ప్రశ్నార్థకమైన బీపీఎల్ పవర్ ప్రాజెక్టు

ప్రశ్నార్థకమైన బీపీఎల్ పవర్ ప్రాజెక్టు

రామగుండం : బొగ్గు ఆధారిత విద్యుత్‌ కేంద్రాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం విముఖత చూపడంతో పట్టణంలోని ప్రతిపాదిత బీపీఎల్‌ విద్యుత్‌ కేంద్రం ప్రశ్నార్థకంగా మారింది. మొదటి నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో బీపీఎల్‌ యాజమాన్యంతో సయోధ్య కుదరకపోవడంతో సాంకేతికపరమైన కారణాలతో జాప్యం జరుగుతూ వచ్చింది. స్థానికంగా అన్ని వనరులు సమద్ధిగా ఉన్నప్పటికీ బొగ్గు ఆధారిత విద్యుత్‌ కేంద్రాలతో పర్యావరణ పరిరక్షణకు విఘాతం కలుగుతుందనే కారణంతో కేంద్ర ప్రభుత్వం బీపీఎల్‌ విద్యుత్‌ కేంద్రం ఏర్పాటుకు విముఖత చూపిస్తుందని తెలిసింది. కాగా ప్రస్తుతం దేశ వ్యాప్తంగా విద్యుత్‌ అవసరాలకు మించి సోలార్, విండ్, జలవిద్యుత్‌ ఉత్పత్తి అవుతుండడం కూడా మరో కారణంగా భావిస్తున్నట్లు సమాచారం. దీంతో బీపీఎల్‌ యాజమాన్యం మరోమారు పునరాలోచనలో పడినట్లయింది.

 

పట్టణంలోని ప్రతిపాదిత బీపీఎల్‌ విద్యుత్‌ కేంద్రం పూర్వపరాలు...

పట్టణంలోని ప్రతిపాదిత విద్యుత్‌ కేంద్రమైన బ్రిటీష్‌ ఫిజికల్‌ లాబోలేటరీ (బీపీఎల్‌) అప్పటి టీడీపీ ప్రభుత్వం బెంగళూరుకు చెందిన మారుబెని, తోషీబా, ఎలక్ట్రిక్‌ పవర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (జపాన్‌)లకు దశల వారీగా పనులు చేపట్టేందుకు ప్రాజెక్టును కట్టబెట్టారు. 1994లో అప్పటి టీడీపీ ప్రభుత్వం బెంగళూరుకు చెందిన మారుబెని, తోషీబా, ఎలక్ట్రిక్‌ పవర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (జపాన్‌)లకు దశల వారీగా పనులు చేపట్టేందుకు ప్రాజెక్టును కట్టబెట్టారు. 

 

స్థానికంగా ఉన్న ‘ఏ’పవర్‌హౌజ్‌ స్థలం 750 ఎకరాలతో పాటు మరిన్ని అవసరాల నిమిత్తం మరో 1,067 ఎకరాలతో మొత్తంగా 1,817 ఎకరాలు బీపీఎల్‌ సేకరించింది. బీపీఎల్‌ 520 మెగావాట్ల ఉత్పత్తి సామర్ధ్యంతో రూ.2813.9 కోట్ల వ్యయంతో అంచనా రూపొందించి ప్రహారీగోడ, ఇతరత్రా సాంకేతికపరమైన నిర్మాణాలు చేపట్టి రూ.150 కోట్ల వ్యయం చేసింది. యూనిట్‌ రేట్‌ విద్యుత్‌ కొనుగోలు ఒప్పందంలో ప్రభుత్వంతో సయోధ్య కుదరకపోవడంతో అర్ధాంతరంగా నిలిచిపోయింది.

 

బీపీఎల్‌ సేకరించిన భూ వివరాలు....

