నేరెళ్ల ఘటనపై మౌనమెందుకు?

నేరెళ్ల ఘటనపై మౌనమెందుకు? - Sakshi


సీఎం కేసీఆర్‌కు ఉత్తమ్‌ బహిరంగలేఖ

సాక్షి, హైదరాబాద్‌: సిరిసిల్ల జిల్లా నేరెళ్ల ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతున్నా సీఎం కేసీఆర్‌ ఎందుకు మౌనంగా ఉన్నారని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రశ్నించారు. దీనిపై కేసీఆర్‌కు ఆయన ఆదివారం బహిరంగ లేఖ రాశారు. సిరిసిల్లలో ఇసుక మాఫియా ఆగడాలను ప్రశ్నించిన దళితుల పట్ల పోలీసులు అమానవీయంగా, క్రూరంగా ప్రవర్తించారని, నాలుగు రోజులపాటు చిత్రహింసలకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు.


పోలీసుల అకృత్యాలు బయటకు రావడానికి కారణమైన బాధిత కుటుంబాల మహిళలపై వ్యభిచార కేసులు పెడతామని పోలీసులు, జిల్లా ఎస్పీ బెదిరించారని ఉత్తమ్‌ ఆరోపించారు. ఖమ్మంలో రైతుల చేతులకు బేడీలు వేయడం, సిరిసిల్లలో దళితులపై దాడులు చేయడం, మహిళలపై వ్యభిచార కేసులు పెడతామని బెదిరించడం ఇదేనా బంగారు తెలంగాణ అని ప్రశ్నించారు. సిరిసిల్లలో దళితులను పోలీసులు నాలుగు రోజులపాటు ఉంచి కోర్టులో ప్రవేశపెట్టారని, ఇలాంటి చిత్రహింసలు చేయడానికి కారణాలేమిటో చెప్పాలన్నారు.


స్వయంగా జిల్లా ఎస్పీ దీనిని పర్యవేక్షించడానికి స్థానిక ఎమ్మెల్యే, మంత్రి కేటీఆర్‌ ఆదేశాలే కారణమా అని నిలదీశారు. ఇసుక మాఫియాను రక్షించడానికి ఎందుకు చట్టాన్ని, రాజ్యాంగాన్ని ఉల్లంఘించారో, ఇసుక మాఫియా వెనుక ఎవరున్నారో తేల్చాలని డిమాండ్‌ చేశారు. ఈ సంఘటన వెనుక టీఆర్‌ఎస్‌లోని ముఖ్యులు, సీఎం కేసీఆర్‌ బంధువులు ఉన్నారని ప్రచారం జరుగుతున్నా ఎందుకు స్పందించడంలేదో చెప్పాలన్నారు. ప్రపంచంలోని అన్ని విషయాలను ట్వీటర్‌లో ప్రస్తావిస్తున్న  కేటీఆర్‌కు సొంత నియోజకవర్గంలో జరిగిన ఈ దారుణ ఘటన కనిపించడంలేదా అని ప్రశ్నించారు. సమస్యను, దారుణ పరిస్థితులను చూడటానికి, కనీసం ట్వీటర్‌లో స్పందించడానికి కేటీఆర్‌కు సమయం లేదా అని, కేటీఆర్‌ మౌనంలో అసలు రహస్యం ఏమిటో తేల్చాలని డిమాండ్‌ చేశారు.



నేడు టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశం

నేరెళ్ల ఘటనతోపాటు పార్టీలోని అంతర్గత అంశాలపై చర్చించడానికి సోమవారం టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. పార్టీ కార్యాచరణ, టీఆర్‌ఎస్‌ వైఫల్యాలపై పోరాటం, సంస్థాగత అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top