యూరియా.. మాఫియా

యూరియా.. మాఫియా - Sakshi


సాక్షి ప్రతినిధి, వరంగల్ : వ్యవసాయ సాగు అంతంతమాత్రంగా ఉన్న సీజన్‌లోనూ రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. జిల్లాలో ఖరీఫ్ సాధారణ సాగు విస్తీర్ణం 5.03 లక్షల హెక్టార్లు కాగా... సకాలంలో వర్షాలు కురవకపోవడంతో 4.08 లక్షల హెక్టార్లలోనే పంటలు సాగయ్యాయి. వ్యవసాయ శాఖ అంచనాలతో పోల్చితే... సాగు విస్తీర్ణం లక్ష హెక్టార్లు తగ్గిందన్న మాట. ఇలాంటప్పుడు రైతులకు ఎరువులు అందుబాటులో ఉండడం సహజం. కానీ... జిల్లాలో ఇందుకు విరుద్ధంగా జరుగుతోంది.

 

పంటల సాగు తగ్గినా.... రైతులకు అదనులో యూరియా దొరకడంలేదు. మూడు వారాలుగా వరుణుడు కరుణిస్తున్నాడు. వేసిన పంటలు ఎండిపోకుండా వర్షాలు కురుస్తున్నాయి. పంట కీలక దశలో కురుస్తున్న వర్షాలు కావడంతో యూరియా వేసి పంటలను కాపాడుకోవాలని రైతులు చూస్తున్నారు. వ్యవసాయ శాఖ అవినీతి, ఎరువుల వ్యాపారుల దోపిడీతో రైతులకు యూరియా అందని పరిస్థితి నెలకొంది. రైతుల అవసరాలను ఆసరగా చేసుకుని వ్యాపారులు ఒక్కో బస్తాపై రూ.50 నుంచి రూ.100 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు.

 

దీన్ని నివారించి రైతులకు అండగా నిలవాల్సిన వ్యవసాయ శాఖ అధికారులు వ్యాపారులకే వత్తాసు పలుకుతున్నారు. మొత్తంగా రైతు భారీగా దోపీడీకి గురవుతున్నాడు. కంపెనీలు అధికారికంగా ప్రకటించిన ధరల ప్రకారం సాధారణ యూరి యా బస్తాకు రూ.284 ఉంది. వేపనూనె కోటింగ్‌తో ఉండే ప్రత్యేకమైన యూరియా బస్తా రూ.298 పలుకుతోంది. వ్యవసాయ శాఖ అధికారుల మద్దతు తో వ్యాపారులు ఒక్కో యూరియా బస్తాను రూ.340పైనే విక్రయిస్తూ రైతులను దోచుకుంటున్నారు. వ్యవసాయ అధికారుల సహకారం ఎక్కువగా ఉన్న మండలాల్లో యూరియా బస్తా ధర రూ.360 వరకు ఉంటోంది.

 

ఇదేమని ఎవరైనా అడిగితే... ఎవరికి చెప్పుకుంటా వో చెప్పుకో అని వ్యాపారులు వారిని బెదిరిస్తున్నారు. దోపిడీని భరించలేని కొందరు రైతులు ధైర్యం చేసి వ్యవసాయ శాఖ అధికారులకు ఫిర్యాదు చేస్తే... వారు సదరు రైతు వివరాలను వ్యాపారులకు అందజేస్తున్నారు. దీంతో వ్యాపారులు ఆ రైతులకు ఎరువులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు. అదనులో యూరియా అవసరం కావడంతో రైతులు తప్పనిసరి పరిస్థితుల్లో ఎక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. అధిక ధరలకు సంబంధించిన డబ్బులను పలువురు వ్యాపారులు, వ్యవసాయ శాఖ అధికారులు వాటాలుగా పంచుకుంటున్నారు.



వ్యవసాయ శాఖపై విమర్శలు

కంపెనీల నుంచి వచ్చే యూరియాకు సంబంధించి డీలర్లకు కేటాయింపు, సరఫరా, రవాణా... ఇలా అన్నింట్లోనూ వ్యవసాయ శాఖ అధికారుల అవినీతి వల్ల జిల్లాలో రైతులకు సమస్యలు పెరిగిపోతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రైవేట్ వ్యాపారులు, సహకార సంఘాలు కలిపి జిల్లాలో 920 మంది ఎరువుల డీలర్లు ఉన్నారు. సహకార సంఘాలకు ప్రాధాన్యం ఇస్తూ ఎరువుల విక్రయ కేటాయింపులు జరపాల్సిన వ్యవసాయ శాఖకు ఇదేమీ పట్టడం లేదు. జిల్లాలో ఎరువుల కేటాయింపు పూర్తిగా అక్రమాలమయంగా మారిందని డీలర్లే ఆరోపిస్తున్నారు. జిల్లా వ్యవసాయ అధికారులను సంతృప్తి పరిచిన డీలర్లకే ఎరువులు అధికంగా కేటాయిస్తున్నారని వీరు చెబుతున్నారు. లారీకి రూ.2 వేల వరకు ఇవ్వాల్సి వస్తోందని ఆరోపిస్తున్నారు. అసలే ఎరువుల కంపెనీలు రవాణా చార్జీలు ఇవ్వడంలేదని, అధికారులకు అదనంగా ఇవ్వాల్సి రావడంతో రైతులకు ఎక్కువ ధరకు అమ్మాల్సి వస్తోం దని అంటున్నారు.

 

డీలర్ల వాదన ఎలా ఉన్నా... రైతులు మాత్రం సాధారణ పరిస్థితుల్లోనే  ఒక్కో బస్తాకు రూ.320కి కొనుగోలు చేయాల్సి వస్తోంది. అండర్‌బ్రిడ్జ్ ప్రాంతంలోని ఆరుగురు బడా డీలర్లు, వ్యవసాయ శాఖ అధికారులు కలిసి జిల్లా లో యూరియా మాఫియాగా తయారైనట్లు గ్రామీణ డీలర్లు ఆరోపిస్తున్నారు. కాగా, కంపెనీల నుంచి వచ్చే యూరియాను బడా డీలర్లు నేరుగా తమ పేరిట కాకుండా... తమ పరిధిలో ఉండే గ్రామీణ డీలర్ల పేరిట అన్‌లోడ్ చేసుకుంటున్నారు. ఆ తర్వాత ఎమ్మర్పీ కంటే ఎక్కువ ధరతో అదే డీలర్లకు ఇస్తున్నారు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లోని డీలర్లు ఇంకా ధర పెంచుతున్నారు.

 

అలాగే నగరంలో ఉండే డీలర్లు వేర్వేరు పేర్లతో మూడు,నాలుగు డీలర్‌షిప్‌లు తీసుకున్నారు. యూరియా లోడ్ రాగానే వాటని రిటేల్ డీలర్లకు ఎక్కువ ధరకు ఇచ్చి రైతులను దోపిడీ చేస్తున్నారు. జిల్లాకు వచ్చే ఎరువులను ముఖ్యంగా యూరియాను ఎక్కువ శాతం సహకార సంఘాలకు కేటాయించి... అధికారుల పర్యవేక్షణ పెంచితేనే రైతులు దోపిడీకి గురికాకుండా ఉంటారు. ఖరీఫ్ సీజన్ ఆఖరులో అయినా కలెక్టర్ జి.కిషన్ దీనిపై దృష్టి పెట్టాలని రైతులు కోరుతున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top