ఇద్దరు చిన్నారుల బలి

ఇద్దరు చిన్నారుల బలి


అప్పటివరకు తల్లిదండ్రుల ముందు టైర్‌ ఆట ఆడుకుంటున్న అన్నాచెల్లె ఇద్దరు ఒకే సమయంలో మృత్యుఒడిలోకి చేరారు. నక్కలగండి ప్రాజెక్ట్‌ పనుల్లో భాగంగా తీసిన నీటి గుంతలో పడి కానరాని లోకాలకు వెళ్లిపోయారు. చిన్నారుల మృతితో చందంపేట మండలం తెల్దేవర్‌పల్లి పరిధిలోని నక్కలగండి తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రాజెక్ట్‌ అధికారుల నిర్లక్ష్యంతోనే ఈ దుర్ఘటన జరిగిందని మృతుల బంధువులు, స్థానికులు ప్రాజెక్ట్‌ క్యాంప్‌ కార్యాలయంపై దాడికి దిగడంతో ఉద్రిక్త్త పరిస్థితులు నెలకొన్నాయి.



చందంపేట (దేవరకొండ) :నక్కలగండి ప్రాజెక్ట్‌ ప్రారంభానికి ముందే ఇద్దరు చిన్నారులను బలి తీసుకుంది. ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ ప్రకటించి నిర్వాసితులను అక్కడి నుంచి తరలించకుండానే చేపట్టిన పనుల్లో భాగంగా తీసిన గుంతలో పడి ఇద్దరు చిన్నారులు విగత జీవులయ్యారు. అప్పటి వరకు తల్లిదండ్రుల ముందు ఆడుకుంటున్న అన్నాచెల్లెళ్లు ఇద్దరు ఒకే సమయంలో మృత్యు ఒడిలోకి చేరారు. నక్కలగండి ప్రాజెక్ట్‌ పనుల్లో భాగంగా తీసిన నీటి గుంతలో పడి అన్నాచెల్లేళ్లు మృతిచెందిన ఘటన చందంపేట మండలం తెల్దేవర్‌పల్లి పరిధిలోని నక్కలగండి తండాలో బుధవారం చోటుచేసుకుంది.



 గ్రామస్తులు, పోలీసుల కథనం ప్రకారం... ఎస్సెల్బీసీ ప్రాజెక్టులో అంతర్భాగంగా చేపడుతున్న నక్కలగండి ఎత్తిపోతల ప్రాజెక్ట్‌ పనులు సాగుతున్నాయి. కాగా నక్కలగండి ప్రాజెక్ట్‌లో భాగంగా తెల్దేవర్‌పల్లి పరిధిలోని నక్కలగండి తండా ముంపునకు గురికానుంది. ఈ క్రమంలో ప్రాజెక్ట్‌ పనులు చేపడుతున్న సదరు కాంట్రాక్ట్‌ కంపెనీ నక్కలగండి తండా సమీపంలో బండ్‌ నిర్మాణ పనులు చేపడుతోంది. అయితే బండ్‌కు కావాల్సిన మట్టిని నక్కలగండి తండా సమీపంలో పెద్ద గోతులు తీసి మట్టిని సేకరించారు. ఈ క్రమంలో బండ్‌ నిర్మాణం కోసం తీసిన గుంతలో మొన్న కురిసిన వర్షానికి పెద్దఎత్తున నీరు వచ్చి చేరింది.



 అయితే తండా సమీపంలో ఉండడంతో ఆ తండాకు చెందిన సభావట్‌ శంకర్, వరి దంపతులకు కుమారుడు దేన(9), మౌనిక(7)లు ఇంటి ముందు టైర్‌ ఆట ఆడుకుంటున్నారు. ఈ క్రమంలో టైర్‌ వెళ్లి సమీపంలోని బండ్‌ నిర్మాణానికి మట్టి కోసం తీసిన గుంతలో పడింది. అయితే టైర్‌ను తీసుకునేందుకు ప్రయత్నించిన చిన్నారులిద్దరూ ఆ నీటి గుంతలో పడిపోయారు. ఈ విషయాన్ని సాయంత్రం వరకు తల్లిదండ్రులు కానీ తండావాసులు కానీ గుర్తించలేదు. సాయంత్రం వరకు ఇద్దరు చిన్నారులు ఇంటికి రాకపోవడంతో సమీపంలో చిన్నారుల కోసం వెదకడం ప్రారంభించారు. అయితే ఆ నీటి గుంతకు సమీపంలో చిన్నారుల చెప్పులు ఉండడంతో ఆ చుట్టుపక్కల గోతుల వద్దకు వెళ్లి చూడగా అప్పటికే ఆ ఇద్దరు చిన్నారులు విగత జీవులై నీటిలో తేలియాడుతూ కనిపించారు. అయితే శంకర్, వరి దంపతులకు ఐదుగురు పిల్లలు కాగా అందులో నలుగురు ఆడ పిల్లలు, ఒక కుమారుడు ఉన్నారు.



క్యాంప్‌ అధికారులపై దాడికి యత్నం

ప్రాజెక్ట్‌ అధికారులు నిర్లక్ష్యంగా పనులు చేపడుతుండడం వల్లే తండాకు చెందిన ఇద్దరు చిన్నారులు మృతి చెందడంతో కోపోద్రిక్తులైన ప్రజలు కాంట్రాక్ట్‌ చేపడుతున్న రాఘవా కన్‌స్ట్రక్షన్స్‌ నిర్వాహకులపై దాడికి యత్నించారు. క్యాంప్‌ వద్దకు వెళ్లి క్యాంప్‌లో కార్యాలయం అద్దాలు, వాహనాలను ధ్వంసం చేశారు. ఇదిలా ఉండగా ప్రాజెక్ట్‌ నిర్వాహకులు వారికి చిక్కకుండా జాగ్రత్త పడ్డారు. క్యాంప్‌ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొనడంతో దేవరకొండ ఆర్డీఓ లింగ్యానాయక్, డీఎస్పీ రవికుమార్, పలువు రు సీఐలు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. అయితే ప్రభుత్వ పరంగా సాయం అందించడానికి అవకాశం లేకపోవవడంతో వారికి మరేవిధంగానైనా సాయం అందేలా చూస్తామని  బాధిత బంధువులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top