క్రైస్తవులకు భవనం: కేసీఆర్


* హజ్ కమిటీ తరహాలో క్రిస్టియన్ యూనిటీ బోర్డు



హైదరాబాద్: క్రైస్తవులకు హైదరాబాద్‌లో ప్రత్యేక భవనం ఏర్పాటు చేయనున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. భవన నిర్మాణానికి రూ.10 కోట్లు కేటాయిస్తున్నట్టు వెల్లడించారు. ఈ మేరకు శుక్రవారం జీవో విడుదల చేస్తానన్నారు. ‘‘భవన్‌కు ఈ నెలలోనే శంకుస్థాపన చేస్తాం. వచ్చే ఏడాది క్రిస్మస్ వేడుకలు క్రైస్తవ భవన్‌లోనే జరుపుకోవాలి. ఈ భవన్‌కు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తీసుకొస్తాం’’ అని చెప్పారు.



గురువారం రాత్రి నాంపల్లిలోని తెలుగు లలిత కళాతోరణం ప్రాంగణంలో యునెటైడ్ క్రిస్మస్ వేడుకల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. క్రైస్తవులకు ఎలాంటి లోటూ ఉండదని, దళితులతో సమానంగా వారికి హోదా కల్పిస్తామని తెలిపారు. ముస్లింలకు హజ్ కమిటీ తరహాలో క్రిస్టియన్స్ యూనిటీ బోర్డు కూడా ఏర్పాటుచేస్తామన్నారు. కలెక్టర్ల అనుమతి అవసరం లేకుండా చర్చిలు నిర్మించుకునేందుకు కూడా శుక్రవారం ప్రత్యేక ఉత్తర్వులు విడుదల చేస్తామని వివరించారు.



‘‘హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్లతో సమావేశమై శ్మశానవాటికల సమస్యను పరిష్కరిస్తా. అలాగే పాస్టర్లు వివాహాలు జరపడానికి కావాల్సిన లెసైన్సుల జారీలో ఆలస్యం జరగకుండా చూస్తా’’ అని హామీలిచ్చారు. వారి మిగతా సమస్యలన్నింటిని పరిష్కరిస్తానన్నారు. తెలంగాణలో క్రిస్మస్‌కు ఇకపై రెండు రోజులు సెలవులివ్వనున్నట్టు గుర్తు చేశారు.



‘‘17 ఏళ్లుగా క్రిస్మస్‌నాడు చాపెల్ రోడ్డులోని చర్చికి వెళ్తున్నా. ఏటా అక్కడ దైవాశీస్సులు అందుకుంటుంటా. ఈ ఏడాది కూడా అక్కడికే వెళ్తా’’ అని అన్నారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రులు రాజయ్య, మహమూద్ అలీ, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్సీ రాజేశ్వరరావు, యునెటైడ్ క్రిస్మస్ సెలబ్రేషన్స్ చైర్మన్ రేమండ్ పీటర్, నామినేటెడ్ ఎమ్మెల్యే ఎల్వీ స్టీవెన్సన్, బిషప్‌లు సుమబాల తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top