'రేసు'గుర్రం ఎవరు?

'రేసు'గుర్రం ఎవరు?


(సాక్షి వెబ్ ప్రత్యేకం)


ప్రతిష్టాత్మక వరంగల్ ఉపపోరుపై రాజకీయ పార్టీలు దృష్టి సారించాయి. వరంగల్ ఎంపీ స్థానానికి ప్రధాన పొలిటికల్ పార్టీలు అభ్యర్థుల వేటలో పడ్డాయి. ఎంపీగా ఉన్న కడియం శ్రీహరి తెలంగాణ రాష్ట్ర విద్యామంత్రిగా బాధ్యలు చేపట్టడంతో వరంగల్ లోక్ సభ సీటుకు త్వరలో ఉప ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో 'సూటబుల్ కేండిడేట్' కోసం టీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీ-బీజేపీ జల్లెడ పడుతున్నాయి. ఎస్సీకి రిజర్వు అయిన ఈ స్థానంలో ఉప పోరుకు ఇప్పటికే పలువురు పేర్లు తెరపైకి వచ్చాయి.



కాంగ్రెస్ తరపున పెద్దపల్లి మాజీ ఎంపీ జి. వివేకానంద పేరు ప్రముఖంగా వినబడుతోంది. ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ లో చేరిన వివేక్ తర్వాత మనసు మార్చుకుని మళ్లీ సొంతగూటికి వచ్చారు. వరంగల్ ఉప ఎన్నిక ద్వారా ఆయన సొంత జిల్లాకు వచ్చే అవకాశముందని అంటున్నారు. గత ఎన్నికల్లో కడియం శ్రీహరి చేతిలో ఓటమి పాలయిన కాంగ్రెస్ సిరిసిల్ల రాజయ్య కూడా మరోసారి పోటీకి సై అంటున్నారు. 'అధిష్టానమ్మ' భక్తుడు  సర్వే సత్యనారాయణ కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టు గుసగుసలు విన్పిస్తున్నాయి.



వరంగల్ టీఆర్ఎస్ నేతల మధ్య విభేదాలను సొమ్ము చేసుకోవాలని టీడీపీ-బీజేపీ కూటమి భావిస్తోంది. బలమైన అభ్యర్థిని నిలబెట్టడం ద్వారా ఓరుగల్లులో పాగా వేయాలని వ్యూహాలు రచిస్తోంది. పొత్తులో భాగంగా గత ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ అభ్యర్థిని నిలబెట్టారు. ఈసారి కూడా కమలం పార్టీ కేండిడేట్ బరిలో దిగే అవకాశముంది. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తైన నేపథ్యంలో ఉపపోరును 'రెఫరెండం'గా ప్రజల ముందుకు తీసుకెళ్లాలని విపక్షాలు భావిస్తున్నాయి. ఓయూ భూముల వివాదం, ప్రజాసంఘాల ఐక్యతతో కలవరపడుతున్న అధికార పార్టీ ఉపపోరును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.



ఎలాగైనా తమ సీటును నిలబెట్టుకోవాలని గులాబీ పార్టీ పట్టుదలతో పావులు కదుపుతోంది. దీటైన అభ్యర్థిని నిలిపి 'పోరుగడ్డ'పై తమ ఆధిపత్యాన్ని కొనసాగించాలని భావిస్తోంది. కేసీఆర్ అవకాశమిస్తే వరంగల్ పార్లమెంట్ స్థానం ఉప ఎన్నికలో రేసుగుర్రాన్ని తానే అవుతానని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి రేసులోకి దూసుకొచ్చారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లా సత్తుపల్లి నుంచి పోటీ చేసి ఓడిపోయిన రవి మనసులోని మాట బయటపెట్టడంతో రేసు రసవత్తరంగా మారనుంది. టీఆర్‌ఎస్‌ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఎర్రోళ్ల శ్రీనివాస్‌ కూడా రేసులో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. రేసులో ఇంకెవరి పేర్లు తెరపైకి వస్తాయో చూడాలి. కాగా, ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత వారం రోజుల్లో తాను ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని కడియం శ్రీహరి ప్రకటించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top