రాష్ట్రానికి శాపం.. టీఆర్‌ఎస్‌ పాలన

రాష్ట్రానికి శాపం.. టీఆర్‌ఎస్‌ పాలన - Sakshi


గండ్ర దీక్షలో ఉత్తమ్‌ ధ్వజం



సాక్షి, భూపాలపల్లి: టీఆర్‌ఎస్‌ అధికారం లోకి రావడం, సీఎం కేసీఆర్‌ పదవి చేపట్టడం రాష్ట్రానికి శాపంగా మారిందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. మిర్చికి మద్దతు ధర కల్పించాలంటూ జయశంకర్‌ జిల్లా భూపాలపల్లిలో పీసీసీ అధికార ప్రతినిధి గండ్ర వెంకటరమణా రెడ్డి మూడురోజులుగా చేస్తున్న దీక్షను ఉత్తమ్‌ శనివారం విరమింపజేవారు. ఉత్తమ్‌ మాట్లాడుతూ దేశంలో అత్యధికం గా రైతులు తెలంగాణలోనే ఆత్మహత్యలు చేసుకుంటున్నారని పార్లమెంటు నివేదిక తేల్చిందన్నారు.



తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు వ్యవసాయ రంగం నిర్లక్ష్యానికి గురైందని, పంటలకు గిట్టు బాటు ధర లేక ఇబ్బందులు పడుతున్న రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెప్పారు. అయినా, రైతులతో మాట్లాడం, మార్కెట్‌లను సందర్శించడం వంటివి కేసీఆర్‌ చేయలేదన్నారు. రైతులను ఆదుకునేందుకు కేంద్రం ప్రకటించిన మద్దతు ధరకు కర్ణాటక, ఏపీలు అదనంగా బోనస్‌లు ప్రకటించాయి. ధనిక రాష్ట్రమని చెప్పే తెలంగాణ సీఎం ఎందుకు బోనస్‌ ప్రకటించడం లేదని ప్రశ్నించారు. నాఫెడ్, మార్క్‌ఫెడ్‌ల ద్వారా మిర్చి కొనుగోలు చేసే అవకాశం ఉన్నా, ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఖమ్మంలో రైతు లకు బేడీలు వేసినందుకు ప్రభుత్వం క్షమాపణ చెప్పాలన్నారు.



రెండు లక్షల రుణమాఫీ...

రాబోయే 2019 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే ఒకేసారి రూ.2లక్షల వరకు రుణమాఫీ చేసి రైతులను ఆదుకుంటామని ఉత్తమ్‌ ప్రకటించారు. వివిధ పంటలకు కేంద్రం ప్రకటించే మద్దతు ధరకు తోడుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి బోనస్‌ ప్రకటిస్తామన్నారు. వీటితో పాటు నిరుద్యోగ యువతకు నెలకు రూ.3,000 నిరుద్యోగ భృతి, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు అదనంగా మరో గది మంజూరు చేస్తామన్నారు.



గండ్ర మాట్లాడుతూ రాష్ట్రంలో రైతులు సంఘటితంగా పోరాడే పరిస్థితులు లేనందున వారి తరఫున కాంగ్రెస్‌ పార్టీ పోరాడుతోంద న్నారు. కాగా, గండ్ర ఆరో గ్యం క్షీణిం చడంతో శుక్రవారం అర్ధరాత్రి పోలీసులు ఆయనను బలవంతంగా అరెస్టు చేసి సింగరేణి ఆస్పత్రికి తరలిం చారు. అక్కడ సెలైన్లు పెట్టుకునేందుకు గండ్ర నిరాకరిం చి శనివారం మధ్యాహ్నం వరకు ఆస్ప త్రిలో దీక్ష కొనసాగించారు. రాజ్యసభ సభ్యుడు ఆనందభాస్కర్, ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, కేంద్ర మాజీ మంత్రి బల రామ్‌నాయక్, మాజీ మంత్రి శ్రీధర్‌బాబు దీక్షకు సంఘీభావం తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top