ఆగని స్వైన్‌ఫ్లూ ఘంటికలు

ఆగని స్వైన్‌ఫ్లూ ఘంటికలు


‘గాంధీ’లో మరో ఇద్దరి మృత్యువాత

30కి చేరిన మృతుల సంఖ్య

నల్లగొండ, మెదక్, మహబూబ్‌నగర్‌లలో మరో 4 ‘పాజిటివ్’ కేసులు

ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న మరో 80 మంది బాధితులు




సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో స్వైన్‌ఫ్లూ మరణ మృదంగం మోగిస్తోంది. వైరస్ నియంత్రణలో అధికారుల నిర్లక్ష్యాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తున్నా, రోగులకు అందించాల్సిన చికిత్సపై కేంద్ర వైద్య బృందం పలు సూచనలు చేసినా ఆస్పత్రుల్లో మృత్యుఘంటికలు మాత్రం ఆగట్లేదు. ఫలితంగా రోజూ సగటున ఇద్దరు చొప్పున మృతి చెందుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం వరకు 1472 మందికి స్వైన్‌ఫ్లూ పరీక్షలు నిర్వహించగా, వారిలో 523 మందికి హెచ్1ఎన్1 వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయింది.



బాధితుల్లో ఇప్పటివరకు 28 మంది మృతిచెందినట్లు ప్రభుత్వం ప్రకటించగా శుక్రవారం హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు (చాదర్‌ఘాట్‌కు చెందిన అబ్దుల్ మన్నన్ (26), సయ్యద్‌నగర్‌కు చెందిన గులాం హుస్సేన్ (50)) స్వైన్‌ఫ్లూ రోగులు మరణించారు. మరోవైపు నల్లగొండ జిల్లాలో రెండు, మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఒక్కోటి చొప్పున శుక్రవారం స్వైన్‌ఫ్లూ కేసులు బయటపడ్డాయి. గాంధీ, ఉస్మానియా సహా పలు కార్పొరేట్ ఆస్పత్రుల్లో మరో 80 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు.



హే...‘గాంధీ’...

గాంధీ ఆస్పత్రిలోని స్వైన్‌ఫ్లూ వార్డులో నిత్యం 60-70 మంది చికిత్స పొందుతుండగా వారిలో ఇద్దరు, ముగ్గురు ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొంది పరిస్థితి విషమించడంతో చేరుతున్నారు. అయితే స్వైన్‌ఫ్లూతోపాటు న్యూమోనియా, మధుమేహం, కాలేయ, హ–ద్రోగ సంబంధిత సమస్యలతో బాధపడుతూ శ్వాస తీసుకోలేని రోగులకు క–త్రిమ శ్వాస కోసం ఏర్పాటు చేసిన 8 వెంటిలేటర్లను ఇన్‌పేషంట్లకు అమరుస్తుండగా రిఫరల్ కేసులతో చేరే రోగులకు అవి దొరకడంలేదు.



దీనికితోడు ఉదయం పూట రౌండ్లకు వచ్చి వెళ్తున్న వైద్యులు మధ్యాహ్నం తర్వాత వచ్చే కేసులను పట్టించుకోవట్లేదని...అందుకే రోగులు మృతిచెందుతున్నారని బంధువులు ఆరోపిస్తున్నారు. నోడల్ ఆఫీసర్ సహా ఇతర వైద్యులు రోగులకు నిత్యం అందుబాటులో ఉండాల్సి ఉన్నా హౌస్‌సర్జన్లు, నర్సులకు బాధ్యతలు అప్పగించి వారు స్వైన్‌ఫ్లూ వార్డు వైపు కూడా వెళ్లట్లేదని తెలుస్తోంది.



ఉస్మానియాలోనూ అంతే...

ఉస్మానియా ఆస్పత్రిలో 20 రోజుల క్రితం 10 పడకలతో స్వైన్‌ఫ్లూ వార్డును ఏర్పాటు చేసి ఒక నోడల్ ఆఫీసర్, మరో స్టాఫ్ నర్సుకు రోగుల బాధ్యతలు అప్పగించినా రోగుల నిష్పత్తి స్థాయిలో పడకలతోపాటు వైద్యులు కూడా లేరు. ఫ్లూ ల క్షణాలతో బాధపడుతున్న రోగులను సైతం జనరల్ వార్డులోని ఇతర రోగుల పక్కనే ఉంచుతున్నారు. రిపోర్టులో పాజిటీవ్‌గా నిర్ధారించాకే ఐసోలేషన్ వార్డుకు తరలిస్తున్నారు. అప్పటికే వైరస్ ఒకరి నుంచి మరొకరికి విస్తరిస్తోంది.



ఇలా ఇప్పటికే 12 మంది హౌస్‌సర్జన్లు, ఇద్దరు స్టాఫ్ నర్సులు ఫ్లూబారిన పడ్డారు. ఐసోలేషన్ వార్డులో ఒక్క వెంటిలేటర్ కూడా లేకపోవడంతో స్వైన్‌ఫ్లూ రోగులను కూడా ఏఎంసీకి తరిలించాల్సి వస్తోందని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. అయితే అత్యవసర పరిస్థితుల్లో పిలిచినా వైద్యులెవరూ రావడం లేదని నర్సులు ఆవేదన  వ్యక్తం చేస్తున్నారు. ఆస్పత్రిలో సబ్బులు, యాంటీసెప్టిక్ లోషన్లు కూడా లేకపోవడం గమనార్హం.



‘ఫీవర్’కు సాధారణ రోగుల క్యూ..

ఉస్మానియా, గాంధీ ఆస్పత్రుల కు నిత్యం స్వైన్‌ఫ్లూ రోగులు వస్తుండటంతో సాధారణ రోగులు ఆయా ఆస్పత్రులకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు. ఆస్పత్రి వాతావరణంలో ఫ్లూ కారక వైరస్ ఎక్కువగా ఉండటంతో అది ఎక్కడ తమకు అంటుకుంటుందోనని అటు వైపు వెళ్లడానికే జంకుతున్నారు. దీంతో ఇటీవల ఆయా ఆస్పత్రుల ఓపీకి వచ్చే రోగుల సంఖ్య గణనీయంగా తగ్గింది. సాధారణ జ్వరంతో బాధపడుతున్న వారు రెండు రోజులుగా చికిత్స కోసం న ల్లకుంటలోని ఫీవర్ ఆస్పత్రికి క్యూ కడుతున్నారు.



అందుబాటులో హోమియో మందులు..

స్వైన్‌ఫ్లూ నివారణకు హోమియో మందులు అందుబాటులో ఉన్నాయని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్‌చందా వెల్లడించారు. రామంతాపూర్ హోమియో వైద్యశాల సహా ఆయుష్ డిస్పెన్సరీల్లో ఉచితంగా లభిస్తాయని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇప్పటి వరకు 1,472 మంది శాంపిల్స్ పరీక్షించగా.. 523 మందికి ఫ్లూ ఉన్నట్లు నిర్ధారణ అయిందన్నారు. అందులో 25 మంది చనిపోయారని వెల్లడించారు.



గత ఐదు రోజుల్లో (29 తేదీ నాటికి) 205 పాజిటివ్ కేసులు నమోదయ్యాయన్నారు. 2009తో పోలిస్తే స్వైన్‌ఫ్లూ వైరస్ చాలా బలహీన పడిందన్నారు. జిల్లా, ఏరియా, బోధనాసుపత్రుల్లో అవసరమైన మేర మందులు అందుబాటులో ఉన్నాయని  సురేశ్‌చందా తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top