అలంపూర్‌లో వీఐపీ పుష్కరఘాట్

అలంపూర్‌లో వీఐపీ పుష్కరఘాట్ - Sakshi


అలంపూర్: ఉహించిన విధంగానే దక్షిణ కాశీ అలంపూర్ పుణ్యక్షేత్రానికే కృష్ణా పుష్కరాల ప్రాముఖ్యత లభించనుంది. త్వరలో జరగనున్న కృష్ణా పుష్కరాల్లో అలంపూర్  కీలకంగా ఉండనుంది. ముఖ్యమంత్రి వంటి ప్రముఖులు అలంపూర్ క్షేత్రంలోనే పుష్కర స్నానాలు చేసే విధంగా వీఐపీ ఘాట్ నిర్మాణానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ ఘాట్ నిర్మాణానికి నీటి పారుదల శాఖ అధికారులు ఇప్పటికే సర్వే పనులు చేపట్టారు.



తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ నేతగా అలంపూర్ నుంచి పాదయాత్ర చేపట్టిన కేసీఆర్.. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఈ క్షేత్రాన్ని సందర్శించలేదు. దేశంలోనే ఖ్యాతి గడించిన శక్తి పీఠం, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంతో ఏకైక శక్తి పీఠంగా గుర్తింపు ఉన్న అలంపూర్ క్షేత్ర అభివృద్ధిని విస్మరిస్తున్నారనే ఆవేదన స్థానికంగా నెలకొంది. అయితే ఈ కోరిక తీర్చడంతోపాటు అత్యంత ప్రతిష్టాత్మకమైన కృష్ణా పుష్కరాలకు అలంపూర్‌ను కేంద్ర బిందువుగా చేస్తూ ఈ క్షేత్రంలోనే ముఖ్యమంత్రి పుష్కరాలను ప్రారంభించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. కృష్ణా నది తీరంలో ఉన్న గొందిమల్ల గ్రామంలో నిర్మించే ఘాట్‌లో పుష్కరాలను ప్రారంభించి అలంపూర్‌లో వెలిసిన శ్రీజోగుళాంబమాత, బాలబ్రహ్మేశ్వర స్వామిని దర్శించుకుంటారని సమాచారం.



 గొందిమల్ల టు అలంపూర్ :

 కృష్ణా, తుంగభద్ర నదుల సంగమం జరిగే ప్రదేశానికి దాదాపు మూడు కిలోమీటర్ల పైన పుష్కరఘాట్ నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించారు. అలంపూర్ పట్టణంలోని శ్రీబాలబ్రహ్మేశ్వర స్వామి, శ్రీజోగుళాంబ అమ్మవారి ఆలయాలకు అతిసమీపంలోనే ఉన్న గుందిమల్ల గ్రామం వద్ద ఈ ఘాట్ నిర్మాణం చేస్తున్నారు. కృష్ణా, తుంగభద్ర నదులు కలిసే ప్రాంతమిది. రెండు నదులు, నీట మునక పొలాలతో ఇక్కడ విశాలమైన మైదానం ఉంది. ఇక్కడే పుష్కరస్నానాలు చేసుకున్న భక్తులు గొంది మల్ల గ్రామంలో వెలిసిన కారేశ్వరి క్షేత్రం, ఇంకా ముందుకు వస్తే అలంపూర్ క్షేత్ర ఆలయాలను దర్శించుకునే సౌకర్యం ఉంది.



 వీఐపీ ఘాట్ 100 మీటర్లు  

 కృష్ణా పుష్కరాలకు అలంపూర్ మండలం గొందిమల్ల, క్యాతూర్, మారమునగాల గ్రామాల్లో పుష్కరఘాట్‌ల నిర్మాణాల కోసం స్థలాలను పరిశీ లించారు. అయితే మొదట్లో ఇక్కడ 30 మీటర్ల పుష్కరఘాట్‌ల నిర్మాణం చేపట్టాలని భావించారు. ప్రస్తుతం ముఖ్యమంత్రితో సహా ఇతర వీఐపీలు సైతం ఇక్కడే పుష్కర స్నానాలు ఆచరించే విధంగా పుష్కరఘాట్ నిర్మించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీంతో వీఐపీలతోపాటు సాధారణ భక్తులు సైతం పుష్కర స్నానాలు ఆచరించే విధంగా 100 మీటర్ల పుష్కరఘాట్ నిర్మించే దిశగా అధికారులు సర్వే చేస్తున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top