'హైదరాబాద్‌ అంటే నాకు ఎంతో ఇష్టం'

'హైదరాబాద్‌ అంటే నాకు ఎంతో ఇష్టం' - Sakshi


హైదరాబాద్‌: తెలంగాణతో, హైదరాబాద్‌ నగరంతో తనకున్న అనుబంధాన్ని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు గుర్తుచేసుకున్నారు. రాజ్‌భవన్‌లో తనకు ఘనంగా పౌరసన్మానం నిర్వహించిన సందర్భంగా ఆయన ప్రసంగించారు. 'హైదరాబాద్‌ కేంద్రంగా చేసుకొని నేను రాజకీయాల్లో ఎదిగాను. హైదరాబాద్‌ నగరమన్నా, తెలంగాణ ప్రాంతమన్నా నాకు ఎంతో ఇష్టం. తెలంగాణలో నేను పర్యటించని తాలూకా, మండలం లేదంటే అతిశయోక్తి కాదు. అనేక పర్యాయాలు నేను పర్యటించాను. విభిన్న మతాలు, విభిన్న సంప్రదాయాలు, విభిన్న ప్రజల మేలు కలయిక తెలంగాణ. ఇది ఒక మినీ భారత్‌' అని వెంకయ్య అన్నారు.



తెలంగాణకు హైదరాబాద్‌ నగరమే బ్రాండ్‌ అని చెప్పారు. రాష్ట్రాలుగా విడిపోయినా తెలుగు ప్రజలంతా కలిసి ఉండాలని ఆయన ఆకాంక్షించారు. కలిసి కలహించుకోవడం కన్నా.. విడిపోయి సహకరించుకోవడం మిన్నా అని గతంలో తాను చేసిన వ్యాఖ్యలను గుర్తుచేశారు.



'మనమందరం తెలుగువాళ్లమే. తెలుగువాళ్లంతా కలిసి ఉండాలి. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉభయకుశలోపరిగా పనిచేయాలి. కొన్ని అభిప్రాయభేదాలు ఉన్నా.. వాటిని కూర్చోని సామరస్యంగా మాట్లాడుకొని పరిష్కరించుకోవాలి. ఇద్దరు సీఎంలు కలిసి ఉభయ తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కోసం కృషి చేయాలి' అని అన్నారు. ఈ సందర్భంగా దివంగత ప్రముఖ కవి సీ నారాయణరెడ్డిని వెంకయ్యనాయుడు స్మరించుకున్నారు. తెలుగు సంప్రదాయం, కట్టుబొట్టు, భాష, యాస, గోస గురించి సీనారే చెప్పిన పద్యాన్ని ఉటంకించారు. తెలుగు భాషకు ఇద్దరు ముఖ్యమంత్రులు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. అయితే, ఇంగ్లిష్‌ భాషకు తాను వ్యతిరేకం కాదని, తెలుగు భాషను కాపాడుకోవాల్సిన అవసరముందని గుర్తుచేశారు.


చదవండి: వెంకయ్యకు ఘనంగా పౌరసన్మానం

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top