కాజీపేట్‌లో వ్యాగన్ వర్క్‌షాప్‌కు సిద్ధం

కాజీపేట్‌లో వ్యాగన్ వర్క్‌షాప్‌కు సిద్ధం


రైల్వే మంత్రి సదానంద వెల్లడి

 

హైదరాబాద్: తెలంగాణలోని కాజీపేట్‌లో రైల్వే వ్యాగన్ వర్క్‌షాపు ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నామని రైల్వే మంత్రి డి.వి.సదానంద గౌడ తెలిపారు. దీనికి సంబంధించిన భూ సేకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి క్లియరెన్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు. శుక్రవారమిక్కడి రైల్ నిలయంలో దక్షిణమధ్య రైల్వే ఉన్నతాధికారులతో వివిధ అంశాలపై ఆయన సమీక్ష నిర్వహించారు అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో మిడ్‌లైఫ్ కోచ్ హ్యాబిలిటేషన్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు అక్కడి ప్రభుత్వం కూడా స్థల సేకరణ చేయాల్సి ఉందన్నారు. ఏపీలో కొత్త రైల్వేజోన్ ఏర్పాటుపై కమిటీ వేశామని, అక్టోబర్ 14న కమిటీ సమర్పించే నివేదిక ను పరిశీలించాక తదుపరి చర్యలను ప్రకటిస్తామని వెల్లడించారు. రైల్వేలో భ ద్రత, రక్షణ, సేవలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి చెప్పారు.



రైల్వే రక్షక దళంలో 17 వేల పోస్టులను భర్తీ చేయనున్నామని, వీటిలో 4 వేల పోస్టుల్లో మహిళలను నియమిస్తామని వివరించారు. భారతీయ రైల్వేలో కొత్త శకం ఆరంభమైందని, నిధుల లోటును అధిగమించేందుకే ఎఫ్‌డీఐలను అనుమతిస్తున్నామని రైల్వే మంత్రి వెల్లడించారు. దక్షిణమధ్య రైల్వే పరిధిలో వివిధ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి బడ్జెట్‌లో రూ.2,016 కోట్లు కేటాయించినట్టు చెప్పారు. లైన్ల డబ్లింగ్, లెవల్ క్రాసింగ్ గేట్లు, ఆర్‌వోబీ, ఆర్‌యూబీల నిర్మాణం, ప్రయాణికులకు మౌలిక వసతులు, సిగ్నలింగ్ వ్యవస్థల కోసం ఎక్కువ నిధులను వినియోగిస్తామని వెల్లడించారు. అక్టోబర్ 2 నుంచి దేశవ్యాప్తంగా నిర్వహించే ‘స్వచ్ఛత్-అభియాన్’ కార్యక్రమంలో ఉద్యోగులంతా శ్రమదాన కార్యక్రమంలో పాల్గొంటారని వెల్లడించారు. రైల్వేస్టేషన్లలో సోలార్ విద్యుత్తు వినియోగంపై దృష్టి పెట్టినట్టు చెప్పారు.

 

మహిళా ప్రయాణికులకు పటిష్ట భద్రత


 

రైళ్లలో మహిళా ప్రయాణికులు సురక్షితంగా ప్రయాణించేందుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటామని రైల్వే మంత్రి డి.వి.సదానందగౌడ తెలిపారు. ప్రధాన రైల్వేస్టేషన్‌లలో భద్రతా చర్యలను కట్టుదిట్టం చేసేందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన సర్వేలెన్స్ కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. రైల్వే రక్షక దళం 53వ బ్యాచ్ సబ్‌ఇన్‌స్పెక్టర్ల శిక్షణ ముగింపు సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లోని మౌలాలీ ఆర్‌పీఎఫ్ శిక్షణా కేంద్రంలో ఏర్పాటు చేసిన ‘దీక్షంత్’(పాసింగ్ ఔట్ పరేడ్) కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై  గౌరవవందనం స్వీకరించారు.



రెల్వే మజ్దూర్ యూనియన్  నిరసన



విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను నిరసిస్తూ  దక్షిణమధ్య రైల్వే మజ్దూర్ యూనియన్  శుక్రవారం సికింద్రాబాద్  రైల్‌నిలయం వద్ద ధర్నా నిర్వహించింది. మరో ప్రధాన కార్మిక సంఘం దక్షిణమధ్య రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ ప్రతినిధి బృందం మంత్రిని కలసి జాతీయ పెన్షన్ వ్యవస్థ నుంచి రైల్వేలకు మినహాయింపు ఇవ్వాలని, క్వార్టర్‌లను మెరుగుపర్చాలని విన్నవించింది.



ప్రాజెక్టులు పూర్తి చేయండి: దత్తాత్రేయ



తెలంగాణలో పెండింగ్‌లోని అభివృద్ధి పనులను వెంటనే చేపట్టాలని ఎంపీ బండారు దత్తాత్రేయ మంత్రి  సదానందగౌడను కలసి విజ్ఞప్తి చేశారు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top