మృత్యుంజయుడు వరుణ్

మృత్యుంజయుడు వరుణ్


హైదరాబాద్: మాసాయిపేట వద్ద స్కూలు బస్సును రైలు ఢీకొన్న ప్రమాదంలో గాయపడి సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థి వరుణ్‌గౌడ్(7) పూర్తిగా కోలుకోవడంతో వైద్యులు గురువారం డిశ్చార్జి చేశారు. ఈ ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చేరిన 18 మంది విద్యార్థులు పూర్తిగా కోలుకోగా గతంలోనే వైద్యులు వారిని ఇంటికి పంపారు. గురువారం ఆస్పత్రి మెడికల్ డెరైక్టర్ డాక్టర్ లింగయ్య చికిత్స వివరాలను వెల్లడించారు. దుర్ఘటనలో మృత్యువు అంచులదాకా వెళ్లి వరుణ్‌గౌడ్ బతికి బయటపడ్డాడు.



ప్రమాదంలో తల, ఛాతి, ఎడమ ఊపిరి తిత్తి కింది భాగంలోనూ తీవ్ర గాయాలయ్యాయి. దీంతో కోలుకోవడం చాలా కష్టమని వైద్యులు కూడా భావించారు. నాటి నుంచి 30 రోజుల పాటు వెంటిలేటర్‌పై ఉన్నాడు. వైద్యులు తల, ఊపిరితిత్తులకు శస్త్ర చికిత్సలు చేశారు. కాలుకు గాయం కావడంతో అక్కడా శస్త్ర చికిత్స చేశారు. ప్రస్తుతం వరుణ్‌గౌడ్ మాట్లాడుతున్నా ఇంటి పరిసరాలకు వెళితే అక్కడి వాతావరణానికి పూర్తిగా కోలుకుంటాడని వైద్యులు తెలిపారు.

 

ఒక బిడ్డను కోల్పోయి..

మరుణ్ తల్లిదండ్రులు మల్లాగౌడ్, లతలకు ముగ్గరు సంతానం. వీరిలో రుచితగౌడ్, వరుణ్‌గౌడ్, శృతి ఉన్నారు. ఒకే స్కూల్లో చదువుతున్న వీరిలో ప్రమాదం జరిగిన చోటే శృతి ప్రాణాలు కోల్పోగా.. రుచిత గౌడ్ కొద్ది రోజుల్లోనే కోలుకుంది. ఒక బిడ్డను కోల్పోయి ఇద్దరు బిడ్డలు ఆస్పత్రిలో చికిత్స పొందుతుంటే కన్నవారు తల్లడిల్లి పోయారు. ఎట్టకేలకు పూర్తి ఆరోగ్యంతో వరుణ్ బయటపడటంతో తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేవు.



వైద్యులు, ప్రభుత్వం కృషితోనే..

గతంలో డిశ్చార్జ్ అయిన సాయిరాం, రుచిత, నబీరా ఫాతిమా, కరుణాకర్, అభినందు, త్రిశ, శ్రావణిలు గురువారం పరీక్షలకు ఆస్పత్రి వచ్చారు. ఈ సందర్భంగా చిన్నారులతో పాటు వారి తల్లిదండ్రులు మాట్లాడుతూ వైద్యులు అందించిన సేవలు మరువలేనివన్నారు. అలాగే ప్రభుత్వం కూడా అన్ని విధాలా సహకరించిందని, తమ బిడ్డలు క్షేమంగా ఉన్నారని పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ చంద్రశేఖర్, డాక్టర్లు మురళీ మోహన్‌రెడ్డి, డాక్టర్ కార్తీక్, డాక్టర్ బీజే రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top