Alexa
YSR
‘ప్రతి పల్లెలోనూ అందరికీ గ్యాస్‌ సరఫరా, ప్రతి మహిళకూ ఆర్థిక భరోసా నా ధ్యేయం’
మీరు ఇక్కడ ఉన్నారు: హోం తెలంగాణకథ

కరెంటుకు.. కొత్త వెలుగు!

Sakshi | Updated: August 13, 2017 00:35 (IST)
కరెంటుకు.. కొత్త వెలుగు!

కొత్తగూడెం జిల్లాలో సిద్ధమవుతున్న 2 భారీ థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలు
► కేటీపీఎస్‌ 7వ దశ ప్లాంట్‌ నిర్మాణం 70 శాతం పూర్తి
► ఈ ఏడాది డిసెంబర్‌లోగా విద్యుదుత్పత్తి దిశగా చర్యలు..
► వివాదాలు, అడ్డంకులను అధిగమించిన భద్రాద్రి ప్లాంట్‌
వచ్చే ఏడాది డిసెంబర్‌లోగా పూర్తికి లక్ష్యం


రాష్ట్రానికి వెలుగులు అందించేందుకు రెండు భారీ థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలు సిద్ధమవుతున్నాయి. కొత్తగూడెం జిల్లా పాల్వంచలో నిర్మిస్తున్న 800 మెగావాట్ల కొత్తగూడెం థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం (కేటీపీఎస్‌) 7వ దశ ప్లాంట్‌ నిర్మాణ పనులు ఈ ఏడాది డిసెంబర్‌లోగా పూర్తి కానున్నాయి. ఇదే జిల్లాలోని మణుగూరులో నిర్మిస్తున్న 1,080 మెగావాట్ల భద్రాద్రి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం (బీటీపీఎస్‌) వచ్చే ఏడాది డిసెంబర్‌లోగా నిర్మాణం పూర్తి చేసుకుని ఉత్పత్తిని ప్రారంభించనుంది.

పర్యావరణ అనుమతులు ఆలస్యంగా రావడం, నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌(ఎన్జీటీ) కేసుల వల్ల ముందుగా నిర్దేశించుకున్న భద్రాద్రి ప్లాంట్‌ నిర్మాణ గడువు తీరిపోయింది. గత ఏప్రిల్‌లోనే భద్రాద్రి ప్లాంట్‌ పనులు ప్రారంభించగా, వచ్చే ఏడాది డిసెంబర్‌లోగా పనులు పూర్తి చేసి విద్యుదుత్పత్తి ప్రారంభించాలని రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థ(జెన్‌కో) కొత్త గడువును పెట్టుకుంది. అలాగే దాదాపు 70 శాతం నిర్మాణం పూర్తయిన కేటీపీఎస్‌ 7వ దశ ప్లాంట్‌ను ఈ ఏడాది డిసెంబర్‌లోగా పూర్తి చేసేందుకు జెన్‌కో యుద్ధప్రాతిపదికన పనులు చేస్తోంది.    
– సాక్షి, హైదరాబాద్‌

అడ్డంకులు అధిగమించిన భద్రాద్రి..
కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో మూడేళ్ల కింద తీవ్ర విద్యుత్‌ సంక్షోభం నెలకొని ఉన్న సమయంలో, కేవలం 24 నెలల కాలంలో భద్రాద్రి విద్యుత్‌ కేంద్రం నిర్మిస్తామని కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ‘బీహెచ్‌ఈఎల్‌’ముందుకు వచ్చింది. అప్పటికే బీహెచ్‌ఈఎల్‌ వద్ద 270 మెగావాట్ల సామర్థ్యం గల నాలుగు యూనిట్లతో మొత్తం 1,080 మెగావాట్ల సబ్‌ క్రిటికల్‌ థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం నిర్మాణానికి అవసరమైన యంత్రాలు, పరికరాలు సిద్ధంగా ఉండడంతో అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం బీహెచ్‌ఈఎల్‌ ప్రతిపాదనకు అంగీకరించింది. 24 నెలల్లోపు భద్రాద్రి విద్యుత్‌ కేంద్రం నిర్మాణం పూర్తి చేసేందుకు 2015 మార్చి 21న జెన్‌కో, బీహెచ్‌ఈఎల్‌ మధ్య ఒప్పందం జరిగింది.

రూ.7,290.60 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ విద్యుత్‌ కేంద్రం గత మార్చి 31లోపే పూర్తి కావాల్సి ఉండగా వివాదాలు, ఎన్జీటీ కేసులతో ఈ ప్లాంట్‌ చిక్కుల్లో పడింది. పర్యావరణ అనుమతులు రావడానికి ముందే జెన్‌కో నిర్మాణ పనులు చేపట్టడంతో ఎన్జీటీ కేసులు చుట్టుముట్టాయి. సబ్‌ క్రిటికల్‌ టెక్నాలజీపై కేంద్ర విద్యుత్‌ శాఖ ఆంక్షలు ఉండడంతో పర్యావరణ అనుమతులు ఆలస్యంగా లభించాయి. ఈ అవాంతరాలను అధిగమించి గత ఏప్రిల్‌ 1న పనులను ప్రారంభించగా, ఇప్పటి వరకు 5 శాతం వరకు పనులు పూర్తయ్యాయి. ఇటీవల కురిసిన వర్షాలతో మళ్లీ పనులకు అంతరాయం కలిగింది.

