తెలంగాణలో బీజేపీ జెండా ఎగరాలి

తెలంగాణలో బీజేపీ జెండా ఎగరాలి - Sakshi


రాష్ట్రంలో అంతర్లీనంగా మోదీ హవా

- కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి జవదేకర్‌  

- ఎంఐఎం ఎజెండాను అమలు చేస్తే ఎదిరించి పోరాడతాం

- ఎంతమంది కేసీఆర్‌లు వచ్చినా మా గెలుపును ఆపలేరు: లక్ష్మణ్‌




సాక్షి, యాదాద్రి:  2019 ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ జెండా ఎగురవేయాలని, ఇది భువనగిరి నుంచే ప్రారంభం కావాలని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ అన్నారు. శనివారం యాదాద్రిభువనగిరి జిల్లా కేంద్రంలో భువనగిరి లోక్‌సభ నియోజకవర్గ స్థాయి పోలింగ్‌ బూత్‌ కమిటీ సదస్సులో ఆయన మాట్లాడారు. తెలంగాణలో అంతర్లీనంగా ప్రధాని నరేంద్ర మోదీ గాలి వీస్తోందని, ఇందుకు ఎన్డీఏ చేపట్టిన పథకాలు, విధానాలే కారణమని చెప్పారు.



రాష్ట్ర ప్రభుత్వం ఎంఐఎం ఎజెండా అమలు చేయాలని చూస్తే దానికి వ్యతిరేకంగా పోరాడతామన్నారు. ఎంఐఎం మెప్పు కోసమే కేసీఆర్‌ ప్రభుత్వం సెప్టెంబర్‌ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పక్కనబెట్టిందని ఆయన విమర్శించారు. కర్ణాటక, మహారాష్ట్రల్లో విమోచన దినోత్సవాన్ని అక్కడి ప్రభుత్వాలు నిర్వ హిస్తున్నప్పుడు తెలంగాణలో ఎందుకు నిర్వహించడం లేదని కేంద్రమంత్రి ప్రశ్నించారు. ఉత్తరప్రదేశ్‌లో ప్రజావ్యతిరేక పార్టీలకు ఓట్లు వేయకుండా జనం ఓడిస్తే ఓటర్లను అవమానపర్చే విధంగా మాట్లాడుతున్నారని చెప్పారు.



ఈవీఎంలలో తేడా లేదని, కేవలం మీ ఆలోచనల్లో తేడా ఉందని ఆయన ప్రతిపక్షాలను ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను త్వరగా నిర్మించాలని, లేకుంటే కేంద్రం మంజూరు చేసే 90 వేల ఇళ్లు ఇక్కడ నిర్మిస్తామన్నారు. దేశంలో అత్యంత శక్తివంతమైన పార్టీ బీజేపీయేనని, కేవలం రెండు ఎంపీ స్థానాల నుంచి  దేశం పరిపాలించే స్థాయికి ఎదిగిందన్నారు. బీజేపీకి 11కోట్ల సభ్యత్వాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి భీం యాప్‌ను కార్యకర్తల మొబైల్‌లలో డౌన్‌లోడ్‌ చేయించారు.



పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ మాట్లాడుతూ మోదీ సాధిస్తున్న విజయాలు చూసి కేసీఆర్‌కు భయం పట్టుకుందని, దీంతో కులం, మతం ప్రాతిపదికన విడదీసి తాను మరోసారి గెలవాలని చూస్తున్నారని ఆరోపించారు. 2019లో ఎంత మంది కేసీఆర్‌లు వచ్చినా బీజేపీ గెలుపును అడ్డుకోలేరన్నారు. ఎంఐఎంతో చేతులు కలిపి 12శాతం రిజర్వేషన్‌లు తేవాలని చూస్తే అడ్డుకొని తీరుతామని ఎమ్మెల్సీ రామచందర్‌రావు అన్నారు. కార్యక్రమంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు నల్లు ఇంద్రసేనారెడ్డి,  జిల్లా అధ్యక్షుడు పీవీ శ్యాంసుందర్‌రావు తదితరులు పాల్గొన్నారు.



స్వచ్ఛభారత్‌

యాదగిరిగుట్టలో కేంద్రమంత్రి జవదేకర్‌ పార్టీ శ్రేణులతో కలసి స్వచ్ఛభారత్‌ నిర్వహిం చారు. బస్టాండ్‌ పరిసరాల్లో చెత్తను తొలగిం చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. డిజిటల్‌ లావాదేవీలను ప్రోత్సహించేందుకు, అందరినీ నగదు రహిత ఆర్థిక వ్యవస్థలోకి తీసుకు వచ్చేందుకు బీజేపీ కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ బీజేపీ నాయకులతో కలసి తారకరామానగర్‌లోని ఆ పార్టీ దళిత మోర్చా నాయకుడు మేడి కోటేశ్‌ ఇంటికి వెళ్లారు. ఆయన తల్లిదండ్రులతో పాటు, కుటుంబ సభ్యులతో మాట్లాడారు. వారి ఇంట్లో నేలపై కూర్చొని సహపంక్తి భోజనం చేశారు. అనంతరం పక్కనే ఉన్న గుడారాల్లో నివాసం ఉంటున్న వీధి వ్యా పారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముద్ర రుణాలను తీసుకోవాలని వారికి మంత్రి సూచించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top