ఆలస్యం ఖరీదు రెండు వేల కోట్లు!

ఆలస్యం ఖరీదు రెండు వేల కోట్లు! - Sakshi


సాక్షి, హైదరాబాద్:  మెట్రో రైలు కూత పెట్టకముందే... ప్రాజెక్టు పనులకు అడుగడుగునా బ్రేకులు పడుతున్నాయి.. హైదరాబాద్ కలల స్వప్నం .. సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతోంది. 25 నెలల కిందటే ప్రాజెక్టు పనులకు శ్రీకారం చుట్టినా.. పనులు మాత్రం అనుకున్న రీతిలో ముందుకు సాగడంలేదు. మెట్రో మార్గాలలో ఆస్తుల సేకరణ, భవనాల తొలగింపు, ప్రభుత్వం, వివిధ శాఖల నుంచి సహకారం కొరవడడంతో కలల మెట్రో పట్టాలెక్కడానికి మరింత సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది. దీనికి తెలంగాణ ప్రభుత్వం చెల్లించుకోబోతున్న మూల్యం అక్షరాల రెండువేల కోట్లు!!

 

 అడుగడుగునా అడ్డంకులే...




 సెప్టెంబర్ 4, 2010లో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కుదిరిన ఒప్పందం మేరకు ఎల్‌అండ్‌టీ సంస్థ ఈ భారీ ప్రాజెక్టు చేపట్టింది. అయితే, మొదటి నుంచీ మెట్రోకు అనేక అడ్డంకులు వస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా పోలీసు, ట్రాఫిక్ శాఖల నుంచి అనుమతుల్లో జాప్యం, భూ సేకరణలో ఇబ్బందులు మెట్రో పాలిట శాపంగా మారుతున్నాయి.

 

 అమీర్‌పేట్, పరేడ్‌గ్రౌండ్స్, ఎంజీబీఎస్‌లో ఇంటర్‌ఛేంజ్ (2 మెట్రో కారిడార్లు కలిసే చోటు) స్టేషన్ల నిర్మాణానికి ఆస్తుల సేకరణ జరగలేదు.  

 

 సారథి స్టూడియో, మలక్‌పేట్, సోమాజిగూడ, గ్రీన్‌ల్యాండ్స్, సికింద్రాబాద్ ఇస్కాన్, కోఠి, మొజంజాహీ మార్కెట్, నాంపల్లి, చిక్కడపల్లి, యూసుఫ్‌గూడ ప్రాంతాల్లో భవంతుల తొలగింపు కార్యక్రమం చేపట్టలేదు. దీంతో మూడు నెలల నుంచి ఆయా ప్రాంతాల్లో పనులు ఆగిపోయాయి.

 

 లక్డీకాపూల్ వద్దనున్న పోలీసు క్వార్టర్స్, డీజీపీ కార్యాలయం కూల్చివేయకముందే ఆయా భవంతులను నిర్మించాలని పోలీసు శాఖ షరతు విధించింది. దీంతో ఇక్కడా పనులు ఆలస్యం కానున్నాయి.

 

 ఈ కారణాలతో ప్రాజెక్టు పనులు మరో రెండేళ్లు ఆలస్యం కానున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.

 

 పునరాలోచనలో ఎల్‌అండ్‌టీ ..!

 

 ప్రభుత్వం నుంచి సరైన సహకారం, రాయితీలు అందకపోవడంతో ప్రాజెక్టుపై పునఃసమీక్షించాలని మెట్రో నిర్మాణ సంస్థ ఎల్‌అండ్‌టీ నిర్ణయించుకున్నట్లు సమాచారం. మూడు నెలల్లో ఆస్తుల సేకరణ, అలైన్‌మెంట్ మార్పులపై ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకుంటే  ప్రాజెక్టు నిర్మాణం విషయంలో వెనుకడుగు వేయాలని యోచిస్తున్నట్లు తెలిసింది. అయితే నాగోల్-మెట్టుగూడ రూట్‌లో (8 కి.మీ.) మాత్రం అనుకున్న గడువు (2015 మార్చి 21న)లో మెట్రో పరుగులు తీయనుంది.

 

 ప్రభుత్వ నిర్ణయమే ప్రామాణికం: గాడ్గిల్

 

 మారిన మెట్రో అలైన్‌మెంట్‌పై తమకు ప్రభుత్వం నుంచి రాతపూర్వక సమాచారం అందలేదని.. దీనిపై ప్రభుత్వ నిర్ణయమే తమకు ప్రామాణికమని ఎల్‌అండ్‌టీ మెట్రో రైలు ఎండీ వీబీ గాడ్గిల్ తెలిపారు. మంగళవారం నాగోల్ ఎలివేటెడ్ మెట్రో స్టేషన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.  25 నెలల వ్యవధిలో నాగోల్-మెట్టుగూడ రూట్‌ను అత్యున్నత స్థాయిలో తీర్చిదిద్దామన్నారు. కొన్ని ప్రాంతాల్లో ఆస్తుల సేకరణ పూర్తికానందున అక్కడ తాత్కాలికంగా పనులు నిలిపివేశామన్నారు. పెరగనున్న అంచనా వ్యయం ఎవరు భరించాలన్న విషయంలో ఒప్పందం ప్రకారమే నడుచుకుంటామన్నారు.




 మారిన అలైన్‌మెంట్‌పై నెలరోజుల్లో స్పష్టత: ఎన్వీఎస్ రెడ్డి




 సుల్తాన్ బజార్, అసెంబ్లీ మార్గాల్లో మారిన మెట్రో అలైన్‌మెంట్‌పై నెలరోజుల్లో స్పష్టత రానుందని హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి అన్నారు. మంగళవారం నాగోల్ మెట్రో స్టేషన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. మెట్రో పిల్లర్లు, స్టేషన్లపై పోస్టర్లు అంటిస్తే కేసులు పెడతామని హెచ్చరించారు. మెట్రో రైళ్లు, స్టేషన్లు, డిపోల నిర్వహణ బాధ్యతలను ఫ్రాన్స్‌కు చెందిన కియోలిస్ సంస్థకు ఐదేళ్ల పాటు అప్పగిస్తున్నట్లు తెలిపారు.

 

 పెరిగిన భారం ప్రభుత్వంపైనే..

 

 మెట్రో ప్రాజెక్టు నిర్మాణ సమయంలో నాటి ఉమ్మడి ఏపీ ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం అలైన్‌మెంట్ మార్పులు, నిర్ణీత గడువులోగా అనుమతులు రాకుంటే పెరిగే ఆర్థికభారాన్ని రాష్ట్ర ప్రభుత్వ మే భరించాలన్న నిబంధనను ఒప్పందంలో స్పష్టంగా పేర్కొన్నట్లు ఎల్‌అండ్‌టీ వర్గాలు గుర్తుచేస్తున్నాయి. దీనిప్రకారం మెట్రో రెండేళ్లు ఆలస్యమైతే రాష్ట్ర ఖజానాకు రూ.2 వేల కోట్ల అదనపు భారం పడొచ్చు. గతంలో ప్రాజెక్టు వ్యయం రూ.14,142 కోట్లు కాగా ఇప్పుడది రూ.16,142 కోట్లకు చేరుకోనుంది.




 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top