిస్టర్‌లో నమోదైన సంఖ్య ప్రకారమే పేద విద్యార్థుల బిల్లులు దండుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. దీంతో ఈ హాస్టళ్లలో చేరడానికి విద్యార్థులు, చేర్పించడానికి వారి తల్లిదండ్రులు ఆసక్తి చూపించడంలేదు.   

 

 ఖాళీలున్నమాట నిజమే

 చాలా హాస్టళ్లలో ఖాళీలున్నమాట నిజమే.ఆదర్శపాఠశాలలు, కస్తూర్బాగాంధీ బాలికల విద్యాల యాలు (కేజీబీవీ) వసతి గృహాలు ఏర్పాటుచేయడంవల్ల సంక్షేమ హాస్టళ్లలో చేరేవారి సంఖ్య ప్రతియేటా తగ్గుతోంది. హాస్టళ్లలో అన్ని వసతులు కల్పిస్తున్నాం. తరచూ ఆకస్మిక తనిఖీలు చేస్తున్నాం.

 - శ్వేతాప్రియదర్శిని, ఏఎస్‌డబ్ల్యూఓ

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top