కేసీఆర్ తీరు అప్రజాస్వామికం

కేసీఆర్ తీరు అప్రజాస్వామికం - Sakshi


  సాక్షి, హైదరాబాద్: రాష్ర్టంలో అన్ని వర్గాల వారు స్వేచ్ఛగా ఉండొచ్చని చెప్పిన సీఎం కేసీఆర్.. ఇప్పుడు తమ సభకు అనుమతించకపోవడమే కాకుండా పలువురిని గృహనిర్బంధం చేయడమేంటని విప్లవ రచయిత వరవరరావు ప్రశ్నించారు. బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కవులు, రచయితలు, మేధావులు ఆదివారం నాడు నిర్వహించాలనుకున్న ‘ప్రత్నామ్నాయ రాజకీయ వేదిక’ సదస్సుకు పోలీసులు అనుమతించకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. ఈ సమావేశం నేపథ్యంలో పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. రాత్రి 8 గంటల ప్రాంతంలో వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. అనంతరం వరవరరావు మీడియాతో మాట్లాడారు. నిజానికి హాళ్లలో నిర్వహించే సభలు, సదస్సులకు పోలీసుల అనుమతి అవసరం లేదనే ఉద్దేశంతో ముందస్తు అనుమతి కోసం దరఖాస్తు చేసుకోలేదని తెలిపారు.



ఈ సదస్సులో చర్చించే అంశాలు కూడా నిషేధం పరిధిలోకి రావని, చట్టవ్యతిరేకం అంతకన్నా కావని ఆయన అన్నారు. ఏదో ఘోరం జరిగిపోతోందన్న రీతిలో పోలీసులు తీవ్రంగా స్పందించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రొఫెసర్ హరగోపాల్ వంటి మేధావిని కూడా గృహ నిర్బంధం చేయడం అత్యంత హేయమైన చర్యగా పేర్కొంటూ నిరసన వ్యక్తం చేశారు. ఎలాంటి అడ్డంకులు, ఆంక్షలు లేని బంగారు తెలంగాణను నిర్మిస్తానని చెప్పిన సీఎం కేసీఆర్.. తమ కార్యక్రమాన్ని అప్రజాస్వామికంగా అడ్డుకోవడం శోచనీయమన్నారు. నక్సలైట్ల సిద్ధాంతమే తన సిద్ధాంతమని చెప్పిన ఎన్టీఆర్.. అప్పట్లో అధికారంలోకి వచ్చాక తన నిజ స్వరూపాన్ని బయపెట్టిన తీరుగానే ఇప్పుడు కేసీఆర్ కూడా వ్యవహరిస్తున్నారని వరవరరావు విమర్శించారు. మావోయిస్టు ఎజెండా తన ఎజెండా ఒక్కటేనని చెప్పిన కేసీఆర్ అధికారంలోకి రాగానే ఎన్టీఆర్ బాటలో నడుస్తున్నారని ధ్వజమెత్తారు.


సీఎం కేసీఆర్ అభద్రతలో ఉన్నారు

 

 సాక్షి,న్యూఢిల్లీ: పౌరహక్కుల సమావేశాలను అడ్డుకోవడం, మీడియాను నియంత్రించడం చూస్తుంటే తెలంగాణ సీఎం కేసీఆర్ అభద్రతా భావంలో ఉన్నట్టు అనిపిస్తోందని సీపీఐ నేత నారాయణ ఆదివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ అన్నారు. ఢిల్లీలో జరిగిన సీపీఐ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు ఆయన ఇక్కడకు వచ్చారు. ‘హైదరాబాద్‌లో విరసం సభలు, ప్రదర్శనలు అనుమతించకపోవడం, చివరికి హాల్ మీటింగ్‌ను ఆటంక పరుస్తున్నారు. ఇది అన్యాయం. నియంతృత్వ పోకడలకు ప్రభుత్వం ఎందుకు పోతుందో అర్థం కావడం లేదు. పౌరహక్కులు, స్వేచ్ఛ కోసం పెట్టుకున్న సభ. పౌరులు శాంతియుతంగా సమావేశమయ్యేందుకు రాజ్యాంగం అవకాశమిచ్చింది.పెపైచ్చు టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇలా చేయడం ఆశ్చర్యం’ అని అన్నారు. టీఆర్‌ఎస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అన్ని వామపక్షాలు ఉద్యమాన్ని బలపర్చాయి. ‘వరవరరావు వంటి వారిని అరెస్టు చేయడంద్వారా టీఆర్‌ఎస్ ప్రభుత్వం మలిన పడుతుంది’. అని   అన్నారు.


