యూరియా.. ఏదయ్యా?!


  •      జిల్లాలో ఎరువుల కొరత

  •      వర్షాలు పడుతుండటంతో పెరిగిన డిమాండ్

  •      పరుగులు పెడుతున్న రైతులు

  •      బ్లాక్ మార్కెట్‌లో అధిక ధరలు

  • ఖమ్మం వ్యవసాయం : నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఎరువులకు డిమాండ్ పెరిగింది. జూన్, జూలైలో అడపాదడపా కురిసిన వానలకు రైతులతు పలు పంటలు సాగు చేశారు.  జిల్లాలో వర్షాధారంగా, నీటి ఆధారంగా పత్తి సాగు చేశారు. బోరు బావుల కింద, నీటి ఆధారం ఉన్న ప్రాంతాల్లో జూలై చివరి వారం, ఆగస్టు మొదటి వారంలో వరినాట్లు వేశారు. ప్రధానంగా పలు ప్రాంతాల్లో ముందుగా వేసిన ఈ రెండు పంటలు ప్రస్తుతం యూరియా వేసే దశలో ఉన్నాయి.



    అంతేగాక ప్రస్తుతం వేస్తున్న పైర్లకు కూడా యూరియా వేయాలనే తపనతో రైతులు ఎరువుల దుకాణాలకు, ఎరువులు విక్రయించే సహకార సంఘాలకు పరుగులు తీస్తున్నారు. కాంప్లెక్స్ ఎరువులు ప్రైవేటు డీలర్ల వద్ద లభిస్తున్నప్పటికీ యూరియా మాత్రం సక్రమంగా దొరకడం లేదు. యూరియా సంపూర్ణ స్థాయిలో లభించక పోవడం, అరకొరగా రావడంతో జిల్లా మార్క్‌ఫెడ్ ద్వార  ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలకు పంపిణీ చేస్తున్నారు.



    సహకార సంఘాలు చేసిన డిపాజిట్ల ప్రకారం మార్క్‌ఫెడ్ యూరియాను సరఫరా చేస్తోంది. పలువురు ప్రైవేటు డీలర్లు కూడా యూరియాను తెప్పించి విక్రయిస్తున్నారు.  ఖమ్మం నగరంతో పాటు జిల్లాలోని ఇల్లెందు, కొత్తగూడెం, భద్రాచలం, మధిర తదితర మండలాల్లో కొందరు ప్రైవేటు డీలర్ల వద్ద యూరియా లేకపోగా,  నిల్వలున్న దుకాణాల వారు బ్లాక్ చేసి అధిక ధరలకు అమ్ముతున్నారు. ప్రభుత్వం యూరియాకు నిర్ణయించిన ధర రూ.284 కాగా ప్రైవేటు దుకాణాల్లో రూ. 350కు పైగానే విక్రయిస్తున్నారు.



    మారుమూల గ్రామాల్లో రూ. 400 వరకు కూడా అమ్మకాలు చేస్తున్నట్లు సమాచారం. శనివారం ఇల్లెందులో యూరియా అధిక ధరలకు అమ్ముతుండగా రైతులు ప్రతిఘటించినట్లు తెలిసింది. సహకార సంఘాలు రైతులు ఆశించిన విధంగా యూరియాను అందించలేక రైతు స్థాయిని బట్టి రెండు, మూడు బస్తాల కన్నా ఎక్కువగా ఇవ్వడం లేదు. దీంతో రైతులు ఎరువుల దుకాణాలను ఆశ్రయించాల్సి వస్తోంది.



    యూరియా డిమాండ్‌ను గుర్తించిన ఎరువుల వ్యాపారులు  ఇదే అదునుగా భావించి ఇష్టారాజ్యంగా అధిక ధరలకు అమ్మకాలు చేస్తున్నారు. వ్యాపారులు యూరియా కొరత ఉందని చెబుతూ అధిక ధరలకు విక్రయిస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. అధిక ధరలను నిరోధించి ప్రకటించిన ధరలకు రైతులకు ఎరువులు అందే విధంగా చూడాల్సిన అధికారులు ఎంత మాత్రం పట్టించుకోవడం లేదని రైతులు అంటున్నారు.



    జిల్లాలో కొందరు అధికారులు అక్రమాలకు పాల్పడుతూ అధిక ధరలకు ఎరువులు అమ్మే వ్యాపారులపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో జిల్లాలోని జలాశయాల్లోకి నీరు చెరుతోంది. వాటి ఆయకట్టు భూముల్లో సాగు విస్తీర్ణం మరింతగా పెరిగే అవకాశం ఉంది. దీంతోపాటు సాగర్ నీటిని కూడా రెండో జోన్‌కు విడుదల చేయడానికి నీటి పారుదల శాఖ నిర్ణయించింది. జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణం 3.51 లక్షల హెక్టార్లు కాగా ఇప్పటి వరకు 2.41 లక్షల హెక్టార్లలో వివిధ రకాల పంటలు వేశారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో మరో లక్ష హెక్టార్ల సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉంది.



    వరి ఇప్పటి వరకు జిల్లాలో 50 వేల హెక్టార్లు, పత్తి 1.63 లక్షల హెక్టార్లు, మొక్కజొన్న 12 వేల హెక్టార్లు, పెసర 6 వేల హెక్టార్లు, కంది 3,300 హెక్టార్లు, మిర్చి 2 వేల హెక్టార్లలో సాగు చేస్తున్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో ప్రధానంగా వరి సాగు విస్తీర్ణం భారీగా పెరిగే అవకాశం ఉంది.   ఆగస్టు 25 తర్వాత బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా వర్షాలు ఊపందుకున్నాయి. దీంతో పంటల సాగు విస్తీర్ణం మరింతగా పెరిగే అవకాశం ఉంది. పంటల సాగు విస్తీర్ణానికి తగిన విధంగా యూరియా లభించే అవకాశం లేకపోవడంతో  రైతులు ఆందోళన చెందుతున్నారు.

     

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top