అవాస్తవిక బడ్జెట్


హైదరాబాద్: ద్రవ్య వినిమయ బిల్లు లోపభూయిష్టమంటూ శాసనమండలిలోనూ విపక్షాలు ధ్వజమెత్తాయి. శుక్రవారం మండలిలో ద్రవ్యవినిమయ బిల్లుపై సుదీర్ఘ చర్చ జరిగింది. పలు శాఖలకు రూ.1.06 లక్షల కోట్లు కేటాయింపులు చేసినా కేవలం రూ.65 వేల కోట్లే ఖర్చు చేయడంపై నిలదీశాయి. ఆరుగంటల చర్చ అనంతరం, బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం పొందినట్లు మండలి చైర్మన్ స్వామిగౌడ్ ప్రకటించారు.




సంక్షోభంలో ఉన్న వ్యవసాయ రంగానికి, ప్రాధాన్యత కలిగిన గ్రామీణాభివృద్ధి, విద్యుత్, హౌసింగ్, విద్యా రంగాలకు తక్కువ కేటాయింపులు చేయడమేమిటని ఎమ్మెల్సీ కె.నాగేశ్వర్ ప్రశ్నించారు. రూపాయి ఖర్చులేని ఉమ్మడి సర్వీస్ రూల్స్, ఎయిడెడ్ సమస్యలు, అటవీ హక్కుల చట్టం అమలు.. తదితర అంశాలను సైతం ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. పేదలందరికీ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు కట్టిస్తామని హామీ ఇచ్చిన సర్కార్.. బడ్జెట్లో ఆ మేరకు కేటాయింపులు ఎందుకు చేయలేదని టీడీపీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి ప్రశ్నించారు. మూడు లక్షల మంది పేద దళితులకు మూడెకరాలు చొప్పున ఇస్తామని ప్రకటించి, కేవలం 570 మందికి ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకుందన్నారు.





మరో ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. వాటర్‌గ్రిడ్, మిషన్‌కాకతీయ మినహా మిగిలిన పథకాలకు అవసరమైన మేరకు కేటాయింపులు చేయలేదన్నారు. ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. మిషన్ కాకతీయ కాంట్రాక్టర్లకు పండుగలా మారే ప్రమాదముందని హెచ్చరించారు. వాటర్‌గ్రిడ్‌కు నీళ్లెక్కడ్నుంచి వస్తాయో చెప్పకుండా లక్షల కిలోమీటర్ల పైప్‌లైన్ వేయడంపైనా సర్కారు ఆసక్తిని కనబరుస్తోందన్నారు.  





కేటాయింపుల మేరకు ఖర్చు చేయలేదు

గతేడాది ఆదాయ, వ్యయాలను బేరీజు వేసుకొనే ఏ రాష్ట్రమైనా బడ్జెట్‌ను రూపొందిస్తుం దని, కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి ఉజ్జాయింపు అంచనాలతో గత బడ్జెట్‌ను రూపొందించామని ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. బడ్జెట్ కేటాయింపుల మేరకు ఖర్చు చేయలేదన్న విషయాన్ని అంగీకరిస్తున్నామని చెప్పారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీల మేరకు కేంద్రం నుంచి రూ.31 వేల కోట్లు వస్తాయనుకుంటే.. వచ్చినవి కేవలం రూ.14 వేల కోట్లేనని చెప్పారు. కరువు మండలాలను త్వరలోనే ప్రకటిస్తామని హామీ ఇచ్చారు. రైతులకు రూ.25 వేల లోపు రుణాలను ఒకేసారి మాఫీ చేయాలనే విషయం పరిశీలిస్తామన్నారు.





ఉద్యోగుల పీఆర్సీ బకాయిలపై సంఘాలతో చర్చిస్తాం

ఉద్యోగుల వేతన సవరణ స్కేళ్ల అమలును ప్రస్తావిస్తూ బకాయిలను బాండ్ల రూపంలో చెల్లించాలా లేదా వారి జీపీఎఫ్ ఖాతాలో కలపాలా అన్న విషయంలో ఉద్యోగ సంఘాలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఈటెల చెప్పారు. ఈ విషయంలో ప్రభుత్వం ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదన్నారు.

 

'పార్లమెంటరీ సెక్రటరీల' బిల్లు ఆమోదం

ప్రతిపక్ష సభ్యుల అభ్యంతరాలు, విమర్శల నేపథ్యంలో తెలంగాణ పార్లమెంటరీ కార్యదర్శుల (నియామకం, జీతాలు, ఇతర నిబంధనలు) బిల్లును రాష్ట్ర శాసనమండలి ఆమోదిం చింది. శుక్రవారం ఈ బిల్లును ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ ప్రవేశపెట్టారు. ఈ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించాలని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి హరీశ్‌రావు కోరారు. గుజరాత్, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కూడా దీనిని అమలుచేశారని, మాజీ ప్రధాని ఇందిరాగాంధీ కూడా తొలుత పార్లమెంటరీసెక్రటరీగా పనిచేశారని ఆయన గుర్తుచేశారు.




ఈ నియామకాలు రాజకీయ ఉపాధి కోసమే తప్ప మరొకటి కాదని కౌన్సిల్‌లో విపక్షనేత డి.శ్రీనివాస్ ధ్వజమెత్తారు. లాభదాయక విధుల నిర్వహణను ఎమ్మెల్యేలు ఎలా నిర్వహిస్తారని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకరరెడ్డి ప్రశ్నించారు. ఈ సెక్రటరీల విధులు, బాధ్యతల గురించి సీఎం నోటిఫికేషన్ ద్వారా తెలియజేస్తారని మంత్రి హరీశ్ చె ప్పారు. ఈ చర్చలో ఎమ్మెల్సీలు ఎ.నర్సారెడ్డి, పొట్ల నాగేశ్వరరావు, ఎమ్మెస్ ప్రభాకర్‌రావు, కె. దిలీప్‌కుమార్, పూలరవీందర్, గంగాధర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top