ప్రభుత్వానికి అండగా ఉందాం..


  • దసరాలోగా పదో పీఆర్సీ

  • త్వరలోనే సమస్యలు పరిష్కారం

  • టీఎన్జీవోస్ కేంద్ర సంఘం అధ్యక్షుడు దేవిప్రసాద్

  •  టీఎన్జీవోస్ జిల్లా స్టాండింగ్ కౌన్సిల్ సమావేశం

  • హన్మకొండ అర్బన్ : తెలంగాణ ఉద్యోగులంతా ప్రభుత్వానికి అండగా ఉంటూ తమ సమస్యలతోపాటు ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని టీఎన్జీవోస్ కేంద్ర సంఘం అధ్యక్షుడు దేవిప్రసాద్, కార్యదర్శి కారం రవీందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. టీఎన్జీవోస్ జిల్లా స్టాండింగ్ కౌన్సిల్ సమావేశం హన్మకొండ సుబేదారిలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఆడిటోరియంలో శుక్రవారం రాత్రి జరిగింది.



    తొలుత అదాలత్ అమర వీరుల స్థూపం వద్ద, కలెక్టర్ నివాసం ఎదుట ఉన్న కీర్తి స్థూపం వద్ద తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు.అనంతరం టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు కోలా రాజేష్‌కుమార్‌గౌడ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో దేవిప్రసాద్‌తోపాటు కేంద్ర సంఘం కార్యదర్శి కారం రవీందర్‌రెడ్డి, నాయకులు రేచల్ పాల్గొన్నారు.



    జిల్లా ఎంప్లాయీస్ జాయింట్ కౌన్సిల్ చైర్మన్ హోదాలో కలెక్టర్ జి.కిషన్, వరంగల్ ఎంపీ కడియం శ్రీహరి పాల్గొని ఉద్యోగుల సమస్యలు, బాధ్యతలపై మాట్లాడారు. ముఖ్యఅతిథి దేవిప్రసాద్ మాట్లాడుతూ ఉద్యమ సమయంలో సీఎం కేసీఆర్, జేఏసీ చైర్మన్ కోదండరాం, ఉద్యోగ సంఘాల నాయకుల పేర్లతో పోలీస్‌స్టేషన్లలో అనేక కేసులు నమోదయ్యాయని అన్నారు. రాష్ట్రంలో ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ ప్రభుత్వం ఏర్పడిందని, ఉద్యోగుల సమస్యలన్నీ క్రమంగా పరిష్కారం అవుతాయని అన్నారు. దసరాలోగా పదో పీఆర్సీ వచ్చే అవకాశం ఉందన్నారు.

     

     ఓరుగల్లు ఉద్యమాలే స్ఫూర్తి

     జిల్లాలో జరిగిన ఉద్యోగ ఉద్యమాలే రాష్ట్రస్థాయిలో చేపట్టిన పలు ఉద్యమాలకు స్ఫూర్తిగా నిలిచాయని దేవిప్రసాద్ అన్నా రు. లక్షగ ళార్చన తెలంగాణ ఉద్యమానికి ఊపునిచ్చిందని అన్నారు. జిల్లా నుంచి కారం రవీందర్ రెడ్డి, పరిటాల సుబ్బారావు ఉద్యోగులకు ఉద్యమ పాఠాలు నూరిపోసి సైనికుల్లా తయారు చేశారని పొగడ్తలతో ముంచెత్తారు.

     

     సమాజ ఉద్ధరణ కోసమే..: కారం

     ఉద్యమ విజయంతో.. సమాజ ఉద్ధరణ కోసమే ఉద్యోగులు పుట్టారనే విషయాన్ని ప్రజలు గుర్తించారని, వారి ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా ఉద్యోగులు పనిచేయాలని టీఎన్జీవోస్ కేంద్ర సంఘం కార్యదర్శి కారం రవీందర్‌రెడ్డి అన్నారు. 2013, జూలై 1 నుంచి 10వ పీఆర్సీ అమలయ్యే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. ఉద్యోగులకు త్వరలో హెల్త్ కార్డులు వస్తాయని, ఈ విషయంలో సీఎం కేసీఆర్ సానుకూలంగా ఉన్నారని అన్నారు. జిల్లా కేంద్రంలో టీన్జీవోస్‌కు ఇళ్ల స్థలాలు, కల్యాణ మండపం నిర్మాణానికి కృషి చేస్తున్నామని తెలిపారు.

     

    ఇంకా వేధింపులే..: పరిటాల

    రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా తెలంగాణ ప్రాంత ఉద్యోగులపై సీమాంధ్ర పాలకుల వేధింపులు కొనసాగుతున్నాయని జిల్లా ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ పరిటాల సుబ్బారావు అన్నారు. గుంటూరులో ట్రాన్స్‌పోర్టు అధికారి హన్మంత్‌నాయక్‌ను ఏసీబీకి పట్టించారని అన్నారు. ఇందులో సీఎం చొరవ తీసుకోవాలని కోరినట్లు తెలిపారు.

     

     25న బతుకమ్మ ఉత్సవాలు

     జిల్లాలో మహిళా ఉద్యోగుల ఆధ్వర్యంలో ఈనెల 25న బతుకమ్మ ఉత్సవాలు జిల్లా కేంద్రంలో నిర్వహించనున్నట్లు టీఎన్జీఓస్ మహిళా విభాగం కేంద్ర సంఘం అధ్యక్షురాలు రేచల్ అన్నారు. మహిళా ఉద్యోగులకు ప్రభత్వం 2 గంటల వరకు మాత్రమే పనిచేసే విధంగా ఉత్తర్వులు ఇవ్వడం అభినందనీయమన్నారు.

     

     లోగో మారితే అభివృద్ధి కాదు : కలెక్టర్

     రాష్ట్రంలో ఏపీ లోగో మారి తెలంగాణ లోగో వచ్చినంత మాత్రాన ప్రజల కష్టాలు పోవని, బంగారు తెలంగాణ కోసం ఉద్యోగులు మరింత బాధ్యతగా పనిచేయాలని కలెక్టర్ జి.కిషన్ అన్నారు. అటెండర్ నుంచి కలెక్టర్ వరకు ఒక కుటుంబంలా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని అన్నారు.

     

     కల్యాణ మండపానికి రూ.25లక్షలు : కడియం

     ఉద్యోగుల కల్యాణ మండప నిర్మాణం చేపడితే తనవంతుగా రూ.25లక్షలు నిధులు తొలి విడతలోనే ఇస్తానని వరంగల్ ఎంపీ కడియం శ్రీహరి అన్నారు. పెన్షనర్లకు ఇంక్రిమెంట్ ఇవ్వాలని, అందుకు ఉద్యోగ సంఘాలు కృషి చేయాలని అన్నారు.

     

     కళాకారులకు సన్మానం

     కాగా, జనగామకు చెందిన గాయకుడు గిద్దె రామ్మోహన్‌ను సన్మానించారు. రామ్మోహన్‌తోపాటు సంధ్య, రవి ఆలపించిన గీతాలు సభికులకు కట్టిపడేశాయి. అలాగే ఏకగ్రీవంగా ఎన్నికైన టీఎన్జీఓస్ కమిటీని వేదికపై ప్రత్యేకంగా సన్మానించారు.

     

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top