యూనిట్ కరెంట్ రూ.2కే


 సంక్షోభంలో ఉన్న కోళ్ల పరిశ్రమను ఆదుకునేందుకు సిద్ధమైన ప్రభుత్వం తాజాగా సబ్సిడీపై విద్యుత్ సరఫరా చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా కోళ్లఫారాల్లో వినియోగించే విద్యుత్‌ను యూనిట్‌కు రూ.2కే నిర్ణయిస్తూ ట్రాన్స్‌కో ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై కోళ్లఫారాల్లో ఎంతమేరకు విద్యుత్‌ను వినియోగించుకున్నప్పటికీ యూనిట్‌కు రూ.2 చొప్పున మాత్రమే ట్రాన్స్‌కో సంస్థ వసూలు చేయనుంది. మిగిలిన మొత్తాన్ని ప్రభుత్వమే సబ్సిడీ రూపంలో ట్రాన్స్‌కోకు చెల్లించనుంది. తాజా ఉత్తర్వులు 2014 డిసెంబర్ ఒకటి నుంచి వర్తిస్తాయని పేర్కొంది.

 

 సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : రాష్ట్రంలో సంక్షోభంలో ఉన్న కోళ్ల పరిశ్రమను గట్టెక్కించాలని పౌల్ట్రీ ఫార్మర్స్ అసోసియేషన్ నాయకులు కొంతకాలంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ విషయంపై ప్రత్యేక చొరవ తీసుకున్న రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ గతేడాది డిసెంబర్ 19న పౌల్ట్రీ ఫార్మర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు, ట్రాన్స్‌కో అధికారులతో సమావేశమయ్యారు. కోళ్ల పరిశ్రమ ఎదుర్కొంటున్న ఇబ్బందులతోపాటు పెద్ద మొత్తంలో వస్తున్న కరెంటు బిల్లుల అంశాన్ని కోళ్ల పరిశ్రమల యజమానులు ఈ సందర్భంగా ఏకరవు పెట్టారు.

 

  తక్కువ ధరకు కరెంటు సరఫరా చేయలేని పక్షంలో కోళ్ల పరిశ్రమలను మూసివేయక తప్పని పరిస్థితి ఏర్పడిందని వాపోయారు. దీంతో సానుకూలంగా స్పందించిన మంత్రి ఈటెల కోళ్లఫారాలకు సబ్సిడీపై విద్యుత్‌ను సరఫరా చేయాలని కోరుతూ గత నెల 7న ట్రాన్స్‌కో సీఎండీకి లేఖ రాశారు. ఈ నేపథ్యంలో ట్రాన్స్‌కో సీఎండీ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. దీనివల్ల ఒక్కో కోళ్ల ఫారం యజమానికి సగటును ప్రతినెలా రూ.5వేల చొప్పున కరెంటు ఖర్చు ఆదా కానుంది. ఈ లెక్కన జిల్లాలోని కోళ్ల ఫారాల యజమానులందరికీ ప్రతినెలా రూ.2.5 కోట్లు ఆదా చేసుకునే అవకాశమున్నట్లు జిల్లా పౌల్ట్రీ ఫార్మర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు అభిప్రాయపడ్డారు.

 

 మక్కల సబ్సిడీతో రూ.30 కోట్ల ఆదా

 జిల్లాలో 600 మంది కోళ్ల ఫారాల యజమానులు సుమారు 84 లక్షల కోళ్లను పెంచుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వం మొక్కజొన్నల కొనుగోలు విషయంలో కోళ్ల ఫారాల యజమానులకు సబ్సిడీని ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనివల్ల వారు రూ.30 కోట్ల మేర లబ్ది పొందారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల సంక్షోభంలో ఉన్న కోళ్ల పరిశ్రమ ఊపిరి పీల్చుకుంది. వాస్తవానికి కోళ్ల పరిశ్రమ నిర్వహణ యజమానులకు తలకు మించిన భారంగా మారింది. కోళ్ల దాణా ధరల పెంపు, కరెంటు ఖర్చు, నిర్వహణ వ్యయం, ఇతర ఖర్చులుపోను ఎంతో కొంత లాభం మిగలాలంటే ఒక్కో కోడిగుడ్డు రూ.3.90కి విక్రయించాలని కరీంనగర్ జిల్లా పౌల్ట్రీ ఫార్మర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. కానీ ప్రస్తుతం ఒక్కో గుడ్డును రూ.2.45కే విక్రయిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయాలతో కోళ్ల ఫారాల రైతులకు మేలు జరుగుతుందని సంతోషం వ్యక్తం చేశారు.

 

 ఈటెలకు కృతజ్ఞతలు

 కోళ్ల ఫారాలకు సబ్సిడీపై విద్యుత్‌ను సరఫరా చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసిన నేపథ్యంలో నేషనల్ ఎగ్ కో ఆర్డినేషన్ కమిటీ(నెక్) జిల్లా అధ్యక్షుడు ఏ.విజయభాస్కర్, జిల్లా పౌల్ట్రీ ఫార్మర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు అనుముల మహేందర్, వి.వెంకటరమణారెడ్డి, సత్యనారాయణరావు  తదితరులు బుధవారం రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. కోళ్ల పరిశ్రమపై ప్రత్యక్షంగా 3,500 మంది, పరోక్షంగా వేలాది మంది ఆధారపడి జీవిస్తున్నారని పేర్కొన్నారు.

 

 వ్యవసాయం తరువాత అతిపెద్ద ఉపాధి కేంద్రంగా మారిన కోళ్ల పరిశ్రమను ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకు రావడం హర్షణీయమన్నారు. ఇకపై ప్రభుత్వం చేపట్టే సంక్షేమ కార్యక్రమాల అమలు విషయంలో తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు. కోళ్ల పరిశ్రమ నిర్వహణ విషయంలో ఎదురవుతున్న సమస్యలపై చర్చించేందుకు, మారుతున్న సాంకేతిక అంశాలపై అవగాహన కల్పించేందుకు జిల్లా కేంద్రంలో సమావేశ మందిరాన్ని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నందున, ప్రభుత్వం స్థలాన్ని మంజూరు చేయాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. తమ విజ్ఞప్తి పట్ల మంత్రి సానుకూలంగా స్పందించారని అసోసియేషన్ నాయకులు తెలిపారు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top