వారి అరెస్టులు అసమంజసం

 

 విరసం నేతలు వరవరరావు, కళ్యాణరావుల అరెస్టు తగదని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర మహాసభ  ఒంగోలులో తీవ్రంగా ఖండించింది.ఉద్యమాల తీరును సమీక్షించేందుకే హైదరాబాదులో సదస్సు నిర్వహించుకునేందుకు నేతలు యత్నిస్తుంటే అరెస్టులేమిటని ప్రశ్నించింది. ఆ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న కళ్యాణరావును మార్గమధ్యంలోనే అరెస్టుచేయడం, వేదిక కన్వీనర్ వరవరరావును ఇంటి వద్దే నిర్బంధించడం దారుణమని సీ.హెచ్.జాలన్న ఒక ప్రకటనలో అన్నారు.



 దాడులు  అసమంజసం



 తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి నగరం పోలీసుల దిగ్భంధంలో ఉందని, నగరం ఎమర్జెన్సీని తలపిస్తుందని పౌరహక్కుల సంఘం ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ జి. లక్ష్మణ్ అన్నారు. ఆదివారం హైదర్‌గూడ ఎన్‌ఎస్‌ఎస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.


హక్కులను హరించడమే..

 

 హైదరాబాద్‌లో ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక ఆధ్వర్యంలో జరుపతలపెట్టిన సభను,ర్యాలీని పోలీసులు అనుతించకుండా ఆ నేతలను అరెస్టు చేయడంపై ప్రజాసంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ప్రభుత్వ తీరును నిరసించాయి

 

 అణచివేత తగదు : సీపీఐ

 

 కొత్త ప్రభుత్వం పౌర హక్కులను కాపాడుతుందనే నమ్మకం వమ్మయిందని తెలంగాణ సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విమర్శించారు. ఉద్యమపార్టీగా అధికారంలోకి వచ్చి గత పాలకుల మాదిరిగానే హక్కుల అణచివేతనే లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఉందని పేర్కొన్నారు.

 

 నియుంతృత్వ చర్య : సీపీఎం

 

 ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక నాయకులు, కార్యకర్తలను అరెస్ట్ చేయడం, వారి సభలు, ప్రదర్శనలను రద్దుచేయడం రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక, నిరంకుశ ధోరణిని తెలియజే స్తున్నదనిస్తోందని తెలంగాణ సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు.

 

 అప్రజాస్వామికం : పొన్నాల

 

 విరసం నేత వరవరరావు అరెస్టు ప్రజాస్వామ్యానికి చేటు అని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యవాదులంతా కేసీఆర్ వైఖరిపై ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు పొన్నాల ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు.

 

 వేదికను అడ్డుకోవడం తగదు : రావుకృష్ణ

 

 తెలంగాణలో ప్రభుత్వ వైఖరి ప్రజాస్వామ్య హక్కులను కాలరాసే విధంగా ఉందని సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. ప్రజాస్వామ్యయుతంగా తలపెట్టిన ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక సభను పోలీసులు అడ్డుకోవడాన్ని ఆదివారం ఆయున ఒక ప్రకటనలో ఖండించారు.  

 

 సీమాంధ్ర పాలకుల్లా సీఎం

 

 విరసం సభ్యులు వరవరరావు, మరికొందరిని  అరెస్టు చేయడాన్ని ఓయూ విద్యార్థులు ఖండించారు. టీవీవీ రాష్ట్ర అధ్యక్షుడు డి.విజయ్, టీవీఎస్ అధ్యక్షుడు కోట శ్రీనివాస్‌గౌడ్, డీఎస్‌యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అరుణాంక్ మాట్లాడుతూ  సదస్సును అడ్డుకోవడం అప్రజాస్వామ్యమన్నారు.

 

 గొంతు నొక్కే ప్రయత్నం: ఏఐఎస్‌ఎఫ్

 

 ప్రజా హక్కులను కాలరాయడం సరికాదని ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు స్టాలిన్, ప్రధాన కార్యదర్శి శివరామకృష్ణ  ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ పాలన ప్రజలకు భావప్రకటన స్వేచ్ఛ లేకుండా గొంతు నొక్కేలా ఉందని విమర్శించారు.



 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top