రెండున్నరేళ్లకే నూరేళ్లు..!

రెండున్నరేళ్లకే నూరేళ్లు..!

- ఆడుకుంటూ.. పట్టాలపైకి..  

- రైలు ఢీకొని కవలలు మృతి

 

కామారెడ్డి క్రైం: ఆడుకుంటూ తమకు తెలియకుండానే వారు వేసిన అడుగులు మృత్యువు వైపు నడిపించాయి. ఇంటికి సమీపంలోని రైలు పట్టాలపై ఆడుకుంటుండగా.. రైలు రూపంలో వచ్చిన మృత్యువు వారిని కబళిచింది. ముద్దుముద్దు మాటలతో సందడి అప్పటి వరకు సందడి చేసిన ఆ కవల చిన్నారులు విగత జీవులై కనిపించడం గ్రామస్తులను కలచివేసింది. కన్నవారికి కడుపుకోతను మిగిల్చిన ఈ ఘటన కామారెడ్డి మండలంలోని నర్సన్నపల్లిలో సోమవారం జరిగింది. నర్సన్నపల్లి గ్రామానికి చెందిన చందన భానుశ్రీ, చంద్రంలకు రెండున్నరేళ్ల క్రితం కవల పిల్లలు విద్వేశ్, విఘ్నేశ్‌లు ఉన్నారు.



చంద్రం కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. సోమవారం ఉదయమే పనిపై వెళ్లాడు. భానుశ్రీ ఏడు నెలల గర్భిణి. మధ్యాహ్నం 2 గంటల వరకు పడుకున్న పిల్లలు.. లేచి ఆడుకోవడానికి ఇంటి పక్కనే ఉన్న కొట్టం దగ్గరికి వెళ్లారు. అక్కడి నుంచి ఇంటికి సమీపంలోని రైలు పట్టాలపైకి చేరి ఆడుకోసాగారు. వీరి ఇల్లు గ్రామ శివారులో ఉండడంతో చిన్నారులు రైలు పట్టాలపై ఉన్న విషయాన్ని ఎవరూ గమనించలేదు.



మధ్యాహ్నం 3 గంటల సమయంలో హైదరాబాద్‌ నుంచి కామారెడ్డి వైపు వస్తున్న దేవగిరి ఎక్స్‌ప్రెస్‌ పట్టాలపై ఉన్న వీరిని ఢీ కొట్టింది. అయితే, పట్టాలపై పిల్లలను కొద్దిదూరంలో గమనించిన లోకోపైలట్‌ రైలును ఆపడానికి బ్రేక్‌ వేసినా ఫలితం లేకపోయింది. దీంతో కవలలు అక్కడికక్కడే మరణించారు. కవలల్లో ఒకరి మృతదేహం పట్టాల పక్కన పడిపోగా మరొకరి మృతదేహం తునాతునకలైంది. లోకో పైలట్‌ ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు çఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు సంఘటనాస్థలానికి వచ్చి బోరున విలపించారు. సంఘటనాస్థలాన్ని కామారెడ్డి రూరల్‌ ఇన్‌చార్జి సీఐ కోటేశ్వర్‌రావు, దేవునిపల్లి ఎస్సై సంతోష్‌కుమార్, రైల్వే పోలీసులు సందర్శించి, వివరాలు సేకరించారు.
Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top