గ్రామం యూనిట్‌గా బీమా

గ్రామం యూనిట్‌గా బీమా


* రబీ సీజన్ నుంచే అమలు చేయనున్న ప్రభుత్వం

* జాతీయ పంటల బీమా పథకం పేరు మార్పు

* వరి మినహా ఇతర 9 రకాల పంటలకు మండలం యూనిట్



సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వరి సాగు చేస్తున్న రైతులకు ఊరట కలగనుంది. ఈ రబీ సీజన్ (2014-15)  నుంచి గ్రామం యూనిట్‌గా పంటల బీమాను అందించ నున్నారు. వరి పంటకు గ్రామం యూనిట్‌గా, మిగిలిన జొన్న (వర్షాధార), మొక్క జొన్న, పెసర, మినుము, శనగ, వేరుశనగ, పొద్దు తిరుగుడు, మిరప, ఉల్లి పంటలకు మండలం యూనిట్‌గా బీమా అందించనున్నారు. ఈ పథకంలో బ్యాంకుల నుంచి రుణాలు పొందిన రైతులకు, రుణాలు తీసుకోని రైతులకూ ప్రయోజనం చేకూర్చేలా జాతీయ పంటల బీమా కార్యక్రమం (ఎన్‌సిఐపి), లో మార్పులు చేర్పులు చేశారు. 



దీనికి సవరించిన జాతీయ వ్యవసాయ పంటల బీమా (ఎంఎన్‌ఎఐఎస్) పథకంగా పేరు మార్చారు. ఈ ఏడాది డిసెంబరు 31వ తేదీ వరకు రుణాలు పొందిన, పొందని రైతులు బీమా సౌకర్యం పొందడానికి అర్హులు. ఈ ఏడాది రబీ నుంచే అమలు చేయనున్న కొత్త పథకాన్ని  భారత వ్యవసాయ బీమా కంపెనీ (ఎఐసి) అమలు బాధ్యతలు చూస్తుంది. పంటల దిగుబడి, పంట కోత ప్రయోగాలు, సాధారణ పంటల అంచనా సర్వే ఆధారంగా కేంద్రం బీమా చెల్లింపులు చేస్తుంది.



బీమా వర్తించే పంటలనూ  గుర్తించారు. వరి, జొన్న (వర్షాధార) పంటలను తొమ్మిది జిల్లాల్లో, మొక్క జొన్న పంటను నిజామాబాద్, కరీంనగర్, మెదక్, ఖమ్మం, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల్లో, పెసర పంటకు ఆదిలాబాద్ , ఖమ్మం, మినుము పంటకు నల్లగొండ, ఖమ్మం జిల్లాలు, శనగ పంటకు మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాలు, వేరుశనగ పంటకు నిజామాబాద్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ, ఖమ్మం, కరీంనగర్, వరంగల్ జిల్లాలను, పొద్దు తిరుగుడు పంటకు నిజామాబాద్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ, ఖమ్మం, కరీంనగర్, వరంగల్ జిల్లాలు, మిర్చి పంటకు వరంగల్, ఖమ్మం, ఉల్లి పంటకు రంగారెడ్డి, మెదక్,  నిజామాబాద్ జిల్లాలను ఎంపిక చేశారు.



ఆయా జిల్లాల్లో పేర్కొన్న పంటలకే పంటల బీమా వర్తించనుంది. బీమా సౌకర్యం పొందడానికి కూడా అవకాశం కల్పించారు. పంటల వివరాలు, బీమా పొందడానికి అవసరమైన విధి విధానాలను ప్రకటిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు (జీవో ఆర్టీ నం:231)ను విడుదల చేసింది. ఈ ప్రకటనను రాష్ట్ర గెజిట్‌లో కూడా ప్రచురించనున్నారు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top