రూ.7,290.60 కోట్ల అంచనా వ్యయంలో రూ.5,044 కోట్లను ప్లాంట్‌ నిర్మాణం కోసం బీహెచ్‌ఈఎల్‌కు చెల్లించాల్సి ఉండగా, ఇప్పటికే యంత్రాలు, పరికరాల కోసం జెన్‌కో రూ.1,975.25 కోట్లను బీహెచ్‌ఈఎల్‌కు చెల్లించింది. ఈ యంత్రాలు, పరికరాలను ప్లాంట్‌ నిర్మాణ స్థలానికి రెండేళ్ల కిందే తరలించినా, అడ్డంకుల వల్ల పనులు 5 శాతానికి మించి జరగలేదు. చిమ్నీలు, కూలింగ్‌ టవర్ల కోసం తవ్విన భారీ గుంతల్లో చేరిన వర్షపు నీటిని బయటకు తోడి మళ్లీ పనులను పునః ప్రారంభించారు.

కొత్తగూడెం.. కేవలం మూడేళ్లలో పూర్తి
అధునాతన సూపర్‌ క్రిటికల్‌ టెక్నాలజీతో రాష్ట్రంలో నిర్మిస్తున్న తొలి విద్యుత్‌ ప్లాంటైన 800 మెగావాట్ల కేటీపీఎస్‌ 7వ దశ విద్యుత్‌ కేంద్రాన్ని కేవలం మూడేళ్లలో నిర్మించి రికార్డు సృష్టించాలని జెన్‌కో లక్ష్యంగా పెట్టుకుంది. థర్మల్‌ విద్యుత్‌ ప్లాంట్ల నిర్మాణానికి గతంలో కనీసం 8 ఏళ్ల సమయం పట్టగా, కేటీపీఎస్‌ 7వ దశను మాత్రం మూడేళ్లలోపు నిర్మించేందుకు జెన్‌కో యుద్ధప్రాతిపదికన పనులు నిర్వహిస్తోంది. రూ.5,548 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్లాంట్‌ నిర్మించేందుకు బీహెచ్‌ఈఎల్‌తో జెన్‌కో ఒప్పందం కుదుర్చుకుంది.

2015 జనవరి 1 నుంచి 24 నెలల్లోపు ఈ ప్లాంట్‌ పనులు పూర్తి చేయాల్సి ఉండగా, ఇప్పటి వరకు రూ.2,634 కోట్ల వ్యయంతో 70 శాతం వరకు పనులు పూర్తయ్యాయి. బాయిలర్‌ పనులు 90 శాతం పూర్తికాగా, టర్బైన్, జనరేటర్‌ స్టాటర్, కోల్‌ ప్లాంట్‌ పనులు సైతం దాదాపు సగానికి పైగా పూర్తయ్యాయి. 5 వేల మంది కార్మికులతో రాత్రింబవళ్లు పనులు జరుగుతుండగా, ఈ ఏడాది చివరిలోగా బాయిలర్‌ను లైటప్‌ చేయాలని జెన్‌కో లక్ష్యంగా పెట్టుకుంది. ఏవైనా కారణాలతో ఆలస్యమైతే వచ్చే మార్చిలోగా నిర్మాణం పూర్తి చేసి విద్యుదుత్పత్తి ప్రారంభిస్తామని అధికారవర్గాలు తెలిపాయి.   

మార్చిలోగా భద్రాద్రి లైటప్‌ చేస్తాం
ఎన్జీటీ కేసుతో భద్రాద్రి నిర్మాణం రెండేళ్లు జాప్యమయింది.అయినా యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేసి వచ్చే మార్చిలోగా ఈ ప్లాంట్‌కి సంబంధించిన బాయిలర్లను లైటప్‌ చేస్తాం. ఇప్పటికే 70% పనులు పూర్తయిన కేటీపీఎస్‌ 7వ దశ ప్లాంట్‌ పనులను డిసెంబర్‌లోగా పూర్తి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. వర్షాలతో కొన్ని రోజులుగా అంతరాయం కలుగుతోంది. వర్షాలు తగ్గిన తర్వాత కార్మికుల సంఖ్యను మరింత పెంచి పనుల వేగాన్ని పెంచుతాం.     – ప్రభాకర్‌రావు, జెన్‌కో సీఎండీ


వ్యాఖ్యలు

Advertisement

Advertisement

Advertisement

EPaper

పట్టాలు తప్పిన ఉత్కళ్‌

Sakshi Post

Sri Lanka Squander Solid Start To Collapse To 216

The home team’s ordinary batting show came after Virat Kohli won a fourth-consecutive toss on this t ...

Advertisement

© Copyright Sakshi 2017. All rights reserved. | ABC