హత్యకేసులో ఇద్దరికి జీవిత ఖైదు


రంగారెడ్డి:  డబ్బు కోసం ఒక వ్యక్తిని హత్య చేసిన ఇద్దరికి జీవిత ఖైదుతోపాటు రూ.2వేల జరిమానా చొప్పున విధిస్తూ మూడో అదనపు డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి శనివారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం... నాచారం ప్రాంతంలో నివాసముండే రిటైర్డ్ ఎమ్మార్వో జోగారెడ్డికి ఇద్దరు కుమార్తెలు. వారిద్దరికీ పెళ్లిళ్లు కావటం, భార్య చనిపోవటంతో జోగారెడ్డి తన ఇంట్లో ఒంటరిగానే ఉండేవారు. ఆ ఇంట్లో వీరమణి అనే మహిళ పని మనిషిగా ఉండేది. ఈ క్రమంలో జోగారెడ్డి ఆమెతో అక్రమ సంబంధం కొనసాగించాడు. కొంతకాలం పనిచేసిన వీరమణి తన సొంత గ్రామమైన మెదక్ జిల్లా రామాపూర్ వెళ్లిపోయింది.



అయితే, జోగారెడ్డి వద్ద ఉన్న డబ్బు కాజేసేందుకు వీరమణి పథకం పన్నింది. ఆ మేరకు అతడిని 2010 జూలై 27న తన ఇంటికి రప్పించుకుంది. వీరమణి, ఆమె అల్లుడు మల్లేష్ కలిసి జోగారెడ్డికి అతిగా మద్యం తాగించారు. మత్తులో ఉన్న జోగారెడ్డిని చున్నీతో మెడకు బిగించి హత్య చేశారు. శవాన్ని దగ్గరలోనే మంజీరా షుగర్ ఫ్యాక్టరీ వద్దకు తీసుకెళ్లి కిరోసిన్ పోసి కాల్చివేశారు. ఈ విషయం ఆరు నెలల వరకు ఎవరికీ తెలియకుండా ఉంది.



ప్రతి ఏటా జోగారెడ్డి తన మనవడి పుట్టినరోజున ఫోన్ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలిపేవాడు. 2011 జనవరిలో మనవడి పుట్టినరోజుకు ఫోన్ చేయకపోవడంతో నగరంలోనే ఉండే ఆయన కూతురు సంధ్యకు అనుమానం వచ్చింది. దీంతో ఆమె నాచారంలోని జోగారెడ్డి ఇంటికి వెళ్లి చూసింది. అక్కడ తండ్రి లేకపోవటంతో నాచారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు విచారణ చేపట్టిన పోలీసులు వీరమణిని అదుపులోకి తీసుకుని వివరాలు రాబట్టారు. తన అల్లుడు మల్లేష్‌తో కలిసి డబ్బు కోసం జోగారెడ్డిని హత్య చేసి కాల్చివేసినట్లు నేరాన్ని అంగీకరించింది. నాచారం పోలీసులు నిందితులను రిమాండ్‌కు తరలించి కోర్టులో అభియోగపత్రం నమోదు చేశారు. కేసు సాక్ష్యాధారాలను పరిశీలించిన 3వ అదనపు డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జ్జి హేమంత్‌కుమార్ పైవిధంగా తీర్పు చెప్పారు.



 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top