‘ఉపాధి’ అక్రమాలపై విజిలెన్స్ విచారణ


ఖమ్మం మయూరిసెంటర్: ఉపాధి హామీ పథకంలో అక్రమాలపై విజిలెన్స్ అధికారులు మంగళవారం వ్యక్తిగత విచారణ జరిపారు. కూసుమంచి, వీఆర్ పురం, సత్తుపల్లి మండలాల్లో ఉపాధి హామీ పథకంలో పనిచేసిన 71మంది 1,29,759 రూపాయలకు సంబంధించి అక్రమాలకు పాల్పడ్డట్టుగా సోషల్ ఆడిట్‌లో తేలడంతో జిల్లా విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు.



 కూసుమంచి మండలంలో నిర్వహించిన ఆరవ విడత సోషల్ ఆడిట్‌లో 33మంది రూ.70,907 వరకు అక్రమాలకు పాల్పడినట్టు తేలింది. వీరిలో ఒక ఏపీవో, దుగురు టెక్నికల్ అసిస్టెంట్లు, ఒక ఈసీ, ఇద్దరు కంప్యూటర్ ఆపరేటర్లు, 24మంది ఫీల్డ్ అసిస్టెంట్లు ఉన్నారు.



 సత్తుపల్లిలో ఏడో విడత సోషల్ ఆడిట్‌లో మొత్తం 12మంది రూ.11,416 వరకు అక్రమాలకు పాల్పడినట్టు తేలింది. వీరిలో ఒక ఏపీవో, ఒక ఈసీ, ఇద్దరు టెక్నికల్ అసిస్టెంట్లు, ఒక కంప్యూటర్ ఆపరేటర్, ఏడుగురు ఫీల్డ్ అసిస్టెంట్లు ఉన్నారు.



 వీఆర్ పురం మండలంలో ఆరవ విడత సోషల్ ఆడిట్‌లో 26మంది రూ.47,536 వరకు అక్రమాలకు పాల్పడినట్టు తేలింది. వీరిలో ఒక ఏపీవో, ఇద్దరు ఈసీలు, ముగ్గురు టెక్నికల్ అసిస్టెంట్లు, ఇద్దరు కంప్యూటర్ ఆపరేటర్లు, 18మంది ఫీల్డ్ అసిస్టెంట్లు ఉన్నారు. వీరిలో ఇద్దరు ఫీల్డ్ అసిస్టెంట్లను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. వీరిలో ఒకరు రూ.10,038, మరొకరు రూ.14,776 వరకు అవకతవకలకు పాల్పడినట్టు తేలింది.



 అక్రమాలకు పాల్పడిన వారిలో జిల్లాలో ఇప్పటివరకు 111మందిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. వీరిలో నలుగురు ఏపీవోలు, ఒక కంప్యూటర్ ఆపరేటర్, ఐదుగురు ఈసీలు, 51మంది ఫీల్డ్ అసిస్టెంట్లు, 12మంది టెక్నికల్ అసిస్టెంట్లు ఉన్నారు. మిగిలిన 39మంది నుంచి స్వాహా నిధులను తిరిగి వసూలు చేసి పోస్టింగ్ ఇచ్చారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top