తపోభూమికి తళుకులు


మెదక్: మెతుకు సీమకే మణిహారం ఏడుపాయల. దేశంలోని రెండే రెండు వనదుర్గ క్షేత్రాల్లో ఒకటి. కాశ్మీర్‌లోని వనదుర్గ ఆలయం మూతపడగా, ఏడుపాయల్లోని వనదుర్గాదేవి క్షేత్రం భక్తుల కొంగుబంగారంగా విరాజిల్లుతోంది. ఇంతటి ప్రాముఖ్యం కల్గిన ఏడుపాయల క్షేత్రాన్ని అభివృద్ధి చేసేందుకు తెలంగాణ సర్కార్ ఇటీవల బడ్జెట్‌లో నిధులను సైతం కేటాయించింది.



ఈమేరకు ఈనెల 19న డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు రమణాచారి, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జా, ఏడుపాయల చైర్మన్ ప్రభాకర్‌రెడ్డిలు వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఏడుపాయలను ఆధ్యాత్మిక క్షేత్రంగా...యాగాజ్ఞి కేద్రంగా,...పర్యాటక నిలయంగా మార్చేందుకు మాస్టర్‌ప్లాన్ రూపొందించాలని నిర్ణయించారు.



 హరితవనం...పుణ్యక్షేత్రం

 50 ఎకరాల్లో ఉన్న ఏడుపాయలను వంద ఎకరాల మేర విస్తరించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ప్రతి సంవత్సరం శివరాత్రి సందర్భంగా జరిగే జాతరకు సుమారు 10 లక్షల మంది భక్తులు వస్తుండడంతో ఏడుపాయల విస్తీర్ణాన్ని పెంచాలని భావిస్తున్నారు. అందువల్లే క్షేత్రం సమీప ప్రాంతాల్లోని భూములు అటవీశాఖ పరిధిలో ఉండడంతో వారి నుంచిఅనుమతి తీసుకునేందుకు నిర్ణయించారు.  



 స్నాన ఘట్టాలతో మృత్యుఘోషకు చెక్

 మంజీరాపాయల్లో స్నాన ఘట్టాలు లేక ఐదేళ్లలో ఇప్పటి వరకు సుమారు 56 మంది భక్తులు నీటమునిగి దుర్మరణం చెందారు. దీంతో దుర్గమ్మ ఆలయం నుంచి ఘనపురం ఆనకట్ట వరకు మంజీరపాయకు ఇరుపక్కలా మెట్లు నిర్మించి నీటిలోపల స్నానం చేసేందుకు వీలుగా మెష్ ఏర్పాటు చేసే ఆలోచన చేస్తున్నారు.



 అద్దాలు మేడలు... అందాల ఆశయాలు

 ఏడుపాయలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం బహుళ అంతస్తుల మేడలు నిర్మించేందుకు తీర్మానించారు. అధునాతనంగా నిర్మించే గదుల్లో అన్ని సౌకర్యాలు కల్పించనున్నారు. ఇప్పటికే ఇక్కడ నిర్మిస్తున్న హరిత హోటల్ దాదాపు పూర్తికావొచ్చింది. ప్రసుత్తం ఏడుపాయల్లో 42 సత్రాలు ఉండగా, అన్నీ దాతల ఔదార్యంతో నిర్మించినవే. యజమానులు వస్తే ఇక్కడికి వచ్చే భక్తులకు కనీసం తలదాచుకునేందుకు నీడలేక చెట్ల నీడన, బండరాళ్ల మాటున పడిగాపులు కాస్తుంటారు.



 కళకళలాడే రోడ్లు...  అడుగడుగున మరుగుదొడ్లు

 ప్రస్తుతం ఏడుపాయల్లో ఉన్న మట్టిరోడ్లతో యాత్రికులు, వాహనదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాకాలం వచ్చిందంటే వాహనాలు ముందుకు కదలని పరిస్థితి. దీంతో ఏడుపాయల్లోని రోడ్లన్నీ సీసీ రోడ్లుగా మార్చి రోడ్డుపక్కల డ్రైన్లు ఏర్పాటు చేస్తారు. అలాగే అవసరమైన టాయిలెట్లు, మరుగుదొడ్లు నిర్మించనున్నారు.



 నిత్యపూజలు... యాగశాలలు

 ఏడుపాయల్లో అనునిత్యం శాస్త్రోత్తయుక్తమైన పూజలు నిర్వహించేందుకు అదనంగా ఆగమ పండితులను నియమించనున్నారు. దీంతో క్షేత్రంలో అనునిత్యం వేద పూజలు జరుగనున్నాయి. ఏడుపాయల్లో జనమే జయుడు సర్పయాగం నిర్వహించినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ కొత్తగా యాగశాలలను ఏర్పాటు చేయనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చండీయాగం నిర్వహించేందుకు కూడా ఇక్కడే ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది.



 ఘనపురం గలలు... మంజీరా పరవళ్లు

 పరవళ్లు తొక్కే మంజీరమ్మకు నిలకడ నేర్పింది ఘనపురం ప్రాజెక్ట్. 0.2 టీఎంసీ నీటి సామర్థ్యం గల ఈ ప్రాజెక్ట్ వర్షాకాలంలో కళకళలాడుతుంది. ఎగిసిపడే చేప పిల్లలు...పొంగిపొర్లే ఘనపురం..పాల నురగలాంటి నీళ్లు...పర్యాటకులను కట్టిపడేస్తాయి. ఆనకట్ట చుట్టూరా రంగు రంగుల విద్యుత్ దీపాలు ఏర్పాటుచేసి బోటింగ్ సౌకర్యం కల్పించేందుకు అధికారులు ప్రణాళిక రచిస్తున్నారు.



 శిల్పారామ సృష్టికర్త... ఏడుపాయల వ్యూహకర్త

 గ్రామీణ వాతావరణానికి అద్దంపట్టేలా, పల్లె సంస్క ృతిని ప్రతిబింబించేలా శిల్పారామాన్ని సృష్టించిన కిషన్‌రావుకు ఏడుపాయల మాస్టర్ ప్లాన్‌ను రూపొందించే బాధ్యతలు అప్పగించారు. జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జా ఈ ప్రణాళికను నిరంతరం పర్యవేక్షిస్తుంటారు. ఇందుకు అవసరమైన నిధులను కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి ప్రకటించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top