కేసీఆర్ గారూ... మా ఊరొస్తారా!

వర్టూరు గ్రామంలో దళితులతో కలసి భోజనం చేస్తున్న కేసీఆర్ (ఫైల్) - Sakshi


నల్లగొండ: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు రాకకోసం నల్లగొండ జిల్లాలోని ఓ గ్రామం ఆశగా ఎదురుచూస్తోంది. టీఆర్‌ఎస్ అధ్యక్షుడిగా తమ గ్రామంలో రాత్రి బస చేసిన కేసీఆర్ ఇప్పుడు సీఎం కావడంతో తాము గుర్తున్నామా? తమకు ఇచ్చిన హామీలు గుర్తున్నాయా? వాటి పరిష్కారానికి చొరవ తీసుకుంటా రా..? సీఎం తమ గ్రామానికి ఎప్పుడు వస్తారన్న సందేహాలతో వర్టూరు గ్రామ ప్రజలు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.



టీఆర్‌ఎస్ అధ్యక్షుడి హోదాలో కేసీఆర్ నల్లగొండలో వివిధ సమస్యలపై ఆందోళనల్లో నేరుగా పాల్గొన్నారు. నా గార్జునసాగర్ ఆయకట్టు రైతాంగం కోసం కోదాడ నుంచి నాగార్జునసాగర్ దాకా పాదయాత్ర చేశారు. ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాల్లో రెండురోజులపాటు పర్యటించారు. ఇదే తరహాలో ఆయన పల్లెప్రజల కష్టనష్టాలు తెలుసుకునేందుకు ‘పల్లెనిద్ర’ అనే కార్యక్రమానికి పిలుపు ఇచ్చి, యాదగిరిగుట్ట మండలం వర్టూరు గ్రామం నుంచి స్వయంగా ఆయనే  ఈ కార్యక్రమానికి శ్రీకా రం చుట్టారు.



పల్లెనిద్ర కార్యక్రమంలో భాగంగా 2008 ఏప్రిల్ 14వ తేదీన కేసీఆర్ వర్టూరు దళితకాలనీలోని ఆడెపు లక్ష్మయ్య ఇంట్లో రాత్రి నిద్రపోయారు. ఉదయాన్నే ఆ వాడలోని ఇంటింటికీ వెళ్లి వారి కష్టనష్టాలు అడిగి తె లుసుకున్నారు. అనేక వాగ్దానాలు చేశారు. అయితే, ఇవి వాస్తవరూపం దాల్చలేదు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ తమ గ్రామానికి వచ్చి సమస్యలు పరిష్కరిస్తారని గ్రామస్తులు ఆశగా ఎదురుచూస్తున్నారు.



 కేసీఆర్ నాడు ఇచ్చిన హామీలివే..

*  పార్టీ నిధులతో దళితవాడలోని సమస్యలు పరిష్కరిస్తాం.

*  దళితవాడలోని 89 కుటుంబాలకు ఇంటికో పాడిగేదె, రూ.5,116 నగదు అందజేస్తాం.

*  దళితవాడలో 400 గజాల స్థలంలో కమ్యూనిటీ హాలు నిర్మాణం.

*  కమ్యూనిటీ హాల్ కోసం పార్టీ తరపున రూ.2.50 లక్షలు మంజూరు.

*  ఎస్పీ కార్పొరేషన్ ద్వారా అవసరమైన మరిన్ని నిధులు ఇప్పిస్తాం.

*  గ్రామానికి సాగునీరు అందించే పడమటికుంటలోకి మోటకొండూరు చెరువు నుంచి మిగులు జలాలను రప్పించేందుకు సొంత డబ్బులతో ఫీడర్ చానల్ తవ్విస్తా.

 

ప్రత్యేక నిధులు ఇవ్వాలి

వర్టూర్ అభివృద్ధికి సీఎం కేసీఆర్ ప్రత్యేక నిధులు ఇవ్వాలి. గతంలో ఆయన ఇక్కడకు పల్లెనిద్ర చేసేందుకు వచ్చినప్పుడు అనేక హామీలు ఇచ్చారు. దళితుల అభివృద్ధికి  కృషి చేస్తామన్నారు. ఆయన అధికారంలోకి వచ్చివంద రోజులు పూర్తయ్యాయి. కానీ మా గ్రామ అభివృద్ధికి నిధులు ఇవ్వలేదు.    

 - మైసయ్య,గ్రామస్తుడు

 

ఉపాధి కల్పించాలి

కేసీఆర్ ఉద్యమ నాయకుడిగా మా గ్రామానికి రావడం ఆనందం కలిగించింది. ఆయన మా సమస్యలను తెలుసుకున్నారు. పార్టీ తరపున కొన్ని, ప్రభుత్వం తరపున కొన్ని సమస్యలు తీరుస్తానని హామీ ఇచ్చారు. ఆయన సీఎం అయ్యారు. మా గ్రామంలో ఏదైనా పరిశ్రమ పెట్టి,  ఉపాధి కల్పించాలి.

 - భిక్షపతి, గ్రామస్తుడు

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top