పసిడి పరుగు పైపైకేనా..

పసిడి పరుగు పైపైకేనా.. - Sakshi


- తెలంగాణలో బంగారంపై భారీగా వ్యాట్ మోత!

- ఐదు శాతానికి పెంచాలని సర్కారు సూత్రప్రాయ నిర్ణయం

- సీఎం ఆమోదమే ఆలస్యం.. ప్రస్తుతం విధిస్తున్నది ఒక్క శాతమే

- పెంపుతో రూ. 500 కోట్లకు పెరగనున్న ఆదాయం

- గిరాకీ పక్క రాష్ట్రాలకు పోతుందని తెలంగాణ వ్యాపారుల్లో ఆందోళన


 

సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో సామాన్యులకు బంగారం మరింత ప్రియం కాబోతుంది. ఏ స్థాయి వారైనా పెళ్లిళ్లు, శుభకార్యాలకు తప్పనిసరిగా కొనుగోలు చేసే బంగారం, ఆభరణాలపై భారీగా పన్ను విధించాలని ప్రభుత్వం భావిస్తోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో బంగారంపై విలువ ఆధారిత పన్ను(వ్యాట్)ను ప్రస్తుతమున్న 1 శాతం నుంచి 5 శాతానికి పెంచాలని సర్కారు సూత్రప్రాయంగా నిర్ణయించింది. నిత్యావసర వస్తువులపైనా 5 శాతం పన్ను విధిస్తున్న నేపథ్యంలో ఖరీదైన బంగారు ఆభరణాలపై ఒక శాత మే పన్ను వేయడం చాలా తక్కువని, దాన్ని 5 శాతానికి పెంచితే సామాన్యులకు నష్టమేమీ ఉండదని ప్రభుత్వం భావిస్తోంది.

 

ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా బంగారంపై 5 శాతం వ్యాట్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని సర్కారు నిర్ణయించినట్లు అత్యున్నతవర్గాల సమాచారం. ఈ అంశంపై రెవెన్యూ, వాణిజ్య పన్నుల శాఖ అధికారులతో వాణిజ్య మంత్రి తలసాని ఇటీవలే సమావేశమై సుదీర్ఘంగా చర్చించినట్లు తెలిసింది. పన్ను పెంపు వల్ల వచ్చే ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకుంటూనే ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా బంగారం తరలిరాకుండా ఎలాంటి చర్యలు చేపట్టాలనే అంశంపై కూడా ఓ అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. బంగారంపై వ్యాట్ పెంపు ప్రతిపాదనపై ముఖ్యమంత్రితో చర్చించి తుది నిర్ణయం తీసుకోవడమే తరువాయి. దేశంలో మహారాష్ట్రలో మాత్రమే బంగారం, ఆభరణాలపై 1 శాతం ఉన్న వ్యాట్‌ను 1.10 శాతానికి పెంచుతూ అక్కడి ప్రభుత్వం రెండేళ్ల కిందట నిర్ణయం తీసుకుంది. ఒకవేళ రాష్ర్ట ప్రభుత్వం 5 శాతం పన్ను విధిస్తే బంగారంపై ఈ స్థాయిలో వ్యాట్ వసూలు చేసే ఏకైక రాష్ర్టంగా తెలంగాణ నిలుస్తుంది. అలాగే ఇప్పటికే పేదలు, దిగువ మధ్య తరగతికి అందని ద్రాక్షలా ఉన్న బంగారం ఇక ఎప్పటికీ అందకుండా పోతుంది.

 

ఆదాయం పెంచుకోవడమే లక్ష్యం

రాష్ట్రంలో బంగారం విక్రయాలకు హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాలు పెట్టింది పేరు. సీజన్, బులియన్ మార్కెట్ హెచ్చుతగ్గులతో సంబంధం లేకుండా రాజధానిలో నిత్యం కోట్ల విలువైన బంగారు ఆభరణాల విక్రయాలు సాగుతాయి. పెళ్లిళ్లు, శుభకార్యాలకు ప్రజలంతా ఇతర జిల్లాల నుంచి రాజధానికే వచ్చి బంగారం కొనుగోలు చేయడం పరిపాటి. హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని 10 జిల్లాల్లో బంగారం విక్రయాల మీద 1 శాతం వ్యాట్ రూపంలో నెలకు సరాసరి రూ. 7.50 కోట్లు వసూలవుతోంది. అంటే వాణిజ్య శాఖకు ఏటా రూ. 90 కోట్ల వరకు రెవెన్యూ వస్తోంది. బులియన్ మార్కెట్ హెచ్చుతగ్గుల వల్ల రెవెన్యూలో స్వల్ప తేడాలున్నా ఏటా వంద కోట్లను వాణిజ్య శాఖ లక్ష్యంగా పెట్టుకుంటుంది. ఈ నేపథ్యంలో బంగారంపై విలువ ఆధారిత పన్ను రేటును 5 శాతానికి పెంచితే ఏటా రూ. 500 కోట్ల రెవెన్యూ సాధించవచ్చని సర్కారు భావిస్తోంది. ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర హైదరాబాద్‌లో అటూఇటుగా రూ. 27 వేలు ఉంది. దీనికి వ్యాట్ రూపంలో రూ. 270 చెల్లించాల్సి ఉంటుంది. వ్యాట్‌ను 5 శాతానికి పెంచితే పన్ను చెల్లింపు రూ. 1,350కి పెరుగుతుంది. ఇలాగైతే రాష్ర్ట ప్రజలు బంగారం కొనుగోళ్ల కోసం పక్క రాష్ట్రాలకు వెళతారని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 

పక్కాగా పన్ను వసూళ్లకు రూ.5 కోట్లతో సాఫ్ట్‌వేర్

 సర్కారుకు ఆదాయాన్ని సమకూర్చే వాణిజ్య పన్నుల శాఖలోని లోపాలను సవరించి పన్ను వసూళ్లను పెంచుకునేందుకు సర్కారు కొత్త మార్గాలను కనిపెడుతోంది. ప్రధానంగా ప్రైవేటు ఆసుపత్రులు, రెస్టారెంట్లు, బట్టల దుకాణాలు వంటి వాటిపై దృష్టి పెట్టింది. వినియోగదారుల నుంచి వ్యాట్ పేరుతో వసూలు చేస్తున్న పన్నుకు, ఆయా సంస్థలు సర్కారుకు చెల్లిస్తున్న దానికి భారీ వ్యత్యాసం ఉం టోంది. ఈ నేపథ్యంలో 5 కోట్లతో ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను ప్రభుత్వం రూపొందించింది. ఈ సాఫ్ట్‌వేర్‌ను ఆసుపత్రులు, హోటళ్లు, బట్టల దుకాణాలు, ఇతరత్రా గుర్తించిన వ్యాపార కేంద్రాల్లో ఏర్పాటు చేయడం ద్వారా బిల్లింగ్ ప్రక్రియ పూర్తిగా వాణిజ్యపన్నుల శాఖ అధీనంలోకి వెళ్తుంది. తద్వారా వినియోగదారుడి నుంచి పన్ను వసూలు చేసి వాణిజ్య శాఖకు చెల్లించకుండా ఎగవేసే వారికి చెక్ పడనుంది.



 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top