ప్రభుత్వ, ప్రయివేట్‌ భూములలో మల్యాలపల్లి శివారులో ప్రయివేట్‌ భూములు 169.25 ఎకరాలు, ప్రభుత్వ భూమి 87.08 ఎకరాలు, కుందనపల్లి శివారులో ప్రయివేట్‌ 52.21, ప్రభుత్వ 4.23 ఎకరాలు, రామగుండం శివారులో ప్రయివేట్‌ 6.29, ప్రభుత్వ 181.39, రాయదండిలో ప్రయివేట్‌ 384.22, ప్రభుత్వ 228.06 ఎకరాలు, బ్రాహ్మణపల్లి శివారులో ప్రయివేట్‌ 640.19, ప్రభుత్వ 33.35 ఎకరాలు, ఎల్లంపల్లి శివారులో ప్రయివేట్‌ 7.13, ప్రభుత్వ 4.01 ఎకరాలు, గోలివాడ శివారులో ప్రయివేట్‌ 10.29, ప్రభుత్వ 5.13 ఎకరాలు సేకరించారు. మొత్తంగా 1817.03 ఎకరాల విస్తీర్ణంలో ప్రయివేట్‌ భూములు 1271.38 ఎకరాలు, ప్రభుత్వ భూములు 543.05 ఎకరాల విస్తీర్ణంగా ఉంది.

 

సేకరించిన భూములపై ఏటూ తేల్చుకోలేని బీపీఎల్‌ యాజమాన్యం...

పట్టణంలోని ప్రతిపాదిత బీపీఎల్‌ విద్యుత్‌ కేంద్రం స్థాపనకు సుమారు ముపై ్ప ఏళ్ళ క్రితం సేకరించిన ప్రభుత్వ, ప్రయివేటు భూములపై కేంద్ర ప్రభుత్వ ప్రకటనతో బీపీఎల్‌ యాజమాన్యం ఏటూ తేల్చుకోలేని పరిస్థితి నెలకొంది. ఓ వైపు మా భూములు మాకివ్వాలంటూ భూనిర్వాసితులు ఒత్తిడి తేవడమే కాకుండా పలుచోట్ల సదరు భూముల్లో యధేచ్ఛగా సాగుకు సైతం పూనుకుంటుండడంతో పరిస్థితి విషమించకముందే కంచె ఏర్పాటు చేసి హెచ్చరిక బోర్డులను సైతం ఏర్పాటు చేసింది. దీనిపై నిర్వాసితులు ఉద్యమానికి సైతం కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. ఇక ప్రభుత్వ భూముల విషయానికి వస్తే ప్రభుత్వం నుంచి సేకరించిన భూముల్లో చట్టపరంగా నిర్దేశిత గడువులోగా పరిశ్రమను స్థాపించకుంటే తిరిగి ఇవ్వాలనే నిబంధనలు ఉండడంతో బీపీఎల్‌ యాజమాన్యం పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.

 

సోలార్‌ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంటేనే బీపీఎల్‌కు మనుగడ...

ప్రస్తుత పరిస్థితుల్లో తక్కువ పెట్టుబడితో ఏలాంటి రిస్క్‌ లేకుండా సేకరించిన భూముల్లో సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి వైపు చర్యలు చేపడితేనే అన్నింటా మేలు కలుగుతుందనే ఆలోచనలో బీపీఎల్‌ ఉన్నట్లు తెలిసింది. ప్రస్తుత పరిస్థితుల్లో పరిశ్రమలకు భూసేకరణ, పర్యావరణ అనుమతులు గుడిబండగా మారడంతో ఉన్న భూములను కాపాడుకోవాలంటే తక్షణమే సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి వైపు దష్టి సారిస్తేనే తక్కువ పెట్టుబడితో ఏలాంటి పర్యావరణ అనుమతులు, ఇతరత్రా ఒప్పందాలు అవసరం లేకుండానే మార్కెట్‌లో నిలదొక్కుకునే అవకాశాలున్నాయి. 

 

కాగా పట్టణం నడిబొడ్డున వందలాది ఎకరాల ప్రభుత్వ భూములు ఖాళీగా ఉండడంతో ప్రతీ ఒక్కరి దష్టి వాటిపైనే పడుతుంది. అదే విధంగా అంతర్గాం మండల పరిధిలో గోలివాడ పంపుహౌజ్‌ పనులకు భూసేరణలో నిర్వాసితులకు చెల్లించిన పరిహారాలకు సమానంగా తమకు కూడా వచ్చే విధంగా చేస్తామంటూ కొంతమంది దళారులు బీపీఎల్‌ భూనిర్వాసితులను మభ్యపెడుతున్నట్లు సమాచారం. ఏదేమైనా సదరు భూములపై త్వరితగతిన బీపీఎల్‌ యాజమాన్యం ఏదైనా నిర్ణయం తీసుకుంటేనే మేలు. లేదంటే ఇప్పటికే ఆలస్యం..అమతంగా మారినప్పటికీ విషంగా మారకముందే చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.


 


 


 
Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top