అమ్మో... నల్లగొండ

అమ్మో... నల్లగొండ - Sakshi


ఈ ఒత్తిడి నేను భరించలేను  

* సెలవుపై మునిసిపల్ కమిషనర్

* మరోసారి ఇన్‌చార్జ్ పాలన

* సిమ్‌తో సహా ఇచ్చి వెళ్లిపోయిన వేణుగోపాల్‌రెడ్డి


నల్లగొండ టూటౌన్ : రాష్ట్రంలో ఒక పార్టీది అధికారం ... మునిసిపాలిటీలో మరోపార్టీ వారిది అధికారం ... కరవమంటే కప్పకు కోపం..విడవమంటే పాముకు కోపం..అధికారం మాదే  మేము చెప్పిందే వినాలని ఒకరు.. మునిసిపాలిటీలో అధికారం మాది మేము ఏది చెప్పితే అదే ఫైనల్ చేయాలంటూ మరొకరు... ఇలా  ఇరుపార్టీల నేతలు చేస్తున్న ఒత్తిళ్లకు ఇప్పుడు అధికారులు బెంబేలెత్తిపోతున్నారు.



‘‘ఈ ఒత్తిడి తట్టుకోలేను బాబు ఇక్కడ పనిచేస్తే లేని పోని రోగాలు వస్తాయి... ఇక ఇక్కడ నేను పని చేయలేను’’ అని నల్లగొండ మునిసిపల్ కమిషనర్ జి.వేణుగోపాల్‌రెడ్డి సెలవులో వెళ్లిపోయారు. కలెక్టర్ తొలుత అనుమతించకపోయినా, తన ఆవేదనను అర్థం చేసుకోమని చెప్పి తన ఫోన్ సిమ్‌కార్డు మరీ ఇచ్చేసి 15 రోజులు సెలవుపై వెళ్లిపోయారాయన. ఆయన సెలవు పెట్టేందుకు అధికార పార్టీ నేతల ఒత్తిడే కారణమని ప్రచారం జరుగుతోంది. ఇటీవల కొంత మంది కౌన్సిలర్లు చిన్నచిన్న విషయాలకు కూడా కమి షనర్‌తో ఘర్షణకు దిగుతుండడంతో ఆయన ఇక్కడి నుంచి వెళ్లి పోవడానికే నిర్ణయించుకున్నుట్లు తెలుస్తోంది.

 

మునిసిపల్ లీజు షాపుల వేలం ఆపడానికేనా ...?

మునిసిపాలిటీకి చెందిన 238 దుకాణాలు, స్థలాలను బహిరంగవేలం ద్వారా లీజుకు ఇచ్చేందుకు గత నెలలో జరిగిన మునిసిపల్ కౌన్సిల్ సమావేశంలో ఆమోదం కోసం పెట్టారు. కాగా దీనిని ఆపడానికి తెర వెనుక కొంతమంది నాయకులు తీవ్రంగానే ప్రయత్నించినా,  కమిషనర్ హైకోర్టు ఆదేశాలను కచ్చితంగా అమలు చేయాలని ఎవరి ఒత్తిళ్లకు లొంగలేదని అప్పట్లోనే చర్చించుకున్నారు. ఈ నెలాఖరులోగా ఎలాగైనా ఆ స్థలాలు, దుకాణాలను వేలం వేయడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. కమిషనర్ ఇక్కడి నుంచి పోతేనే తమకు నచ్చిన అధికారిని పెట్టుకొని పనులు చక్కబెట్టుకోవచ్చనే ప్రయత్నాలు చేసినట్లు తెలిసింది.

 

ముక్కుసూటిగా వెళ్లడమే...

వేణుగోపాల్‌రెడ్డి ప్రభుత్వ నిబంధనలను కచ్చితంగా అమలు చేయడం కూడా కొంతమంది నేతలకు రుచించడంలేదని సమాచారం. తాము చెప్పింది చేయాలి కానీ నిబంధనలు తమకెందుకు అనేరీతిలో కొంతమంది మాట్లాడిన తీరుపై కమిషనర్ తీవ్ర మనోవేదనకు గురైనట్లు తెలిసింది. ఎవరు ఏ పని చేయమన్నా,  తానుమాత్రం ప్రభుత్వ నిబంధనల ప్రకారమే చేస్తాను అని ఖరాఖండిగా చెప్పి ముక్కుసూటిగా వ్యవహరించిన తీరు కూడా ఇరుపార్టీల నాయకులకు నచ్చలేదని సమాచారం.



ఆసరా పింఛన్ల జాభితాపై కూడా కాంగ్రెస్ నాయకులు కమిషనర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను నిక్కచ్చిగా వ్యవహరించి అర్హులైన వారికి పింఛన్లు ఇస్తున్నా, తనపైనే ఏ అధికారం లేని వ్యక్తి పెత్తనం చెలాయించడం ఏంటని ఉన్నతాధికారుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. అదేవిధంగా కార్యాలయంలో ఇటీవల అధికారుల సెక్షన్ల మార్పు కూడా కమిషనర్ సెలవు పెట్టడానికి కారణమైనట్లు తెలుస్తుంది. అధికారులను పనిచేయించుకోవాల్సిన తాను చెప్పిన విధంగా కాకుండా దానిని కూడా రాజకీయం చేయాలని చూడడం ఆయనకు నచ్చలేదు. దీంతో ఆయన వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు.



మరోసారి ఇన్‌చార్జ్ పాలన...

నల్లగొండ మునిసిపాలిటీలో విధులు నిర్వహించాలంటేనే అధికారులు, ఉద్యోగులు హడలిపోయే పరిస్థితి వ చ్చింది. గతంలో దాదాపు మూడు సంవత్సరాల పాటు ఇన్‌చార్జ్ పాలన కొనసాగింది. ప్రత్యేకాధికారి పాలన ఉన్న రోజులలో పట్టణ ప్రజలు చిన్న పనులకు కూడా అనేక అవస్థలు పడ్డారు. మళ్లీ  మరోసారి ఇన్‌చార్జ్ పాలనకు దారితీసింది. మునిసిపల్ ఈఈగా పనిచేస్తున్న రాజయ్యకు (ఎఫ్‌ఏసీ ) అదనపు పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగిస్తూ డీఎంఏ కార్యాలయం నుంచి శుక్రవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. మరి ఈయన ఎలా నెట్టుకొస్తారో, ఈయన పట్ల అధికార పార్టీ నేతలు ఎలా వ్యవహరిస్తారోననే చర్చ మునిసిపల్ వర్గాల్లో జరుగుతోంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top