వేతనాలే కాదు.. బాధ్యతలూ పెరిగాయి !


జోగిపేట: ప్రభుత్వ ఉపాధ్యాయులతో సమానంగా పనిచేసినా సర్కారు పనుల్లో సహాయపడినా అరకొర జీతాలే దక్కుతున్నాయని ఆవేదన వ్యక్తం చేసిన అంగన్‌వాడీ ఉద్యోగులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వేతనాలు పెంచడంతో వారిలో ఆనందం వెల్లివిరుస్తోంది. అయితే తమకు వేతనాలు పెరిగినందుకు ఆనంద పడాలో బాధ్యతలు పెరిగినందుకు బాధపడాలో తెలియని పరిస్థితి నెలకొంది. వచ్చేనెల నుంచి పెంచిన వేతనాలను అంగన్‌వాడీలకు అందజేయాలంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 



బాధ్యతాయుతంగా పనిచేయని అంగన్‌వాడీలను తొలగిస్తామనే హెచ్చరికలను కూడా ప్రభుత్వం జారీ చేసింది.అంగన్‌వాడీ కార్యకర్తలకు రూ.4200 నుంచి రూ.7వేలకు, మినీ అంగన్‌వాడీ కేంద్రాల కార్యకర్తలకు రూ.2200 నుంచి రూ.4500, ఆయాలకు రూ.2200 నుంచి రూ.4500 వేతనం పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

 

జిల్లాలో 6768 మందికి లబ్ధి

వేతనాల పెంపుతో జిల్లాలోని 6768 మంది అంగన్‌వాడీ కార్యకర్తలు, మినీ అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు లబ్ధిపొందనున్నారు. జిల్లాలో 3009 ముఖ్య అంగన్‌వాడీ కేంద్రాలుండగా, 375 మినీ అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. జోగిపేట, నర్సాపూర్, గజ్వేల్, రామాయంపేట, నారాయణఖేడ్, మెదక్, జహీరాబాద్, సదాశివపేట, పటాన్‌చెరు, సిద్దిపేట, దుబ్బాక సెక్టార్ల పరిధిలోని 3084 మంది ఆయాలు 3009 మంది కార్యకర్తలు, 375 మంది మినీ అంగన్‌వాడీ కార్యకర్తలు పనిచేస్తున్నారు. వీరందరికి ఈనెల నుంచే పెంచిన వేతనాలు వర్తిస్తాయి.

 

పెరిగిన బాధ్యతలు..


అంగన్‌వాడీలకు పెరిగిన వేతనాలతో పాటు  బాధ్యతలు కూడా పెరిగాయి. ప్రతి కేంద్రం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు తప్పనిసరిగా పనిచేయాలి. వేతనాలు పెరిగినందున కార్యకర్తలు, ఆయాలు మరింత బాధ్యతగా పనిచేయాల్సి ఉంటుంది. నీతీ నిజాయితీతో బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలి. పనితీరు నివేదిక ఆధారంగానే వేతనాలను ప్రతినెలా బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు. కార్యకర్తలకు, ఆయాలకు ప్రతి సంవత్సరం 12 సాధారణ సెలవులు, మే నెలలో 15 రోజుల సెలవులు ఉంటాయి. నిధుల దుర్వినియోగం, సరుకుల అక్రమ రవాణా వంటి కార్యకలాపాలకు పాల్పడితే ఉద్యోగంలో నుంచి తొలగిస్తారు. 15 రోజుల పాటు విధులకు గైర్హాజరైతే వేటు తప్పదంటూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గతంలో మాదిరిగా ఇష్టం వచ్చినట్లు కేంద్రాల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు.

 

కాసులడిగితే కేసులే : మహిళ, శిశు సంక్షేమశాఖ అధ్యక్షుడు జయరాం

వేతనాలు పెపు తమ చలవేనని, తాము చేపట్టిన ఉద్యమాల ఫలితంగానే వేతనాలు పెరిగాయాంటూ కొందరు యూనియన్ల పేరుతో అంగన్‌వాడీ కార్యకర్తల వద్ద డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు తమకు ఫిర్యాదులు వస్తున్నాయని రాష్ట్ర మహిళ, శిశు సంక్షేమశాఖ అధ్యక్షుడు జయరాం అన్నారు. ఆయన సాక్షితో మాట్లాడుతూ డబ్బుల కోసం వేధిస్తే క్రిమినల్ కేసులు పెట్టిస్తామని హెచ్చరించారు. అంగన్‌వాడీ కార్యకర్తల పనితీరును గుర్తించి, ఎన్నికలకు ముందు ఇచ్చిన హమీ మేరకే ముఖ్యమంత్రి కేసీఆర్ వేతనాలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top