యూరియా బ్లాక్


 మిర్యాలగూడ : ఖరీఫ్ సీజన్‌లో ప్రస్తుతం అత్యవసరమైన యూరియాను వ్యాపారులు బ్లాక్ మార్కెట్‌లో అధిక ధరలకు విక్రయిస్తున్నారు. వాస్తవానికి యూరియా బస్తాను రూ. 284కు విక్రయించాల్సి ఉండగా వ్యాపారులు ప్రస్తుతం నెలకొన్న డిమాండ్‌ను ఆసరాగా చేసుకుని బస్తాను రూ. 360 రూపాయలకు విక్రయిస్తున్నారు. వర్షాలు కురుస్తుండటం, నాగార్జునసాగర్, ఎమ్మార్పీ కాలువలకు నీటిని విడుదల చేయడంతో జిల్లాలో నాలుగు లక్షల ఎకరాలకు పైగా విస్తీర్ణంలో రైతులు వరిసాగు చేపట్టారు. అయితే అవసరం మేరకు యూరియా రాకపోవడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. యూరియా కోసం నెల రోజుల నుంచి దుకాణాల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకునే నాథుడే లేడు.  

 

 దిగుమతి అయిన యూరియా 71వేల మెట్రిక్ టన్నులు  

 సెప్టెంబర్ నెలాఖరు వరకు జిల్లాలో 95 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉందని జిల్లా వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. కానీ ఇప్పటి వరకు కేవలం 71 వేల మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే వచ్చింది. దిగుమతి చేసుకున్న యూరియాలో 70 శాతం పంపిణీ జరిగింది. మిగతా 30 శాతం యూరియా వ్యాపారుల వద్దే ఉన్నట్లు తెలుస్తోంది.  జిల్లాలకు ఈ నెలాఖరులోగానే ఇంకా 24వేల మెట్రిక్ టన్నుల యూరియా రావాల్సి ఉండగా ఇప్పటి వరకు రాకపోవడంతో వ్యాపారులు తమ వద్ద బ్లాక్ చేసిన యూరియాను అధిక ధరలకు విక్రయిస్తున్నారు.  

 

 పీఏసీఎస్‌లలో...

 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లోనూ యూరియా లభించడం లేదు. మార్క్‌ఫెడ్ వద్ద బఫర్ స్టాక్ లేకపోవడం వల్ల పీఎసీఎస్‌లకు పంపిణీ చేయడం లేదని తెలిసింది. జిల్లాలోని ఏ ఒక్క పీఏసీఎస్‌లో కూడా యూరియా లభిం చడం లేదు. దాంతో రైతులు పూర్తిగా వ్యాపారులపైనే ఆధారపడాల్సి వస్తుంది. పీఏసీఎస్‌లకు యూరియా ఎక్కువ మొత్తంలో కేటాయించాలని డీసీసీబీ అధికారులు, పాలక మండలి కలెక్టర్‌ను కలిసి విన్నవించడం కూడా జరిగింది.

 

 మార్‌‌కఫెడ్‌కు 40 శాతమే..

 జిల్లాకు చేరుతున్న యూరియాలో అధికారులు వ్యాపారులకే అదనపు కోటా కేటాయిస్తున్నట్లు తెలుస్తుంది. దిగుమతి చేసుకున్న యూరియాలో వ్యాపారులకు 60 శాతం, మార్క్‌ఫెడ్‌కు 40 శాతం మాత్రమే కేటాయిస్తున్నారు. పీఏసీఎస్‌లలో యూరియా బస్తాకు రూ. 284కు లభిస్తున్నందున రైతులు ఎక్కువగా అక్కడే కొనుగోలు చేయడానికి మొగ్గు చూపుతున్నారు. కానీ, పీఏసీఎస్‌లకు తక్కువ కోటా కేటాయించడం వల్ల రైతులకు సరిపడా యూరియా దొరకడం లేదు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top